కేజ్రీవాల్, కవిత కేసులు వేర్వేరు : అభిషేక్ మను సింఘ్వీ

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో విచారణ పూర్తయ్యాకే  ఆమె అరెస్టు : అభిషేక్ మను సింఘ్వీ
  • చట్టం ముందుఅందరూ సమానమే
  • లాయర్లు ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచన

హైదరాబాద్, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్​కు సంబంధించి కేజ్రీవాల్, కవిత కేసులు వేర్వేరు అని.. ఒకదానితో ఒకటి సంబంధం లేనివని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. ఈ కేసులో విచారణ పూర్తయ్యాకే కవితను అరెస్టు చేశారని చెప్పారు. న్యాయ వ్యవస్థ ముందు అందరూ సమానమేనన్నారు. గురువారం పీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బేగంపేట్​లోని హోటల్ హరిత ప్లాజాలో సింఘ్వీకి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదులు ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు.

అప్పుడే ప్రజల్లో ఆదరణ ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పుడు న్యాయవాదులు అధికారం ఎటు వైపు ఉంటే అటు వైపే పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది న్యాయ వ్యవస్థకు, న్యాయవాదులకు మంచిది కాదని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలోని ప్రతి మహిళకు లీగల్ సెల్ భరోసా ఇవ్వాలి. లీగల్ సెల్ హైదరాబాద్ కే పరిమితం కావద్దు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి చురుగ్గా పని చేయాలి” అని సూచించారు. 

మన గొంతుక వినిపిస్తరు : భట్టి 

రాజ్యసభలో తెలంగాణ గొంతుకను అభిషేక్ మను సింఘ్వీ వినిపిస్తారని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆయనను రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించామని చెప్పారు. విభజన చట్టం కింద రాష్ట్రానికి రావాల్సిన హక్కులు పెండింగ్ లో ఉన్నాయని.. వాటిపై చట్టసభల్లో, కోర్టుల్లో సింఘ్వీ వాదిస్తారని తెలిపారు. ఆయన తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు.

న్యాయవాదుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్ గౌడ్ చెప్పారు. జూనియర్ లాయర్లకు స్టైఫండ్, ఇండ్ల స్థలాలు తదితర విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. హైకోర్టు కొత్త భవనం పనులు తొందరగా పూర్తయ్యేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ పొన్నం అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.