Health Alert : వానాకాలంలో పిల్లల ఆరోగ్యం భద్రం.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి

వానాకాలంలో పిల్లలకు ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. కావాలనే వానలో తడుస్తుంటారు. సాధారణంగా పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ. దాంతో జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడతారు. ఈ కాలంలో ఇంట్లోనే కాదు, ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.  తరచూ  డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లేకంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీలైనంత వరకు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 

  • ఈ కాలంలో పిల్లలకు రోగనిరోధక శక్తి పంచే ఫుడ్ ఇవ్వాలి.
  •  తినే పదార్థాల్లో విటమిన్ సి ఉండేలా చూసుకోవాలి.   ఈ రోజుల్లో పిల్లలు పానీపూరి, మిర్చిబజ్జీల్లాంటివి ఎక్కువ తింటుంటారు. చిరుతిళ్లు బయటవి కాకుండా ఇంట్లో వండి పెట్టడం బెటర్.
  • స్కూల్ నుంచి తడిచి వస్తే, వెంటనే స్నానం చేయించి పొడి బట్టలు వేయాలి. 
  • పిల్లల గది కూడా చల్లగా లేకుండా పొడిగా, వెచ్చగా ఉండేలా చూడాలి.
  • ఏవైనా తినేముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోమని చెప్పాలి. లేదంటే చేతుల ద్వారా బ్యాక్టీరియా లోపలకు వెళ్లొచ్చు. o పిల్లలు ఇంట్లో గచ్చు మీద ఆడుకుంటుంటారు. కానీ వానాకాలంలో గచ్చు చల్లగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కింద ఆడుకోనీయకుండా చూడాలి.
  • చిన్నపిల్లలైతే పాదాలకు సాక్స్ వేయడం మర్చిపోకూడదు. బయటకెళ్తే షూ వేయాలి.
  • బయటకు పంపేటప్పుడు గొడుగు లేదా రెయిన్కోటు లేకుండా పంపకూడదు.
  • వారానికి ఒకసారైనా పిల్లల దుస్తులు, వాళ్లు వాడే వస్తువులు వేడి నీళ్లతో శుభ్రంగా ఉతకాలి.
  • ఈ కాలంలో ఇంట్లోకి దోమలు, ఈగలు లాంటి క్రిమికీటకాలు రాకుండా చూసుకోవాలి.