- మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
నల్గొండ, వెలుగు : పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే ఉమ్మడి నల్గొండ జిల్లాను అశ్రద్ధ చేశారని తెలిపారు. ఐదేండ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
నల్గొండ జిల్లాలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆయన శుక్రవారం బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కరువు ప్రాంతమైన బ్రాహ్మణ వెల్లెంలకు ఉదయ సముద్రం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు గొప్ప విషయమని చెప్పారు.
ప్రాజెక్టు అనుమతులు, టెక్నికల్ పనులు యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేస్తామని, వారం రోజుల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మిగిలిపోయిన 730 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, డిండి ప్రాజెక్టు, మిర్యాలగూడ పరిధిలోని ఐదు లిప్టుల ప్రాజెక్టు, బ్రాహ్మణ వెల్లెంల, నక్కలగండి, పిలాయిపల్లి ధర్మారెడ్డి కాల్వ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వివరించారు. మూసీ పునరుజ్జీవనానికి నల్లగొండ ప్రజలు అండగా ఉన్నారన్నారు. ఏడాది పాలన కాలంలోనే విప్లవాత్మక మార్పులు తెసుకొచ్చామన్నారు.
వచ్చే నాలుగేండ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి చేసి చూపుతామన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు గత పదేండ్ల పాలకులు అసలు పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి కావడం సంతోషంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తికి మంత్రి ఉత్తమ్ సహకారం అందించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ అన్నం పెట్టే స్థాయికి చేరుకుందని, 1.50కోట్ల టన్నుల ధాన్యం పండించి అగ్రగ్రామిగా నిలిచామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు.
తెలంగాణ ప్రజాపాలన వచ్చాకనే రైతుల కష్టాలు తీరాయని రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ పాల్గొన్నారు.