చీల్చి చెండాడుతానని అసెంబ్లీకి డుమ్మా

  • ఒక్కరోజు మురిపెంగా కేసీఆర్ తీరు 
  • శనివారం సభలో కనిపించని ప్రతిపక్ష నేత
  • ఎన్నికల్లో ఓడిపోయినంక గురువారం తొలిసారి సభకు హాజరు
  • ఆయన మాటలు విని ఇక రెగ్యులర్‌‌‌‌గా వస్తారనుకున్న బీఆర్​ఎస్​ నేతలు
  • తీరా.. అసెంబ్లీకి రాని గులాబీ బాస్​
  • అధికారపక్షానికి సమాధానం చెప్పలేక ఇబ్బందిపడ్డ హరీశ్ 

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చకు కేసీఆర్ డుమ్మా కొట్టారు. ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతానని గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్​ వద్ద ప్రకటించిన ఆయన.. శనివారం అసలు సభకే రాలేదు. ఇంటికే పరిమితమయ్యారు. కేసీఆర్​ తీరును అధికారపక్ష నేతలు  కడిగిపారేశారు. చీల్చి చెండాడుతానని చెప్పిన ఆయన సభకు రాకుండా ఏడికిపోయారని హరీశ్‌రావు, కేటీఆర్‌‌ను అధికారపక్షం నేతలు ప్రశ్నించారు. 

‘‘కేసీఆర్ మమ్మల్ని ఎట్ల చీల్చి చెండాడుతాడో చూద్దామని సభకు పొద్దుగల్ల 9 గంటలకే వచ్చి కూర్చున్న’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సెటైర్​ వేశారు. సభకు రాకుండా కేసీఆర్​ ఎక్కడ దాక్కున్నారని ఆయన నిలదీశారు. చీల్చి చెండాడుతానని హెచ్చరికలు చేసిన ప్రతిపక్ష నేత ఏడ పడుకున్నారని విప్ బీర్ల ఐలయ్య ప్రశ్నించారు. లాబీల్లో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌‌ తీరుపై సెటైర్లు వేశారు. దీంతో బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా బడ్జెట్​ చర్చలో పాల్గొన్న హరీశ్​రావు ఒకింత ఇబ్బందికి గురయ్యారు. 

రాక రాక ఒక్కరోజు వచ్చి..!

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కేసీఆర్ సభకు రావడమే మానేశారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని సీఎం రేవంత్‌, మంత్రులంతా పలుమార్లు ప్రశ్నించారు. ఎట్టకేలకు గురువారం ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు. దీంతో బీఆర్‌‌ఎస్ నేతలు భారీగా హడావుడి చేశారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కేసీఆర్‌.. బడ్జెట్ అంతా గ్యాస్, ట్రాష్ అని విమర్శించారు. 

ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతానని హెచ్చరించి వెళ్లిపోయారు. అంతే..! ఆ తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. తిరిగి అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభం కాగా.. కేసీఆర్​ మాత్రం అటెండ్​ కాలేదు. గురువారం అసెంబ్లీకి వచ్చి, ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతానని చెప్పిన కేసీఆర్ మాటలు విని బీఆర్​ఎస్​ నేతలు కూడా.. ఇకపై తమ సారు రెగ్యులర్​గా వస్తారని ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆయన కనిపించకపోయేసరికి  తెల్లముఖం వేశారు. సభలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ స్థానంలో హరీశ్‌రావు మాట్లాడడంతో మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలకు కూడా హరీశ్​రావే టార్గెట్ ​అయ్యారు.