ఫిరాయింపులపై కోర్టు ఏ ఆర్డర్​ ఇచ్చినా మాకే మేలు : సీఎం రేవంత్​రెడ్డి

  • పార్టీ మారేవాళ్లపై అనర్హత వేటు పడ్తుందంటే మా ప్రభుత్వానికి ఢోకా ఉండదు
  • సర్కారును కూలుస్తమన్నోళ్లే ఇప్పుడు ఫిరాయింపులపై లొల్లిపెడ్తున్నరు: సీఎం రేవంత్​
  • ఫిరాయింపులను మొదలుపెట్టిందే బీఆర్ఎస్
  • బై ఎలక్షన్స్ పేరుతో కేటీఆర్ సైకలాజికల్ గేమ్ 
  • కేసీఆర్ ​లైన్​లోనే పాడి కౌశిక్​రెడ్డి కామెంట్స్
  • బతకడానికి వచ్చినోళ్ల ఓట్లు కావాలెగానీ 
  • వాళ్లకు టికెట్లు ఇవ్వొద్దా?.. ఇదేనా బీఆర్​ఎస్​ విధానం?
  • నాడు కాంగ్రెస్​ను కాదని ఒవైసీకి పీఏసీ పోస్టు ఎట్ల ఇచ్చిన్రు?
  • తాము బీఆర్​ఎస్ ఎమ్మెల్యేనే పీఏసీ చైర్మన్​గా చేశామని వెల్లడి
  • ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి చిట్​చాట్

న్యూఢిల్లీ, వెలుగు : పార్టీ ఫిరాయింపులపై కోర్టు ఏ ఆర్డర్​ ఇచ్చినా అధికారంలో ఉన్న కాంగ్రెస్​ పార్టీకే మేలు జరుగుతుందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. పార్టీ మారేవాళ్లపై అనర్హత వేటు పడ్తుందంటే తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, ముఖ్యమంత్రిగా తాను కూడా హ్యాపీగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్  నుంచి పది పదిహేను మందిని లాగి ప్రభుత్వాన్ని కూలుస్తామని ప్రతిపక్షాలు పదే పదే చెప్పాయి. కుట్రలు చేశాయి.  ఇప్పుడు వాళ్లే పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాడ్తున్నరు” అని అన్నారు.  

‘‘కేసీఆర్ లక్కీ నెంబర్ 66 ప్రస్తుతం మా దగ్గర ఉంది. ఫిరాయింపులు వద్దని వాళ్లే కోరుతున్నప్పుడు మా 66 మంది ఎమ్మెల్యేలు కలిసే ఉంటారు కదా..! అప్పుడు మాకు వచ్చిన నష్టమేమీ ఉండదు కదా!’’  అని తెలిపారు. ఫిరాయింపులను మొదలుపెట్టిందే బీఆర్​ఎస్​ అని, పదేండ్లు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కున్నారని ఆయన అన్నారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని గురువారం తుగ్లక్ రోడ్​లో ఢిల్లీ జర్నలిస్ట్​లు మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఇటీవల జేఎన్​జే హౌసింగ్​ సొసైటీలో లబ్ధిపొందిన పలువురు ఆయనను శాలువాలతో సత్కరించారు. అనంతరం సీఎం రేవంత్​రెడ్డి కాసేపు మీడియాతో చిట్​చాట్​ చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఐదేండ్లు ఉండాలని బీఆర్ఎస్, బీజేపీ కోరుకోవడం లేదని.. ప్రభుత్వాన్ని పడగొడ్తామంటూ తిరుగుతున్నాయని మండిపడ్డారు. 

బై ఎలక్షన్స్ పేరిట కేటీఆర్​ సైకలాజికల్ గేమ్ 

బై ఎలక్షన్స్ పేరుతో కేటీఆర్​ సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారని సీఎం రేవంత్​ విమర్శించారు. ‘‘దేశంలో అనేక చోట్ల పాలక, ప్రతిపక్షాల నుంచి  ఫిరాయింపులు జరిగాయి. అన్నిచోట్లా బై ఎలక్షన్స్ రాలేదు కదా?  కేసీఆర్, కేటీఆర్ కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉండదు కదా” అని అన్నారు.  కాంగ్రెస్​ను ఇబ్బంది పెట్టేందుకు ఫిరాయింపులపై ఒకవేళ బీఆర్ఎస్, బీజేపీ నేతలు కోర్టులను ఆశ్రయించినా తమకు వచ్చే నష్టమేమీ లేదని చెప్పారు. ఆ రెండు పార్టీ నేతలు కలిసి ఫిరాయింపులపై స్పష్టమైన కోర్టు ఆర్డర్ తెస్తే.. తమ ప్రభుత్వం పకడ్బందీగా ఉన్నట్టే అని అన్నారు. 

ఒకటి, రెండు, మూడు బై ఎలక్షన్లు తెస్తామంటున్న ప్రతిపక్షాల కామెంట్లపై తాను లోతుగా వెళ్లదలచుకోలేదని ఆయన చెప్పారు. ‘‘ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తే అనర్హత వేటు పడే పరిస్థితే ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఫిరాయింపులపై స్పష్టమైన చట్టం వస్తే.. బీఆర్ఎస్  నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ లోని 65 మంది ఎమ్మెల్యేలు కలిసే ఉంటారు. ఇక అప్పుడు సమస్య ఏముంది?” అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చుతామని ప్రతిపక్షాలు స్టేట్​మెంట్లు ఇచ్చినప్పటి నుంచే ఫిరాయింపులు మొదలయ్యాయని ఆయన అన్నారు.  

అప్పుడు కాంగ్రెస్​ను కాదని ఒవైసీకి పీఏసీ పోస్ట్​ ఎట్లిచ్చిన్రు?

‘‘మొన్నటి అసెంబ్లీ సమావేశాల చివరి రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38 అని స్పీకర్ ప్రకటించారు. మరి అప్పుడే తమ సంఖ్య 38 కాదని బీఆర్​ఎస్​ నేతలు ఎందుకు చెప్పలేదు? పార్టీ ఫిరాయింపులపై ఎందుకు వాళ్లు నోరుపెదపలేదు?’’ అని సీఎం రేవంత్​ ప్రశ్నించారు. పీఏసీ ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించిందన్నారు. అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఆయనకు పీఏసీ చైర్మన్​గా అవకాశం ఇచ్చామని తెలిపారు. కానీ, 2018 – 2023 వరకు కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నా.. 

ఎంఐఎం పార్టీకి చెందిన అక్బరుద్దీన్ ఒవైసీ ఎలా పీఏసీ చైర్మన్ అయ్యారని బీఆర్ఎస్ నేతలను ఆయన నిలదీశారు. అప్పుడు కాంగ్రెస్​కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తే.. స్పీకర్​ది విచక్షణాధికారం అన్నారని, మరి ఇప్పుడు అదే విచక్షణాధికారం ఇప్పటి స్పీకర్​కు ఉండదా? అని ప్రశ్నించారు. ‘‘2014లో టీడీపీ నుంచి బీఏసీలో ఎర్రబెల్లి, నా పేరుతో చంద్రబాబు లెటర్ ఇస్తే.. కనీసం నన్ను స్పీకర్ చాంబర్​లోకి కూడా అనుమతించలేదు. అనంతరం ఎర్రబెల్లి బీఆర్ఎస్ పార్టీలో చేరితే.. టీడీపీ ఫ్లోర్ లీడర్ గా చంద్రబాబు మరోసారి లెటర్ ఇచ్చారు. కానీ, నాకు టీడీపీ ఫ్లోర్ లీడర్​గా కూడా గుర్తింపు కూడా ఇవ్వలేదు. మా పాలనలో మాత్రం బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, లెఫ్ట్ పార్టీలకు బీఏసీలో సముచిత న్యాయం కల్పిస్తున్నం” అని ఆయన వివరించారు.  

సీనియారిటీ ప్రాతిపదికన వేర్వేరు అక్రెడిటేషన్లు

అర్హత, అనుభవాలను పరిగణనలోకి తీసుకొని జర్నలిస్టులను వడబోయాలని, అప్పుడే ప్రొఫెషనల్స్​కు గౌరవం దక్కుతుందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. అందుకే కొత్త అక్రెడిటేషన్ల మంజూరుకు సరైన విధివిధానాలు రూపొందించాలని, ఇందులో జర్నలిస్టు సంఘాలు కీలకపాత్ర పోషించాలన్నారు.  ఈ విషయంలో మీడియా అకాడమీ, జర్నలిస్టు సంఘాలు తీసుకునే తుది నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. సీనియారిటీ ప్రాతిపదికన జర్నలిస్టులకు వేర్వేరు కార్డులు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. సీనియర్లకు మాత్రమే  అసెంబ్లీ, సెక్రటేరియెట్​లోకి అనుమతిచ్చేలా విధానాలు ఉండాలని పేర్కొన్నారు. 

బీఆర్ఎస్ పార్టీ లైన్​లోనే కౌశిక్ కామెంట్స్​ 

బతకడానికి వచ్చిన వాళ్లకు పదవులెందుకన్న బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డి​కామెంట్స్​ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ లైన్​లోనే ఉన్నాయని , ఆ బతకడానికి వచ్చిన వారి ఓట్లతోనే హైదరాబాద్​లో బీఆర్ఎస్ ​ఎమ్మెల్యేలు గెలిచారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సీఎం రేవంత్​ హితవుపలికారు. ‘‘ఏపీ వాళ్లను అవమానించేలా కౌశిక్ మాట్లాడాడు. దీనిపై బీఆర్​ఎస్​ చీఫ్​ సమాధానం చెప్పాలి. ఒకవేళ కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ రావు అనుమతితోనే  కౌశిక్  ఈ మాటలు మాట్లాడితే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 

వారికి తెలియకుండా కౌశిక్ రెడ్డి మాట్లాడి ఉంటే  పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి’’ అని  సీఎం డిమాండ్ చేశారు. ‘‘బతకడానికి వచ్చినవారి ఓట్లు మాత్రమే కావాలి గానీ, వారికి టికెట్లు ఇవ్వొద్దా? ఇదేనా బీఆర్​ఎస్​ విధానం’’ అని నిలదీశారు. పీసీసీ సిఫార్సుల తర్వాత మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు

ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూసినప్పుడు అనర్హత వేటు పడే పరిస్థితే ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఫిరాయింపులపై స్పష్టమైన చట్టం వస్తే.. బీఆర్ఎస్  నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ లోని 65 మంది ఎమ్మెల్యేలు కలిసే ఉంటారు. ఇక అప్పుడు సమస్య ఏముంది?

మొన్నటి అసెంబ్లీ సమావేశాల చివరి రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38 అని స్పీకర్ ప్రకటించారు. మరి అప్పుడే తమ సంఖ్య 38 కాదని బీఆర్​ఎస్​ నేతలు ఎందుకు చెప్పలేదు? నాడే పార్టీ ఫిరాయింపులపై ఎందుకు వాళ్లు నోరుమెదపలేదు?