కేసీఆర్ ట్యాపింగ్ ​తంత్రం.?

'రాష్ట్రంలో నిఘా రాజ్యం నడుస్తున్నది.  మంత్రులు, కీలక నేతలపై  నిరంతర  నిఘా కొనసాగుతున్నది.  నిఘా విభాగం ఆధ్వర్యంలో  ప్రత్యేక దళాన్ని కూడా నియమించారు' అంటూ బీఆర్ఎస్ అనుకూల వ్యక్తులు, యూట్యూబ్ చానళ్లు ఒక కథను మార్కెట్ లోకి వదిలారు.  ఇందులో  నిజానిజాల  గురించి  చర్చించవలసి ఉన్నది.  సహజంగా  ఎవరికైతే  ఏ విద్యలో ప్రావీణ్యం ఉంటుందో,  ఆ విద్యను  ప్రత్యర్థులు కూడా అనుసరిస్తున్నారేమో అనే భయం వెంటాడుతుంది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని  టార్గెట్ చేసుకొని ఉన్నవీ,  లేనివీ  కల్పించి కొన్ని కథలను  కేసీఆర్,  కేటీఆర్, వారి వందిమాగధులు ప్రచారం చేస్తున్నారు. అడుగడుగునా నిఘా పెట్టి,  నలుగురు గుమిగూడిన చోట గూఢచారులను నియమించి 'ఫోన్ ట్యాపింగ్' జరిపి ప్రత్యర్థులను నిర్వీర్యం చేయాలని, అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలని ప్రయత్నించిన ఘనత కేసీఆర్  కు దక్కుతుందన్నది జగమెరిగిన సత్యం.  'రాచరికపు జిత్తులలో దిట్ట'గా  పేరు పొందిన కేసీఆర్ 'ఫోన్ ట్యాపింగ్' కేసు వలన తన ప్రతిష్టను దిగజార్చుకున్నారు. తాను జనరంజకంగా పరిపాలిస్తున్నానని ప్రజలు అడగకముందే వారికేమి కావాలో తాను సమకూర్చుతున్నానని  పదేండ్ల పాటు పబ్లిసిటీతో  చాటింపు వేయించుకున్న కేసీఆర్ 'తాను తవ్వుకున్న గోతిలో' తానే పడినట్లయ్యింది.

‘‘అభద్రతాభావం ఎక్కువగా ఉన్న వ్యక్తికే అహంకారం,  గర్వం పుష్కలంగా ఉంటాయి. అభద్రతాభావం గల మనిషిని కనుక్కోవడం కష్టం. అతని అహం చాలా బలహీనమైంది.  తన గురించి తాను ఎప్పుడూ అభద్రతాభావంతోనే ఉంటాడు. ఒకవేళ ఎవరి నుంచి అయినా నష్టం జరగబోతున్నట్టు,  ప్రమాదం ఉన్నట్టు, దాడి జరిగే అవకాశమున్నట్టు పసిగడితే పగతో రగిలిపోతాడు.  తనకు ఫలానా నాయకుడి నుంచి రాజకీయంగా గండం ఉన్నట్టు భావిస్తే ఇక అలాంటివారిని నియంత్రించడానికి ఎలాంటి కుట్రలు, కుతంత్రాలకు అయినా తెగిస్తాడు’’ అని 1694 -– 1773 కాలానికి చెందిన తత్వవేత్త లార్డ్ చెస్టర్ ఫీల్డ్ వ్యాఖ్యానించాడు.  లార్డ్ ఛెస్టర్ ఫీల్డ్  చెప్పిన పోలికలు  కేసీఆర్  వ్యవహారశైలిలో మనం కనుగొనవచ్చును.  అత్యంత కట్టుదిట్టమైన సాయుధ బలగాల పహారాలో 'ప్రగతి భవన్' నిర్మించుకుని  నివసించడం,  ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ లో బస చేయడం 'అభద్రత'లో భాగమే!  తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు 2014 నాటికే  కనుమరుగైపోయినా కేసీఆర్ కు మాత్రం విపరీతమైన భయం ఉండేదని పోలీసు వర్గాలంటున్నవి.  అలాగే 2018లో 119కి గాను  88 సీట్లతో  ప్రజలు భారీ ఆధిక్యంతో గెలిపించినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మందిని కేసీఆర్​ తన పార్టీలోకి చేర్చుకోవడం 'అభద్రత'లో భాగమే!  టీడీపీ 2015, 16 కల్లా ఏపీకి తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోయింది. ఇక మిగిలింది కాంగ్రెస్.  ఆ పార్టీ ఎప్పటికయినా పుంజుకోగలదని, పడగ విప్పగలదని ఎన్నో 'మాయోపాయాలు' తెలిసిన కేసీఆర్ కాంగ్రెస్ శాసనసభాపక్ష 'విలీనం' కథ నడిపించారు.  తెలంగాణ కాంగ్రెస్​ను  మానసికంగా కుంగదీయాలని, ఆ పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని బలంగా దెబ్బకొట్టాలని కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేశారు.

రేవంత్​పై కేసీఆర్​ నిఘా

2018లో కొడంగల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి  ఓటమి చవిచూశారు.  2019లో  మల్కాజిగిరి లోక్​సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.  రేవంత్ రెడ్డి పూర్వాశ్రమంలో కొంతకాలం టీఆర్ఎస్ లో పనిచేసినందున ఆయన ఎంత 'పొటెన్షియల్' నాయకుడో  కేసీఆర్,  హరీశ్ రావులకు తెలియనిది కాదు. 2017లో  రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగానే 'సుడిగాలి' సంకేతాలు ఏవో  నాటి 'ప్రగతి భవన్' గడీకి తాకాయి.  రేవంత్ రెడ్డి  తన శక్తియుక్తులతో అదివరకే ఉన్న కాంగ్రెస్ సీనియర్లందరినీ అధిగమించి వేగంగా 'ముందుకు' వచ్చే అవకాశాలున్నట్టు అనుమానించిన వెంటనే 'నిఘా' సంస్థలన్నింటినీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తం చేశారు. 

సాధారణంగా  టెర్రరిస్టులు లేదా మావోయిస్టు పార్టీ  కార్యకలాపాల వంటి వాటిని పసిగట్టడానికి వాడే 'ట్యాపింగ్ వ్యవస్థ'ను  రాజకీయాల కోసం,  వ్యక్తిగత  ప్రయోజనాల కోసం,  వ్యాపారులను బెదిరించి డబ్బు గుంజడం కోసం ఉపయోగించారని, వ్యక్తిగత, కుటుంబ సభ్యుల సంభాషణలను కూడా విన్నారన్న ఆరోపణలున్నవి.  దేశంలో పెద్ద చర్చకు కారణమైన 'పెగాసస్' కంటే పెద్ద రచ్చ తెలంగాణలో అవుతోంది. రేవంత్ ఇంటికి  దాదాపు 200 మీటర్ల దూరంలో ఉండి కాల్స్ వినగలిగేలా ఏర్పాటు చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచికి టెక్నికల్ కన్సల్టెంట్‌‌ రవిపాల్ ఇజ్రాయెల్ నుంచి ఈ పరికరాలు కొనడంలో సహకరించినట్టు తెలుస్తోంది.  ‘సాఫ్ట్‌‌వేర్’ కంపెనీ పేరుతో వీటిని దిగుమతి చేసుకున్నట్టు తేలింది.  రేవంత్ రెడ్డి ఇంటి నుంచి వెళ్లే  ప్రతి ఫోన్​కాల్ విన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగ అధిపతిగా పనిచేసిన ప్రభాకరరావు ఆధ్వర్యంలో ఈ తతంగం సాగినట్టు తేలింది.  కేసీఆర్  ఓటమిపాలు కాగానే  ప్రభాకరరావు అమెరికాకు ఉడాయించారు.  ప్రణీత్ రావు తదితర పోలీసు అధికారులు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు.

టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ నేరం

కేసీఆర్  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  సొంతకులం వాళ్లనే కీలకమైన ఇంటెలిజెన్స్ అధికారులుగా నియమించుకున్నారు. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం.  అయితే, ఇంతకుముందు భారతదేశంలో ఎవరూ టెలిగ్రాఫ్ చట్టం కింద ఫోన్ ట్యాపింగ్ కేసులు నమోదు చేయలేదు. ఈ క్రమంలో దేశంలోనే మొదటిసారి, ఈ కేసులో టెలిగ్రాఫ్ చట్టాన్ని కూడా హైదరాబాద్ పోలీసులు జోడించారు.  ఫోన్ ట్యాపింగ్  ఐటీ యాక్ట్ సెక్షన్ 66 కింద,  ఇండియన్  టెలిగ్రాఫ్ యాక్ట్ 2007,  సెక్షన్ 419 ఎ కింద,  రాజ్యాంగంలోని  ప్రాథమిక హక్కు అయిన గోప్యత హక్కు కింద నేరం.  ఇక ఇజ్రాయెల్ నుంచి వచ్చిన 'పెగాసస్'  సంగతి తెలిసిందే.  కావలసిన వ్యక్తి ఇంటి దగ్గర్లో ఈ యంత్రాలు ఉన్న వాహనాన్ని పార్క్ చేసి,  కాల్స్ వినేలా ఏర్పాటు చేశారు.  అలాంటి వాహనాలు దాదాపు 20 వరకూ తెలంగాణ పోలీసులు వాడారు. ‘ఫోన్ ట్యాపింగ్ ద్వారా భార్యాభర్తలు మాట్లాడుకునేవి కూడా విన్నారు.  ఎవరు దీనికి బాధ్యులో వారంతా చిప్పకూడు తినాల్సిందే’ అని సీఎం రేవంత్ రెడ్డి  హెచ్చరించారు.  కాగా,  రేవంత్ రెడ్డికి  ఎలాంటి అభద్రతాభావం లేదు. పార్టీ, పరిపాలనపైన తగిన పట్టు, కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర 'మెరిట్' సాధించారు.  కేసీఆర్, రేవంత్ పాలనలో  తేడా, మౌలికమైన 'మార్పు' స్పష్టంగా కనిపిస్తోంది. 

ఎస్ కే. జకీర్