కేసీఆర్ సర్కార్​ అప్పులు..రేవంత్​కు తప్పని చెల్లింపులు

తప్పులెన్నువాడు తమ తప్పులెరుగడు.. అన్నది సామెత.  అప్పులెన్నువాడు తమ అప్పులెరుగ డు.. అన్నది ఇప్పుడు కొత్తగా ఖాయం చేసు కోవచ్చు. పదేండ్లు తెలంగాణను అప్పులపాల్జేసి ఖజానాను గుల్ల చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాని కి అచ్చంగా సరిపోయే నానుడి ఇది.  అప్పుడు ఆర్థిక విధ్వంసానికి పాల్పడిన బీఆర్ఎస్ ఇప్పు డు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని సోషల్ మీడియాలో పోస్టర్లు వేసుకుంటున్న తీరు.. గురివింద గింజలాగే ఉన్నాయి.  

కేసీఆర్ ప్రభుత్వం గడిచిన పదేండ్లలో రూ.7 లక్ష ల కోట్ల అప్పులు చేసింది.  అప్పటి అప్పుల కు వడ్డీలు, కిస్తీలు చెల్లించేందుకు కొత్తగా అధికా రం చేపట్టిన  కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పుతిప్ప లు పడుతోంది. తెలంగాణ భవిష్యత్తు తరాలు సైతం అప్పుల ఊబిలో కూరుకుపోయేలా కేసీఆర్ సర్కారు ఎక్కడ పడితే అక్కడ అప్పుల కుప్పలు పేర్చిపెట్టింది. అందులో నుంచి బయటపడేందుకు తెలంగాణకు మరో పదేండ్లు పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

బీఆర్​ఎస్​ గోబెల్స్​ ప్రచారం

రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఎఫ్ఆర్బీఎం చట్ట ప్రకారం ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పు రూ.25 వేల కోట్లు.  కానీ.. అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమలకే సరిపోయిందటా.. అన్నది తెలంగాణ సామెత.  అచ్చంగా  రేవంత్ ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి తెచ్చిన అప్పులన్నీ కేసీఆర్ చేసిన అప్పుల కిస్తీలకు కూడా సరిపోలేదు. ఈ నిజాన్ని దాచిపెట్టేందుకు బీఆర్ఎస్ లీడర్లు రాష్ట్ర ప్రభుత్వం  రోజుకు రూ.150 కోట్ల అప్పు తెస్తోందని  కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారు. ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం తెచ్చిన అప్పులన్నీ గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చేందుకు ఖర్చు పెట్టిందనే విషయాన్ని దాచిపెట్టి..  ఏదో జరిగిపోయిందనే అయోమయం సృష్టించేలా బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం ఎత్తుకుంది. 

రూ.7 లక్షల కోట్ల అప్పులు

2014లో రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాలు పంచుకున్న లెక్కల ప్రకారం తెలంగాణకు ఉన్న అప్పులు రూ.62 వేల కోట్లు.  కేసీఆర్ సర్కారును ప్రజలు అధికారం నుంచి దింపిన రోజున ఉన్న ఖజానా లెక్కల ప్రకారం.. తెలంగాణ అప్పు రూ.6.72 లక్షల కోట్లు.  రాష్ట్ర ఆర్థిక స్థితి  అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక శ్వేతపత్రం  ప్రకారం చిన్నాచితక అన్నీ కలిపితే దాదాపు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, కిస్తీలే తడిసిమోపెడయ్యాయి. అంటే పదేండ్లలో  తెలంగాణ ఎంత మేరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిందో  సామాన్యుడికి సైతం అర్థమవుతోంది. 

దుబారా లేకుండా..

తెలంగాణలో నాలుగు కోట్ల మందిపై ఉన్న తలసరి అప్పుల భారాన్ని తగ్గించేందుకు రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే ఆర్థిక క్రమ శిక్షణను పాటిస్తోంది. అదేమీ పట్టింపు లేనట్లుగా బీఆర్ఎస్ అల్లుతున్న అబద్ధపు కథలను చూసి  తెలంగాణ సమాజం చీత్కరించుకుంటోంది.  పదేండ్లుగా  విధ్వంసమైన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి  ప్రభుత్వం తొలిరోజు నుంచే దిద్దుబాటు చర్యలు చేపట్టింది.  

దుబారా లేకుండా ప్రతి పైసాకు జవాబుదారీగా ఉండేలా ఖర్చులపై నియంత్రణను అమలుచేస్తోంది. గత ప్రభుత్వంలాగా వడ్డీలు చెల్లించకుండా, ఉన్న అప్పులను మరింత పెంచలేదు.  గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు, కిస్తీలను చెల్లిస్తూ అప్పుల పెరుగుదలకు  రాష్ట్ర ప్రభుత్వం బ్రేకులు వేస్తున్నది. 

అప్పుల నియంత్రణలో కాంగ్రెస్​ సర్కారు విజయం

పదేండ్లలో రాష్ట్ర ఖజానాపై  మోయలేనంతగా పెరిగిన రుణభారం తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలను విస్మరించి బీఆర్ఎస్  తప్పుడు  ప్రచారాన్నే తలకు ఎత్తుకుంది. ఇప్పటికే రాష్ట్ర  ప్రభుత్వం ప్రజోపయోగమైన నిర్మాణాలకు, పనులకు దాదాపు రూ.7 వేల కోట్లు మూలధన వ్యయంగా ఖర్చు చేసింది. గత ప్రభుత్వం చేసినట్లుగా ఇష్టారాజ్యంగా అప్పుల జోలికి వెళ్లకుండా నియంత్రణ పాటించింది. 

బడ్జెట్ పరిమితులకు లోబడి మార్కెట్ రుణాలు తీసుకొని ప్రణాళిక ప్రణాళికేతర ఖర్చులకు సరిపడేలా సర్దుబాటు విధానం అనుసరించింది.  గతంతో పోలిస్తే  అప్పులు తగ్గుముఖం పట్టడం శుభసూచకం. గతంతో  పోలిస్తే  రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) పెరిగినందున రుణాలు తీసుకునే పరిధి పెరిగింది. జీఎస్డీపీ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తక్కువ అప్పులు చేయటం కొత్త మార్పునకు సంకేతం. 

సాధారణంగా ప్రభుత్వాలు తాము చేసే రీపేమెంట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకుంటాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం కంటే ఎక్కువ కిస్తీలు చెల్లించింది. తెచ్చిన అప్పుల కంటే తిరిగి చెల్లింపులు చేసింది ఎక్కువగా ఉండటం రేవంత్​ సర్కారు ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పట్టింది.

అప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ గొప్పలు

అప్పులు తెచ్చి.. ఆస్తులు సృష్టించామంటూ గత ప్రభుత్వం తాము చేసిన అప్పులను కప్పిపుచ్చుకునేందుకు లేని పోని గొప్పలు వల్లిస్తోంది. దాదాపు రూ.లక్ష కోట్ల అప్పుతో  కేసీఆర్ సర్కారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏమై పోయిందో  ప్రజలు చూస్తూనే ఉన్నారు. తప్పుడు డిజైన్లు,  తలా తోక లేని  నిర్ణయాలతో ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఉంటుందా.. ఉండదా.. అని ఇంజనీర్లు సైతం తేల్చిచెప్పలేని దుస్థితి.  

రైతులకు ఇస్తామని చెప్పిన పంట రుణమాఫీ దాదాపు రూ.8 వేల కోట్లు  ఎగవేసిన ఘనత అప్పటి ప్రభుత్వానిది.  చివరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇవ్వాల్సిన పావలా వడ్డీ రుణాలు కూడా అప్పటి ప్రభుత్వం బకాయి పెట్టింది. గొర్రెల పంపిణీ పథకం పేరుతో గొల్ల, కురుమలకు దక్కాల్సిన సాయం పక్కదారి పట్టింది.  ఉద్యోగులకు  ఒకటో తారీఖున  జీతాలు  ఇవ్వలేనంత  గడ్డు దుస్థితి ఎవరి హయాంలో మొదలైందో తెలంగాణ ప్రజలకు తెలుసు.  

రేవంత్​ సర్కారు ఆర్థిక క్రమశిక్షణ 

కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ఆరు గ్యారంటీలను అమలు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి రూ.2,027 కోట్లు,  200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తుకు రూ.450 కోట్లు,  అయిదు వందల రూపాయలకే  గ్యాస్ సిలిండర్ కు  రూ.150 కోట్లు, ఆరోగ్య శ్రీ సాయానికి దాదాపు రూ.700 కోట్లు ఖర్చు చేసింది.  గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో  రూ.31 వేల కోట్ల రైతు రుణాల మాఫీకి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర నిర్ణయం తీసుకుంది. 

మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. భారీ నిధులతో కూడుకున్న పనులే.   వీటన్నింటికీ మించి ప్రతి నెలా మొదటి అయిదు రోజుల్లోనే ఉద్యోగులకు జీతాలను పంపిణీ చేసే ప్రక్రియను పునరుద్ధరించిన తీరు రేవంత్  సర్కారు ఆర్థిక క్రమశిక్షణకు సాక్ష్యం.

వడ్డీలు చెల్లించేందుకే రుణాలు

రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీన బాధ్యతలు చేపట్టింది.  డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రోజుకు రూ.191 కోట్లు అధికారికంగా ప్రభుత్వం అప్పులు చేసింది.  గత ప్రభుత్వం బడ్జెట్లో చూపించకుండా గుట్టుగా  లోన్లు తెచ్చినట్లు కాకుండా.. రిజర్వు బ్యాంకు నుంచే బహిరంగంగానే  మార్కెట్ రుణాలు తీసుకుంది.  వీటిలో ఒక్క రూపాయి కూడా నిరర్థకంగా ఖర్చు చేయలేదు. 

తెచ్చిన అప్పులన్నింటినీ గత ప్రభుత్వం చేసిన అప్పుల పాపానికి కిస్తీలు,  వడ్డీలు చెల్లించేందుకే ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది. రాష్ట్ర సొంత రెవెన్యూ నుంచి కూడా కొంతమేరకు సర్దుబాటు చేసి నెలసరి కిస్తీలను చెల్లించింది. డిసెంబర్ నుంచి జూన్ 17వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25,118 కోట్ల అప్పులు చేసింది. ఇదే వ్యవధిలో రూ.38,040 కోట్లు అప్పుల వడ్డీల కిస్తీలు (రిపేమెంట్) తిరిగి చెల్లింపులు చేసింది. అంతమేరకు తెలంగాణ ప్రజలపై మోపిన రుణభారం తగ్గించింది. ఈ ఆరు నెలల్లో తెచ్చిన అప్పులన్నీ బడ్జెట్ లో పొందుపరిచిన ప్రకారం తీసుకున్నవే.  2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 59,625 కోట్ల రుణాలు తీసుకుంటామని ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటించింది.

- అవనీంద్ర