కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ అంటేనే ప్రకృతి అందాలకు నెలవు. దట్టమైన అడవులు, ఎత్తయిన గుట్టలు, కనుచూపుమేరలో ఎటుచూసినా పచ్చదనం పరుచుకుని కనువిందు చేస్తుంది. మంచిర్యాల జిల్లా జన్నారం కేంద్రంగా ఉన్న కవ్వాల్ టైగర్ ఫారెస్టు ఎకో టూరిస్టులను ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా టూరిస్టులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అటవీ అందాలను, రకరకాల వన్యప్రాణులను, పక్షి జాతులను చూసి ఫిదా అవుతున్నారు. ఫారెస్ట్, టూరిజం డిపార్ట్మెంట్స్ కలిసి ఇక్కడ జంగిల్ సఫారీ ఏర్పాటుచేశాయి. దాంతోపాటు టూరిస్టులకు బోలెడు ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అందుకే సెలవు రోజుల్లో ఫ్యామిలీతో కలిసి ఇక్కడకు వచ్చేందుకు ఇష్టపడుతున్నారు ఎక్కువమంది.
ఈ అడవిలోకి వెళ్తే చుక్కల జింకలు, కోతులు, కొండెంగలు, అడవిపందులు, అడవి దున్నల గుంపులు చూడొచ్చు. అవి ఉదయం, సాయంత్రం వేళల్లో అడవిలో స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అడవి కుక్కలు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి వైల్డ్ యానిమల్స్ సైతం అక్కడక్కడ కనిపిస్తాయి. సుమారు 300 రకాల పక్షులను కవ్వాల్ ఫారెస్ట్‌లో గుర్తించారు. ఏటా నిర్వహించే ‘బర్డ్ వాచ్’ ఫెస్టివల్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి బర్డ్ లవర్స్ పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం పలుచోట్ల వాచ్ టవర్లు ఏర్పాటుచేశారు. జంతువులకు నీటి వసతి కోసం కుంటలు తవ్వారు. వాటి దగ్గర చెక్క బ్రిడ్జిలు, కాటేజీలు ఏర్పాటు చేశారు. కొన్ని చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో గడ్డ క్షేత్రాలను పెంచుతున్నారు.
జంగిల్ సఫారీ
జంగిల్ సఫారీలో విహరిస్తూ కవ్వాల్ అందాలను ఆస్వాదించడం థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ఫారెస్ట్, టూరిజం డిపార్ట్మెంట్లు కలిసి తొమ్మిది సఫారీ వెహికల్స్ ఏర్పాటు చేశాయి. ఉదయం 6 నుంచి 10.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సఫారీ రైడ్ ఉంటుంది. గోండుగూడ బేస్ క్యాంప్, వాచ్ టవర్, బైసన్ కుంట, మైసమ్మకుంట, గనిశెట్టికుంటలు చూడొచ్చు.
బైసన్ కుంట వద్ద చుక్కల దుప్పులు, అడవి దున్నలు గుంపులుగా కనిపిస్తాయి. అక్కడే ఉన్న ఎన్విరాన్మెంటల్ స్టడీ సెంటర్లో జంతువుల ఎముకలు, పుర్రెభాగాలు చూడొచ్చు. దట్ట మైన అడవిలో సుమారు 20 కిలోమీటర్లు జంగిల్ సఫారీ చేస్తుంటే ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. ఈ టూర్ మర్చిపోలేని అనుభూతి మిగులుస్తుందంటే అతిశయోక్తి కాదు.
ప్యాకేజీల వివరాలు...
జంగిల్ సఫారీ కోసం కొత్త లగ్జరీ వెహికల్స్‌ను ఏర్పాటు చేయడంతో సఫారీ కాస్త ఖరీదుగా మారింది. ఒక్కో వెహికల్ లో ఆరుగురు వెళ్లొచ్చు. ఒక్కో ట్రిప్‌కు ఐదు వేల రూపాయలు ఖర్చవుతుంది. అదనంగా మనుషులు ఎక్కితే ఒక్కొక్కరికి రూ.500 కట్టాలి. వీకెండ్స్‌లో కవ్వాల్ ఫారెస్ట్‌కి టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువమంది వస్తారు. సెలవురోజుల్లో ఫ్యామిలీతో వస్తారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
జన్నారంలో టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో హరిత కాటేజీలు, రెస్టారెంట్ఉన్నాయి. సోమవారం నుంచి గురువారం వరకు నాన్ ఏసీ రూమ్‌కి రూ.1,064, ఏసీ రూమ్‌కి రూ.1,624, డార్మెటరీకి రూ.1,600 ఛార్జ్ చేస్తారు. శుక్ర, శని, ఆదివారాల్లో నాన్ ఏసీకి రూ.1,176, ఏసీకి 1,792, డార్మెటరీకి రూ.1,800 చెల్లించాలి. వారాంతాల్లో ఇక్కడికి రావాలంటే వారం రోజుల ముందే ఆన్లైన్లో రూమ్స్, జంగిల్ సఫారీ బుక్ చేసుకోవాలి.
చౌదరి సురేష్, మంచిర్యాల