ఆధ్యాత్మికం: కార్తీకస్నానం....  మణికర్ణికాఘాట్​ ప్రత్యేకం... ఎందుకంటే..

ఉత్తరప్రదేశ్ లోని అతి మహిమాన్విత శైవక్షేత్రం వారణాశి. కార్తీకమాసంలో ఈ నగరమంతా దేదీప్యమానమై కళకళ లాడుతూంటుంది. పవిత్ర గంగ ఒడ్డున వున్న 64 తీర్ధ ఘట్టాలలో మణికర్ణికా ఘట్టం అత్యంత పునీతమైనది.  కార్తీకమాసంలో మణికర్ణికాఘాట్​ లో  స్నానం చేస్తే పాపాలు తొలిగి మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అమ్మవారి మణికర్ణాభరణం, పరమశివుని కర్ణాభరణం గంగాతీర స్నానఘట్టంలోని బావిలో పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. అవి రెండూ కలిసి శివలింగ రూపాన బయటికి వచ్చాయి. ఆ లింగమే మణికర్ణికేశ్వరునిగా పూజింపబడుతున్నది. ఇక్కడ మణికర్ణికా అమ్మవారు కొలువై వున్నారు.  అప్పటి నుండే ఈ స్నాన ఘట్టం మణికర్ణికా ఘట్టంగా కీర్తించబడుతోంది. ఈ మణికర్ణికా ఘాట్ లో స్నానం చేస్తే మోక్షం లభిస్తుంది అని భక్తులు విశ్వసిస్తుంటారు. 

కార్తీకమాసంలో  మణికర్ణికా ఘట్టంలోను, దశాశ్వమేధ ఘట్టం లోను  భక్తులు పుణ్య స్నానాలు చేస్తారు. కాశీ విశ్వేశ్వరుని అభిషేకానికి పవిత్రగంగాజలాన్ని తీసుకువెళతారు. మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసినవారు తమ అంత్యకాలం తర్వాత నారాయణుడినో, పరమ శివుడినో చేరుకుంటారని మణికర్ణికాష్టకంలో ఆదిశంకరాచార్యులు తెలిపారు. కార్తీకమాసంలో కాశీలో  దశాశ్వమేధఘాట్, తులసీ ఘాట్, హనుమాన్ ఘాట్ మొదలైన ఘాట్లలో పవిత్ర స్నానాలు చేయడం వలన పుణ్యం లభిస్తుంది. ఒక్కొక్క ఘాట్ కి ఒక్కొక్క విశిష్టత, పురాణ కధ వున్నది. హనుమాన్ ఘాట్ లో కామకోటీశ్వరుని ఆలయం వున్నది. మరణించిన వారిని హరిశ్చంద్ర ఘాట్ లో దహనం చేస్తారు. అక్కడే హరిశ్చంద్రుడు కాటికాపరిగా వుండేవాడు. హరిశ్చంద్రుడు ప్రతిష్టించిన శ్మశాన ఈశ్వరుడు ఇక్కడ అనుగ్రహిస్తున్నాడు.

Also Read : కార్తీక మాసం విశిష్టత.. పవిత్రత  ఏమిటి..  ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది..

కాశీ నగరంలో పరాశక్తి అన్నపూర్ణాదేవి, విశాలాక్షి, దుర్గాదేవి, వారాహి అని అనేక రూపాలలో దర్శనమిస్తున్నా, అధికార పీఠంలో కొలువై వున్నది మాత్రం అన్నపూర్ణా దేవి. కార్తీకమాసంలో  అన్నపూర్ణాదేవి ఆలయంలో చాలా వైభవంగా ఉత్సవాలు జరుపుతారు. అన్నపూర్ణాదేవి సర్వాలంకార భూషితయై అనుగ్రహం ప్రసాదిస్తుంది. ఎడమ చేతిలో బంగారు పాత్ర, కుడి చేతిలో బంగారు గరిటెలతో భిక్షనర్ధిస్తూ కపాల పాత్రతో నిలబడిన పరమశివునికి  ఆహారం అందించే భంగిమలో  దర్శనమిస్తున్నది.

అన్నపూర్ణ ఆలయంలోని మరో విశిష్టత, ఆలయం మొదటి అంతస్తులో బంగారు అన్నపూర్ణాదేవి గా భక్తులను కరుణిస్తుంది. నరక చతుర్దశినాడు మాత్రం పై అంతస్తు నుండి క్రిందకి దిగి వచ్చి భక్తులకు దర్శనం కటాక్షిస్తుంది. అభిషేకం, హారతి ఉచ్చికాలపూజలు అయ్యేక తెరమరుగవుతుంది. బంగారు అన్నపూర్ణాదేవి ఒక ఉన్నత మండపం మధ్య పద్మాశీనురాలై నవరాత్నాలు బంగారు ఆభరణాలు ధరించి వుంటుంది. బంగారు కవచం ధరించి కిరీటానికి పైన బంగారు ఛత్రముతో దర్శనం యిస్తుంది.

అన్నపూర్ణాదేవికి కుడిప్రక్కన ఐశ్వర్య నాయకియైన మహాలక్ష్మి, ఎడమప్రక్కన ఐశ్వర్యాన్ని తనలో దాచుకున్న భూదేవి, అన్నపూర్ణాదేవికి ముందర భిక్షాపాత్రతో వెండికవచం ధరించిన విశ్వనాధుల  దివ్యదర్శనం మామూలు రోజలలో కిటికీలో నుండి మాత్రమే చూడడానికి వీలవుతుంది. కానీ ఒక్క దీపావళినాడు మాత్రమే అమ్మవారిని నేరుగా దర్శించే అవకాశం లభిస్తుంది. అన్నపూర్ణాదేవిని లడ్డూల రధంలో  ఊరేగిస్తారు. ప్రజలంతా ఆ దివ్యదర్శనం చేసుకుని లడ్డూ ప్రసాదం పొంద వచ్చును. ఆనాడు నాదస్వరంతో అన్నపూర్ణాష్టకం వినపడుతుంది.ఈ ఆలయానికి కొంచెం దూరంలో విశాలాక్షి ఆలయం వున్నది. తమిళనాడు శిల్ప శైలిలో గోపురం విమానం వుంటాయి. పూజలు అర్ఛనలు అన్నీ తమిళ బాణీలో జరుపుతారు.

 కాశీకి వచ్చిన భక్తులు డుండి గణపతిని, సంకటమోచన హనుమంతుని కాశీ రక్షణనిచ్చే కాలభైరవుని ముఖ్యంగా దర్శిస్తారు. కాశీలో హనుమన్ ఘాట్ లో కొలువైన హనుమంతుడు మహిమాన్వితుడు. కార్తీకమాసంలో కొన్ని వేలమంది ఒంటికి నూనె రాసుకుని గంగా స్నానం చేస్తారు. గంగానది ఒడ్డున వరుసగా దీపాలు వెలిగించి, గంగా దేవికి పుష్పాలు సమర్పించి స్త్రీలు తాము దీర్ఘ సుమంగళులుగా వుండాలని ప్రార్ధిస్తారు. హనుమాన్ ఘాట్ లో కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, మదుర మీనాక్షి , ముగ్గురు దేవేరులు ప్రత్యేక సన్నిధులలో కొలువై వున్నారు. గంగాస్నానం అనంతరం ఈ ముగ్గురు దేవేరులను దర్శిస్తే వంశాభివృధ్ధి, దీర్ఘసుమంగళిత్వం లభిస్తాయని పురాణాలు వివరిస్తున్నాయి.