జెడ్పీల్లో కనిపించని కారుణ్యం!

  • పదేండ్లుగా భర్తీ చేయని వారసత్వ ఉద్యోగాలు 
  •     రాష్ట్రవ్యాప్తంగా 1,200  మంది ఎదురుచూపులు
  •     బాధితుల్లో ఎక్కువ మంది డిగ్రీ, పీజీ చేసినవాళ్లే
  •     అటెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులు మాత్రమే ఇస్తుండగా వెనుకంజ
  •     జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టుల కోసం డిమాండ్ 

కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలోని జిల్లా పరిషత్ ల్లో కారుణ్య నియామకాలకు ఏండ్లుగా మోక్షం లభించడం లేదు. పంచాయతీరాజ్ శాఖలోని వివిధ విభాగాల ఉద్యోగులు, జెడ్పీ పరిధి స్కూళ్లలోని టీచర్లు ఎవరైనా మరణిస్తే.. అతని ఫ్యామిలీలో ఒకరికి కారుణ్య నియామకం కింద జాబ్ కల్పించాల్సి ఉంటుంది. ఈ విధానం ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్నా.. తెలంగాణ వచ్చాక మాత్రం పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు.

ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లా  పరిషత్ ల్లో సుమారు1200 మందికిపైగా కారుణ్య ఉద్యోగాలకు  దరఖాస్తులు పెట్టుకోగా పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కు అర్హత కలిగిన వాళ్లు 743 మంది ఉన్నారు. కలెక్టర్ పరిధిలోని పంచాయతీరాజ్ యేతర శాఖల్లో కారుణ్య నియామకాలు వెంటవెంటనే చేపడుతుంటే.. జెడ్పీల్లో మాత్రం ముందుకు కదలడం లేదు.   

అర్హతలకు తగిన జాబ్ ఇవ్వాలంటూ..

ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఉండగానే మరణిస్తే .. అతని కుటుంబంలో భార్య/ భర్త/కొడుకు/ కూతురిలో ఒకరికి అర్హత మేరకు జాబ్ కల్పించాలి. ఇది ఉద్యోగి కుటుంబ హక్కు కూడా. చనిపోయిన ఉద్యోగి హోదా, ర్యాంకు ప్రకారం అదేస్థాయి జాబ్ లేదంటే అర్హత మేరకు తక్కువస్థాయిదైనా ఇవ్వాల్సి ఉంటుంది. 

అయితే జెడ్పీ, మండల పరిషత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూళ్ల టీచర్లు, ఇతర స్థానిక సంస్థల్లో మృతిచెందిన ఉద్యోగుల వారసుల్లో చాలా మంది బీటెక్, ఎంటెక్, ఇతర డిగ్రీ, పీజీలు పూర్తి చేసినవారే ఉన్నారు.  కానీ కారుణ్య నియామకాల కింద భర్తీ చేసే పోస్టుల్లో ఎక్కువగా ఆఫీస్ సబార్డినేట్(అటెండర్) పోస్టులే అధికంగా ఉన్నాయి. ఆ జాబ్ చేసేందుకు ముందుకు రాకపోవడం కూడా సమస్యగా మారింది. తమ చదువుకు తగ్గట్లుగా కనీసం జూనియర్ అసిస్టెంట్ పోస్టు అయినా ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం కొత్తగా సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూమరరీ పోస్టులు సృష్టిస్తే తప్ప ప్రస్తుతం  ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 

22  జిల్లాల్లో కారుణ్య నియామకాల్లేవ్

గతంలో లోకల్ బాడీస్ ఉద్యోగులు చనిపోతే వారసులకు కలెక్టరే కారుణ్య ఉద్యోగం ఇచ్చేవారు. అది జెడ్పీ పరిధిలోని విభాగాలతో పాటు రెవెన్యూ, ఎక్సైజ్ తదితర శాఖల్లోనూ కల్పించే అవకాశముండేది. కానీ.. 2013లో ఇచ్చిన సర్క్యులర్ కారణంగా జిల్లా పరిషత్ లో కారుణ్య నియామకాలు జరిగినప్పుడు లోకల్ బాడీస్ లో మాత్రమే భర్తీ చేయాలనే నిబంధన తీసుకొచ్చారు. జెడ్పీ పరిధిలో అటెండర్ పోస్టులు ఎక్కువగా, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉండడంతో ఉద్యోగార్థుల్లో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉండగా ఆ పోస్టులు దక్కే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 జూలై 20న జీవో నం. 79 ద్వారా 1,266 ఆఫీస్ సబార్డినేట్(అటెండర్) పోస్టులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ జీవో ఆధారంగా జగిత్యాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్, కామారెడ్డి, జనగామ, సిద్దిపేట, మెదక్, కుమురంభీం ఆసిఫాబాద్  జిల్లాల్లో మాత్రమే అర్హులకు జూనియర్ పోస్టులు ఇచ్చారు.  మిగతా 22 జిల్లాల్లో  జెడ్పీ సీఈఓలకు, కలెక్టర్లకు మధ్య కో – ఆర్డినేషన్ లేకపోవడంతో పోస్టులు భర్తీ కాలేదు. 

“ సూర్యాపేట జిల్లాలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎం. వెంకటయ్య విధులు నిర్వహిస్తూ 2019 డిసెంబర్ లో ఆకస్మికంగా మరణించారు. కారుణ్య నియామకం కింద జాబ్ కల్పించాలని ఆయన కొడుకు ఎం. సిద్ధార్థ 2020 జనవరిలో జిల్లా పంచాయతీ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నాడు. ఇప్పటివరకు అతనికి పోస్టు ఇవ్వకపోవడంతో ఐదేండ్లుగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాభవన్ లో నిర్వహించే ప్రజావాణికి కూడా అతనితో పాటు పలువురు అభ్యర్థులు కారుణ్య నియామకంపై దరఖాస్తులు ఇచ్చినా ఫలితం లేకుండాపోయింది. దీంతో జాబ్ రాకపోవడంతో పాటు మరోవైపు వయసు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.’’

అప్ గ్రేడ్ చేసినా భర్తీ చేయలేదు

ఇంటికి పెద్ద దిక్కైన ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే నెల నెలా వచ్చే జీతం నిలిచిపోయి, చాలీచాలని పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బాధిత కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. పెన్షన్ కూడా రాని సీపీఎస్ ఉద్యోగ కుటుంబాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వారసుల్లో చాలా మంది డిగ్రీ, పీజీ చేసినవాళ్లే ఎక్కువగా ఉన్నారు. గత ప్రభుత్వం కారుణ్య నియామకాల కోసమే అటెండర్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేసింది.

కానీ అన్ని జిల్లాల్లో భర్తీ చేయలేదు.  ఈ ప్రభుత్వమైనా తమ బాధను అర్థం చేసుకుని జూనియర్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే కారణ్య నియామకం కింద భర్తీ చేయాలి.  –  నోముల రాహుల్, కరీంనగర్