యాదగిరిగుట్టలో మొదలైన కార్తీక వ్రతాలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందడి మొదలైంది. శనివారం మొదలైన ప్రత్యేక పూజలు డిసెంబర్‌‌ 1 వరకు కొనసాగనున్నాయి. సత్యనారాయణస్వామి వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించే భక్తులతో శనివారం వ్రత మండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు కిటకిటలాడాయి. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొండ కింద వ్రత మండపంలో రెండు గంటలకు ఒక బ్యాచ్‌‌ చొప్పున మొత్తం ఆరు బ్యాచ్‌‌లలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు.

భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి వ్రతాలు నిర్వహించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక దీపాలు వెలిగించుకునేందుకు వీలుగా కొండపై మూడు చోట్ల, కొండ కింద రెండు చోట్ల ‘కార్తీక దీపారాధన’ పేరుతో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పాతగుట్టలో సైతం ఐదు బ్యాచ్‌‌లళో వ్రతాలు నిర్వహించారు.