Good News : కార్తీకమాసం.. ప్రతి రోజూ పర్వదినమే.. దీపారాధన ఇలా చేస్తేనే పుణ్యం..!

కార్తీక మాసంలోని ప్రతి రోజు ఓ పర్వదినమే. ఈ మాసంలో చేసిన పూజలు, దానధర్మాలు, పురాణ శ్రవణంతో జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అటు హరికి, ఇటు హరుడికి మరో పక్కన వారిద్దరి తనయు డైన అయ్యప్పకు కూడా ఇష్టమైన మాసమిది. కార్తీక పౌర్ణమిని 'కౌశిక' లేదా 'వైకుంఠ పౌర్ణమి' అని కూడా అంటారు. తెలంగాణలో కొన్ని చోట్ల 'జీడికంటి పున్నమి' అని కూడా పిలుస్తారు.

ఏడాదంతా  ఇష్టదైవానికి దీపారాధన చేయకపోయినా.. ఈ ఒక్క నెలలో 365 వత్తులు వెలిగిస్తే చాలని పురాణాలు చెబుతున్నాయి. ఎక్కడైతే దీపాలు వెలిగించి ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. కార్తీక మాసంలో భక్తులు శివారాధన చేస్తారు. దీపారాధనతోపాటు శివుడికి అభిషేకాలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. వైష్ణవ దేవాలయాల్లోనూ దీపారాధన జరుగుతుంది. భక్తులు కార్తీక పౌర్ణమి రోజు తులసి. రుద్రాక్ష. స్ఫటిక మాలలు ధరించి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తారు. వ్రతాలను భక్తిశ్రద్ధలతో ఉపవాసాలతో ఆచరిస్తారు. శుద్ధ పూర్ణిమ రోజున కృత్తికా దీపోత్సవం, ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం, దీపారాధన చేయడం పుణ్యపదంగా భావిస్తారు.

దీపారాధన ఇలా

హిందూ సంప్రదాయంలో దీపానికి గొప్ప. ప్రత్యేకత ఉంది. దీపం కాంతికి చిహ్నం. జీవానికి సాక్ష్యం. అందుకే ఇంటి పూజ గదిలో ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉండాలని పెద్దలు చెబుతారు. కార్తీక పౌర్ణమి రోజు తలారా స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి, సాయంత్రం వేళ ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. ఉసిరికాయ దీపాలను కూడా వెలిగించవచ్చు. కార్తీక మాసంలో ప్రతి రోజూ సాయంకాలం విష్ణు అర్పణంగా ఎవరైతే నూనెతో దీపం వెలిగిస్తారో.. వారికి సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. అందుకు ఉసిరి దానం చేసినా.. ఉసిరి చెట్టు కింద భోజనం చేసినా మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఒకప్పుడు వన భోజనాలు ఉసిరి చెట్టు దగ్గరే చేసుకునేవాళ్లు.

కార్తీక స్నానం ఇలా !

పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే నదీ స్నానాన్ని కార్తీక స్నానం అంటారు. నదిలో స్నానమాచరించి.. అక్కడి దైవాన్ని దర్శించి.. గుళ్లో దీపాలు వెలిగించాలి. నదుల్లో దీపాలను వదిలేయాలి. నదులకు వెళ్లలేని వాళ్లు ఇంట్లో ఉదయాన్నే స్నానమాచరించి.. దైవాన్ని పూజించి.. దీపారాధన చేయాలి. ఇంటి ముందున్న తులసికోట దగ్గర దీపాలను వెలిగించడం మంచిది. దగ్గర్లోని గుడికి వెళ్లి దీపాలు వెలిగించాలి. కార్తీక మాసంలో ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు లేదా కార్తీక పౌర్ణమి వరకు కార్తీక స్నానాలు ఆచరించవచ్చని పురాణాలు చెబుతున్నాయి. పౌర్ణమి రోజు కార్తీక స్నానం చేసే సమయంలో కార్తీకే హం.... కరిష్యామి వ్రత స్నానం జనార్దన.. ప్రీత్యర్థం దేవేశ దామోదర మయనహ (ఓ జనార్దనా. కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే స్నానమాచరిస్తున్నాను. నన్ను రక్షించు)' అనే మంత్రం చదివితే ఎంతో పుణ్యం లభిస్తుంది.

ఉపవాసం ఇలా :

కార్తీక మాసంలో చేసే ప్రతి పనికి అంతర్లీనంగా ఒక ఆరోగ్య ఫలితం ఉంటుంది. అందులో ఉపవాసం ఒకటి. ఈ నెలలో ఇష్టదైవానికి ఉపవాసం ఉండటం ఎంతో మంచిది. ఉపవాసం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని సైన్స్ కూడా చెబుతున్నది. కార్తీకమాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేది ఒక నియమం. దీనినే 'నక్తమ్' అంటారు. పగలంతా ఆహారం లేకుండా ఉండలేనివాళ్లు పాలు పండ్లు తీసుకోవచ్చు. సూర్యోదయానికి ముందే నదీ స్నానాలు చేయాలి. సూర్యభగవానుడు తన కిరణాలతోసౌరశక్తిని నదీజలాలపై ప్రసరింప చేస్తాడు. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసిన వారి శరీరాలకు దీనివల్ల సౌర శక్తి లభిస్తుంది.

తులసీ కల్యాణం

క్షీరాబ్ది ద్వాదశి రోజున 32 వేల మంది దేవతలతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై.. తులసి దాత్రివనంలో ఉంటాడని పురాణాల్లో ఉంది. కృతయుగంలో దేవదానవులు క్షీరసాగర మథనం చేసిన రోజు కనుక దీనిని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. పాల సముద్రాన్ని చిలికిన కారణంగా చిల్కు ద్వాదశి అని కూడా అంటారు. కార్తీక మాసంలో తులసీ కల్యాణం జరుపుకోవడం ఎంతో పుణ్యప్రదం.

=== వీ6 వెలుగు, లైఫ్