కార్తీక పౌర్ణమికి గుట్టలో ఏర్పాట్లు పూర్తి

  • యాదిగిరిగుట్టలో సత్యనారాయణస్వామి వ్రతాలకు ఏర్పాట్లు
  • కొత్త గుట్టలో 8 బ్యాచ్‌ లు .. పాతగుట్టలో 6 బ్యాచ్ ల్లో నిర్వహణ  
  • ఒకే బ్యాచ్ లో వెయ్యి మంది దంపతులు వ్రతాలు చేసుకునేలా మండపం రెడీ
  • సాయంత్రం కొండపైన కార్తీక దీపోత్సవం 

యాదగిరిగుట్ట, వెలుగు : కార్తీక పౌర్ణమికి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం సిద్ధమైంది. శుక్రవారం పూజల కోసం తరలివచ్చే భక్తులకు ఆలయ ఆఫీసర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎక్కువగా సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. దీని దృష్ట్యా ఎంత మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా వ్రత బ్యాచ్ ల సంఖ్యను పెంచారు. ఇప్పటికే కార్తీకమాసం మొదలైనప్పటి నుంచి  రోజుకు ఆరు బ్యాచ్ ల్లో వ్రతాలు నిర్వహించేలా సదుపాయాలు కల్పించారు. 

పౌర్ణమి రోజున ఉదయం 5:30 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి రెండు గంటలకు ఒకటి చొప్పున మొత్తం 8 బ్యాచ్ ల్లో నిర్వహించుకునే ఏర్పాట్లు చేశారు.  కొత్త గుట్టతో పాటు పాతగుట్టలో కూడా వ్రత బ్యాచుల సంఖ్యను ఆరుకు పెంచారు. అక్కడ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్రతాలు చేసుకోవచ్చు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే సంఖ్యను పెంచుతామని ఆలయ ఈవో భాస్కర్ రావు చెప్పారు. ఒక్కో బ్యాచ్ లో ఒక్కో హాల్ లో 1,000 మంది దంపతులు పూజల్లో పాల్గొనేలా సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. 

ఇందుకు వ్రత పీటలు కూడా సిద్ధం చేశామని, రూ.800 చెల్లించి టికెట్ కొన్న భక్తులకు పూజా సామగ్రి సహా పాత్ర వస్తువులు కూడా పీటల వద్దకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదేవిధంగా కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నట్టు ఇప్పటికే ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కొండపైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సాయంత్రం 5:30 గంటల నుంచి దీపోత్సవం ఉంటుంది.  ఇందుకు అవసరమయ్యే సామగ్రిని భక్తులకు ఉచితంగా ఇచ్చేలా ఆలయ అధికారులు సిద్ధం చేశారు.