అన్న భాగ్య పథకం కింద నగదు లేదా బియ్యానికి బదులుగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బిపిఎల్) కార్డుదారులకు పప్పులు, పంచదార, లేదా వంటనూనెలను పంపిణీ చేయడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కెహెచ్ మునియప్ప ప్రకటించారు. కర్నాటక ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 93 శాతం మంది లబ్ధిదారులు 5 కిలోల బియ్యంతో పాటు మిగతా 5 కిలోల బియ్యానికి బదులు ఇతర నిత్యావసర సరుకులు పొందేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు.
ప్రస్తుతం అన్న భాగ్య పథకం కింద లబ్ధిదారులకు నగదు అందుతోంది. అయితే, ఇటీవలి సర్వేలో 93 శాతం BPL కార్డుదారులు పప్పులు, చక్కెర లేదా వంట నూనెలను స్వీకరించడానికి ఇష్టపడుతున్నారని సూచించింది. ఈ విషయమై అధికారులు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చిస్తామని మంత్రి మునియప్ప తెలిపారు.
కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషితో కూడా సమావేశమైన మునియప్ప, పేదలకు పంపిణీ చేయడానికి అవసరమైన బియ్యాన్ని అందజేస్తానని జోషి హామీ ఇచ్చారని పేర్కొన్నారు.ప్రస్తుతం కేంద్రం బిపిఎల్ కార్డుదారులకు పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యాన్ని అందిస్తోంది.
కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ)ని ఆశ్రయించిందని, ఆ సంస్థ కిలో బియ్యాన్ని రూ.34 చొప్పున అందజేస్తోందని కర్నాటక ప్రభుత్వం తెలిపింది. అయితే ఇప్పుడు కేంద్రం కిలో రూ.28కి నిర్ణయించిందని అన్నారు. ఈ విషయంలో కేంద్రమంత్రి జోషితో చర్చించి రాష్ట్ర ప్రభుత్వ అవసరాన్ని బట్టి బియ్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు.
అన్న భాగ్య యోజన కింద 10 కిలోల బియ్యం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఎఫ్‌సిఐ రాష్ట్రానికి అదనంగా 5 కిలోల బియ్యం ఇవ్వడానికి నిరాకరించడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యానికి బదులుగా రూ.170 ఇవ్వడం ప్రారంభించింది. అయితే ఈ విషయంలో కర్నాటక ప్రభుత్వం ప్రజల అభిప్రాయం కోరగా.... అన్నభాగ్యయోజన పథకంలో 5 కిలోల బియ్యంతో పాటు.. మిగతా 5 కిలోలకు సరిపడా.. పప్పులు.. నూనెలు, పంచదార ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి మునియప్ప తెలిపారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి అన్న భాగ్య పథకానికి బియ్యం కావాలని కోరారు. పప్పులు, నూనె, పంచదార తదితర ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తున్న లబ్ధిదారుల గురించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో చర్చించి దీనిపై ఏం చేయాలో నిర్ణయిస్తామని మునియప్ప తెలిపారు.