- ల్యాండ్స్కామ్కేసులో సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ
- ముడా ల్యాండ్ స్కామ్ కేసులో ఆయనను విచారించేందుకు హైకోర్టు ఓకే
- గవర్నర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు
- సీఎం సిద్ధూ వేసిన పిటిషన్ కొట్టివేత
బెంగళూరు: కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు అక్కడి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముడా ల్యాండ్ స్కామ్ కేసులో ఆయనను విచారించాలని ఆదేశిస్తూ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం మైసూర్అర్బన్ డెవలప్మెంట్అథారిటీ (ముడా) సేకరించింది.
అయితే దానికి ప్రతిఫలంగా అప్పట్లో సిద్ధరామయ్య సీఎంగా ఉన్న టైమ్ లో ఖరీదైన స్థలాలను సొంత ఫ్యామిలీకి కేటాయించారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు. గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.నాగప్రసన్న మంగళవారం తీర్పు వెలువరించారు. గవర్నర్ చట్టప్రకారమే విచారణకు ఆదేశించారని, అందులో ఎలాంటి లోపాలు లేవని పేర్కొన్నారు. అయితే తీర్పుపై రెండు వారాలు స్టే ఇవ్వాలని సిద్ధరామయ్య తరఫు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ కోరగా.. తాను ఇచ్చిన ఆదేశాలపై తానే స్టే విధించలేనని జడ్జి తెలిపారు. కాగా, హైకోర్టు తీర్పుతో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు ట్రయల్ కోర్టు ప్రక్రియ ప్రారంభించనుంది.
సీఎం రాజీనామా చేయాలి: బీజేపీ
సీఎం సిద్ధరామయ్య వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ‘‘గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును అంగీకరించి, సీఎం సిద్ధరామయ్య వెంటనే రాజీనామా చేయాలి” అని బీజేపీ కర్నాటక చీఫ్ విజయేంద్ర డిమాండ్ చేశారు. కాగా, ఇదంతా బీజేపీ చేసిన కుట్ర అని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. ‘‘సీఎం తప్పు చేయలేదు. ఈ కేసు నుంచి ఆయన క్లీన్ గా బయటకొస్తారు” అని అన్నారు.
నిజమే గెలుస్తుంది: సిద్ధరామయ్య
న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, చివరికి నిజమే గెలుస్తుందని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ‘‘బీజేపీ, జేడీఎస్ కలిసి ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాయి. అధికారంలోకి రావాలని ‘ఆపరేషన్ లోటస్’కు తెరతీశాయి. నేను వాళ్లపై పోరాటం కొనసాగిస్తా. న్యాయ నిపుణులతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటా. నేను రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ నేనెందుకు రిజైన్ చేయాలి? జేడీఎస్ నేత, కేంద్ర మంత్రి కుమారస్వామి ఇప్పుడు బెయిల్ పై ఉన్నారు. ఆయనేమైనా రిజైన్ చేశారా?” అని సిద్ధరామయ్య ప్రశ్నించారు.