MUDA Land Scam Case: కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు తాత్కాలిక ఊరట

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ముడా ల్కాండ్ స్కాం కేసులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టుకు హైకోర్టు సోమవారం రోజు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణను హైకోర్టు ఆగస్ట్ 29 వరకూ వాయిదా వేసింది. అప్పటివరకూ ఈ కేసులో సిద్ధరామయ్యకు తాత్కాలిక ఊరట దక్కినట్టయింది. మైసూరు అర్బన్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ(ముడా) ప్లాట్ల కేటాయింపు స్కాంలో కర్నాటక సీఎం సిద్ధరామయ్యపై ప్రాసిక్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆ రాష్ట్ర గవర్నర్ థావర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చంద్ గెహ్లాట్ పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

మైసూరు చుట్టుపక్కల భూములను ‘ముడా’ సేకరించి డెవలప్ చేసి 50:50 శాతం కింద భూయజమానులకు ప్లాట్లు కేటాయించేది. అయితే ముడా ల్యాండ్ డెవలప్​మెంట్ స్కీంపై తీవ్ర ఆరోపణలు రావడంతో దర్యాప్తు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం జులై 14న హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీఎన్ దేశాయ్ ఆధ్వర్యంలో కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ స్కీంలో భాగంగా సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి చెందిన 3.16 ఎకరాల భూమిని ముడా తీసుకుంది. పరిహారం కోసం ఆమె 2014లో దరఖాస్తు చేసుకున్నారు. 2021లో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆమెకు ప్లాట్లు కేటాయించారు. 

ఆమె నుంచి సేకరించిన భూమి విలువ కంటే ప్లాట్లు కేటాయించిన ఏరియాలో భూమి విలువ ఎన్నో రెట్లు ఎక్కువని ఆరోపణలు వస్తున్నాయి. ప్రదీప్ కుమార్ ఎస్పీ, టీజే అబ్రహం అనే వ్యక్తులు ఈ వ్యవహారంపై ఇటీవల పిటిషన్​ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎందుకు అనుమతి ఇవ్వకూడదో ఏడు రోజుల్లోగా తన సమాధానాన్ని ఇవ్వాలంటూ జులై 26న సీఎం గవర్నర్ థావర్ చంద్ సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. షోకాజ్​ను ఉపసంహరించుకోవాలని ఆగస్టు 1న రాష్ట్ర కేబినెట్ గవర్నర్కు సూచించింది. అయితే సీఎం సిద్ధరామయ్యపై ప్రాసిక్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శనివారం గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు. గవర్నర్ నిర్ణయంపై శనివారం రాత్రి రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

తాను ఏ తప్పు చేయలేదని.. రాజీనామా చేయబోనని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ముడా స్కామ్లో తన ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై న్యాయపరంగా పోరాడతాననని చెప్పారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ, చట్ట వ్యతిరేకమని అన్నారు. ‘‘ఇది ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర. వారు ఢిల్లీ, జార్ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా పలు రాష్ట్రాల్లో ఇదే పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, జేడీఎస్, ఇతరులకు ఈ కుట్రలో ప్రమేయం ఉంది. మా పార్టీ హైకమాండ్​, కేబినెట్, మొత్తం ప్రభుత్వం నా వెంట ఉంది” అని అన్నారు. మరోవైపు, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ మీడియాతో మాట్లాడుతూ సీఎం సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గవర్నర్ అనుమతివ్వడం రాజ్యాంగ, ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. ఆయనకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు.