కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ప్రజల ఆర్యోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోని ఓ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఫుడ్ కలర్ వాడే వంటకాలను నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలర్ గోబీ మంచూరియా, కాటన్ క్యాడీలను ఆ రాష్ట్రంలో బ్యాన్ చేశారు. 171 ఆహారపదార్థాల శాంపిల్స్ సేకరించి ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించారు. అందులో 107 వంటకాల్లో అసురక్షితమైన ఆర్టిఫిషియల్ కలర్స్ వాడుతున్నట్లు తేలిందట. ఆరోగ్య శాఖమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారపదార్థాలను గురించి వివరించారు. వాటి వల్ల వచ్చే సమస్యలు చెప్పారు.
తినే పదార్థాలను కలర్ ఫుల్ గా కనిపించడానికి రోడమైన్ -బి, టార్ట్రాజిన్ వంటి ఇతర రసాయనాలను ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కలర్ గోబీ మంచూరియా, కాటన్ క్యాండీ(పీచు మిఠాయి) లను రాష్ట్రంలో బ్యాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ఈ పదార్థాలు అమ్మినట్లైతే ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తామని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టే ఆహారాలు ఎవరైనా తయారు చేసి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరించారు.