బెంగుళూరు: మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్కాం కేసులో కర్నాకట సీఎం సిద్ధరామయ్యపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తోన్న విషయం తెలిసిందే. తన సతీమణికి సిద్ధరామయ్య అక్రమంగా విలువైన భూములు కట్టబెట్టారని పలువురు సామాజిక కార్యకర్తలు ఆ రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ముడా స్కాంలో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ పర్మిషన్ కూడా ఇచ్చారు. త్వరలోనే ముడా స్కామ్‌కు సంబంధించి సిద్ధరామయ్య లోకాయుక్త విచారణ ఎదుర్కొనున్నారు. స్టేట్‌లో సీఎం సిద్ధరామయ్య ఇష్యూ హాట్ టాపిక్‌గా ఉన్న వేళ కర్నాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
కర్నాటకలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఎంట్రీకి రాష్ట్ర ప్రభుత్వం రెడ్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో కేసుల విచారణకు సంబంధించి సీబీఐకి అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు ఇవాళ (సెప్టెంబర్ 26) సిద్ధరామయ్య సర్కార్ ప్రకటించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏదైనా కేసు విచారించేందుకు సీబీఐకి అనుమతి ఉంది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ సీబీఐకి అనుమతి నిరాకరించడంతో.. ఇకపై కర్నాటకలో సీబీఐ ఏదైనా కేసు విచారణ చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. రాష్ట్రంలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తున్నామనే విషయాన్ని కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ ఇవాళ మీడియాకు తెలిపారు.
ALSO READ : తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టు బెయిల్
సీబీఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుగా బొమ్మగా మారిందని.. బీజేపీ వ్యక్తిగత అజెండా కోసం ఆ సంస్థ పని చేస్తోందని పాటిల్ ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో సీబీఐ కేసుల విచారణ చేపట్టకుండా అనుమతి నిరాకరించామని.. ఈ నిర్ణయానికి ముడా స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్య విచారణ ఎదుర్కొబోతున్న తరుణంలో ప్రభుత్వం సీబీఐకి రెడ్ సిగ్నల్ ఇవ్వడం కన్నడ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముడా స్కామ్ కేసులో నెక్ట్స్ సీబీఐ రంగంలోకి దిగే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.