కరీంనగర్ కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలి

కరీంనగర్, వెలుగు: దేశ సాంస్కృతిక రంగం లో ప్రజాయుద్ధ నౌక గద్దర్ పోషించిన పాత్ర ఎంతో విలువైందని కవులు, కళాకారులు, మేధావులు కొనియాడారు.  ఆ మహనీయుడి సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. కరీంనగర్‎లో గద్దర్ గళం ఆధ్వర్యంలో ఆదివారం కవులు, కళాకారుల ఆత్మీయ సమావేశం జరిగింది. 

ముఖ్యఅతిథిగా గద్దర్ గళం ఫౌండర్ కొల్లూరి సత్తయ్య హాజరై మాట్లాడుతూ.. గద్దర్ గళం సంస్థ 10 జిల్లాల్లో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయనుందని తెలిపారు. వచ్చే నెల 31న గద్దర్ జయంతి రోజున కరీం నగర్‎లో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో కొత్తగా నిర్మిస్తున్న కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం సీనియర్ నేత కొరవి వేణుగోపాల్ మాట్లాడుతూ గద్దర్ పాటలు  సజీవంగా ఉంటాయన్నారు.  

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, గద్దర్ గళం ప్రధాన కార్యదర్శి పసునూరి రవీందర్ మాట్లాడుతూ.. తెలుగు నేల మీద ఎన్నో ఉద్యమాల్లో గద్దర్ పాటలు పోషించిన పాత్ర మరువలేనివన్నారు. బహుజన ఉద్యమ నేత గజ్జల స్వామి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు రాములు, అజయ్, మార్వాడి సుదర్శన్, కవి, కళాకారుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ బూర్ల వెంకటేశ్వర్లు, సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.