అంబానీ ఇంటి పెండ్లికి కరీంనగర్ కానుకలు

  • గెస్టులకు రిటర్న్ గిఫ్టులుగా కరీంనగర్ ఫిలిగ్రీ హ్యాండీక్రాఫ్ట్స్ 
  • 400 ఫిలిగ్రీ కళాఖండాలను ఆర్డర్ పెట్టిన అంబానీ ఫ్యామిలీ

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్ ఫిలిగ్రీ కళాఖండాలు మరోసారి ఖండాంతరాలను దాటనున్నాయి. అంబానీ ఇంట్లో జూలైలో జరగబోయే పెండ్లికి వచ్చే గెస్టులకు కరీంనగర్ ఫిలిగ్రీ జ్ఞాపికలను రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు. గత మార్చిలో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, హిల్లరీ క్లింటన్, రిహన్న వంటి విదేశీ ప్రముఖులతోపాటు దేశంలోని ప్రముఖ నటులు, క్రీడాకారులు హాజరైన విషయం తెలిసిందే. త్వరలో జరగబోయే పెండ్లికి కూడా దేశ, విదేశాలకు చెందిన సుమారు 400 మంది ప్రముఖులు హాజరుకాబోతున్నట్లు తెలిసింది. 

పెండ్లికి వచ్చే గెస్టులకు గిఫ్టులు ఇవ్వడానికి వెండితో చేసిన జ్యువెల్లరీ బాక్సులు, పర్సులు, ట్రేలు, ఫ్రూట్ బౌల్స్ ఇతర బహుమతులు ఇవ్వనున్నారు. ఇప్పటికే 400 ఫిలిగ్రీ కళాఖండాల కోసం అంబానీ ఫ్యామిలీ నుంచి ఆర్డర్‌ వచ్చినట్టు కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ (సిఫ్కా) అధ్యక్షుడు అశోక్ తెలియజేశారు. ఈ కళాఖండాల ద్వారా అంబానీ ఇంట పెండ్లికి వచ్చే ప్రముఖులకు 400 ఏళ్ల నాటి ఫిలిగ్రీ ప్రాచీన కళ పరిచయమవుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత సంపన్నుల ఇండ్లకు తమ కళాఖండాలు చేరుతాయని చెప్పారు. 

హైదరాబాద్‌ లో గత ఏడాది ప్రారంభించిన రిలయన్స్ రిటైల్ స్వదేశ్ స్టోర్‌ లో అమ్మేందుకు ఫిలిగ్రీ కళాఖండాలను తాము సప్లై చేస్తున్నట్లు తెలిపారు. తరతరాలుగా వస్తున్న ఈ ప్రాచీన హ్యాండీక్రాఫ్ట్స్ పై ఆధారపడి కరీంనగర్‌లో సుమారు 150 కుటుంబాలకు చెందిన 300 మంది జీవనోపాధి పొందుతున్నారు.