గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కరీంనగర్ దే కీ రోల్

  • ఎన్ రోల్ అయిన ఓట్లలో‌‌‌‌ సగానికిపైగా ఓట్లు ఉమ్మడి జిల్లావే
  • ఈ జిల్లా అభ్యర్థులపైనే అన్ని పార్టీల ఫోకస్‌‌‌‌
  • క్యాండిడేట్ల ఎంపికపై పొలిటికల్ పార్టీల సర్వే

కరీంనగర్, వెలుగు: త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కీ రోల్ పోషించబోతుంది. ఓటర్లుగా ఎన్ రోల్ మెంట్ చేసుకున్న గ్రాడ్యుయేట్లలో సగం మందికిపైగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడంతో అభ్యర్థుల గెలుపోటముల్లో ఈ జిల్లానే  కీలకం కాబోతుంది.

దీంతో  అన్ని  రాజకీయ పార్టీల​ అధిష్టానాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారినే  తమ అభ్యర్థులుగా ఎంపిక చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకోసం ఆశావహుల పేర్లను తెప్పించుకుని వారి గెలుపు అవకాశాలపై గ్రాడ్యుయేట్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా సర్వే బృందాలను రంగంలోకి దింపాయి.  

క్యాండిడేట్ల ఎంపికపై పొలిటికల్ పార్టీల సర్వే

ప్రధాన పార్టీల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ కోసం పోటీ పడుతున్నవారిలో మెజార్టీగా కరీంనగర్ జిల్లాకు చెందినవారే ఉన్నారు. ఆయా రాజకీయ పార్టీలు కూడా ఈ జిల్లాకు చెందిన క్యాండిడేట్ల మీదే ఆసక్తి చూపుతున్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన మళ్లీ పోటీ చేస్తారా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇక్కడ కాంగ్రెస్ టికెట్ కే ఎక్కువగా పోటీ ఉంది. కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నవారిలో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు, కేకే మహేందర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

ఇటీవల కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్ కూడా ఈ ముగ్గురి పేర్లతోనే సర్వే నిర్వహించి, వారి పేర్లను అధిష్టానానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది. అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇప్పటికే లక్షన్నర మంది గ్రాడ్యుయేట్లను ఎన్ రోల్ చేయించడంతోపాటు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు స్టడీ మెటీరియల్ అందించేందుకు ప్రత్యేక యాప్ తీసుకురావడం, ప్రచారంలో దూసుకుపోతుండడం ఆయన ప్లస్ గా మారింది. కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ చార్జీ వెలిచాల రాజేందర్ రావుకు ఆయన తండ్రి జగపతిరావులాగే.. ఇంటెలెక్చువల్ గా పేరుంది. పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రంగంలోకి దిగేందుకు ఆయన సిద్ధంగాఉన్నారు.

 తెలంగాణ ఉద్యమకారుడిగా పేరున్న కేకే మహేందర్ రెడ్డి చట్టసభల్లో అడుగుపెట్టడం తీరని కలగానే మిగిలింది. అందుకే ఆయన కూడా ఎమ్మెల్సీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ ముగ్గురి పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ తరఫున ఆశావహుల్లో ప్రధానంగా కరీంనగర్ మాజీ మేయర్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ పేరు వినిపిస్తోంది. గ్రాడ్యుయేట్లకు ఒక్క రూపాయికే హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తాననే హామీతో ఆయన ప్రచారం చేస్తున్నారు.  బీజేపీ పార్టీ తరఫున పొలసాని  సుగుణాకర్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. క్రితంసారి ఎన్నికల్లో  ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆయన మరోసారి బీజేపీ టికెట్ తనకే వస్తుందనే ధీమాతో ప్రచారం చేస్తున్నారు.

సగం ఓట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే.. 

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో ఉన్న  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో 3,58,579 మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా అప్లై చేసుకున్నారు. ఇందులో 1.75 లక్షల మంది(సుమారు సగం) ఒక్కడి కరీంనగర్ జిల్లా పరిధిలోనే ఉండగా.. మిగతా సగం ఓటర్లు మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నారు. 

కరీంనగర్ నుంచి హన్మకొండలో కలిసిన 4 మండలాలు, జయశంకర్ భూపాలపల్లిలో కలిసిన 5 మండలాలతో కలిపి ఉమ్మడి కరీంనగర్ జిల్లా(కరీంనగర్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి)లో 1,70,317 అప్లికేషన్లు వచ్చాయి. కరీంనగర్ నుంచి సిద్ధిపేట జిల్లాలో కలిసిన హుస్నాబాద్, అక్కన్నపేట్, కోహెడ, బెజ్జంకి మండలాల్లో మరో 5 వేల మంది గ్రాడ్యుయేట్లు ఉంటారని అంచనా.  అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 69,083, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 44,763, ఉమ్మడి మెదక్ జిల్లాలో 74,416 అప్లికేషన్లు వచ్చాయి.