కరీంనగర్​కూ కావాలి హైడ్రా

  • జిల్లాకేంద్రం శివారులో చెరువులు, కుంటలు కబ్జా
  • బొమ్మకల్, తీగలగుట్టపల్లి, ఆరెపల్లి, అలుగునూరులో కొనసాతున్న ఆక్రమణలు
  • ఎల్ఎండీ ఎఫ్‌‌టీఎల్ పరిధిలోనూ కబ్జాలు
  • నిద్రావస్థలో ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ శాఖలు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీతోపాటు చుట్టుపక్కలా ఉన్న చెరువులు, కుంటలు కబ్జాల పాలవుతున్నాయి. సిటీలోని తీగలగుట్టపల్లి, ఆరెపల్లిలో ఇప్పటికే కొన్ని కుంటలు కనిపించకుండాపోగా.. బొమ్మకల్, తీగలగుట్టపల్లి, ఆరెపల్లి, అలుగునూరులో చెరువులు, కుంటలు క్రమక్రమంగా కుచించుకుపోతున్నాయి. మరోవైపు లోయర్ మానేరు డ్యామ్ ఎఫ్టీఎల్ పరిధిలోనూ జోరుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.

 బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అమాయకుల ప్లాట్లను కబ్జా పెట్టిన లీడర్లను కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి జైలుకు పంపినప్పటికీ.. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులపై నజర్ పెట్టలేదు. సంబంధిత శాఖల ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అందుకే హైదరాబాద్ చుట్టుపక్కల అక్రమ కట్టడాలను కూలుస్తున్న హైడ్రా తరహాలోనే కరీంనగర్‌‌‌‌కు ఒక అథారిటీ కావాలనే  డిమాండ్ వినిపిస్తోంది.
 
లీడర్ల అండతో కబ్జా

కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సుమారు 13,456.91 హెక్టార్లలో 1008 చెరువులు, కుంటలు ఉన్నాయి. అయితే వీటికి హద్దులు నిర్ణయించకపోవడంతో కబ్జాల బారినపడుతున్నాయి. సిటీలో, సిటీ పక్కన ఉన్న గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. కరీంనగర్ సిటీలో కలిసిపోయిన బొమ్మకల్ భూ మాఫియాకు అడ్డాగా మారిన విషయం తెలిసిందే. ఇక్కడ కబ్జాదారులు చెరువులను చెరబట్టారు.

గ్రామ పరిధిలో 46.21 ఎకరాల్లో ఉన్న జక్కప్ప చెరువు,  28.10 ఎకరాల్లో ఉన్న గోపాల్ చెరువు, 16.10 ఎకరాల్లో ఉన్న నల్లచెరువు, 12 ఎకరాల్లో ఉన్న గోధుమకుంట, 9.10 ఎకరాల్లో ఉన్న రావికుంట క్రమంగా కబ్జాకు గురవుతున్నాయి. అలుగునూరులోని మామిడికుంట శిఖంలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.

ఇప్పటికే తీగలగుట్టపల్లి, ఆరెపల్లి సమీపంలోని మాలకుంట, ఉడతకుంట, అవుసుల కుంట విస్తీర్ణం సగానికి తగ్గిపోయింది. తీగలగుట్టపల్లి మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న ఊరకుంటలో ఎఫ్‌‌టీఎల్‌‌ పరిధిలో నిర్మాణాలు చేపట్టారు. ఈ కబ్జాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులందినా ఎలాంటి చర్యల్లేవు.  

సర్వే లేదు.. హద్దు రాళ్లు లేవు

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌‌లోని విలీన గ్రామాలతోపాటు, సమీపంలోని గ్రామాల్లోని చెరువులు, కుంటల శిఖాల్లో అక్రమంగా షెడ్లు, బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు. పక్కనే ఉన్న పట్టా భూమి కొనుగోలు చేసి.. దాని ఆసరాతో క్రమంగా చెరువులు, కుంటల శిఖాలను కలిపేసుకుంటున్నారు. ఇలా కోట్లాది రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. హద్దులు పాతి నీటి వనరులను కాపాడాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. అసలు వారి సహకారంతోనే ఇదంతా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కరీంనగర్ లో శివారు గ్రామాల విలీనం తర్వాత ఆయా గ్రామాల పరిధిలోని చెరువులు, కుంటలను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని నాలుగేళ్ల క్రితమే టెండర్ పిలిచినప్పటికీ ముందుకు సాగడంలేదు. ఐదు నెలల క్రితమే మరోసారి రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ డిపార్ట్ మెంట్లతో సర్వే చేయాలని నిర్ణయించి మధ్యలోనే వదిలేశారు. 

ఎల్ఎండీ ఎఫ్‌‌టీఎల్ ఏరియాలోనూ భారీ భవనాలు

కరీంనగర్ సిటీలోని లోయర్ మానేరు డ్యామ్ ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్‌‌టీఎల్) ఏరియాలోనూ అక్రమంగా బిల్డింగ్స్, ఫంక్షన్ హాళ్లు, గోదాములు వెలుస్తున్నాయి. ప్లాన్ ప్రకారం ముందస్తుగా మట్టి, రాళ్లతో నింపి ఆ తర్వాత కొన్నాళ్లకు నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు ఖాళీ ప్లాట్లు అమ్మేస్తున్నారు. ఇలాంటి కబ్జాలు చింతకుంట, పద్మా నగర్ ఏరియా వైపు ఎక్కువగా జరుగుతున్నాయి.

ఇప్పటికే సుమారు ఐదెకరాలకుపైగా ప్లాట్లు చేసి అమ్మేసినట్లు సమాచారం. ఇరిగేషన్, మున్సిపల్ ఆఫీసర్ల చేతివాటం, బడా లీడర్ల భరోసాతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కరీంనగర్‌‌‌‌కు హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకురావాలని కరీంనగర్‌‌‌‌ వాసుల నుంచి డిమాండ్‌‌ వస్తోంది.