రెట్టింపు ఆదాయం అంటూ మోసం.. కరీంనగర్‌ వ్యాపారి నుంచి రూ. 5.90 లక్షలు కాజేశారు..!

  • రెట్టింపు ఆదాయం అంటూ మోసం
  • వ్యాపారి నుంచి రూ. 5.90 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు 
  • మరో రూ.5 లక్షలు పోకుండా కాపాడిన మేనేజర్‌

కరీంనగర్‌ క్రైం, వెలుగు: గ్లోబల్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు ఓ చిరువ్యాపారి నుంచి రూ. 5.90 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్‌ పట్టణానికి చెందిన అఖిల్‌ అనే వ్యక్తి టవర్‌ సర్కిల్‌ ఏరియాలో చిరు వ్యాపారం చేసుకుంటున్నాడు. గ్లోబల్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే రెట్టింపు డబ్బులు వస్తాయంటూ అఖిల్‌ వాట్సప్‌కు ఈ నెల 17న ఓ మెసేజ్‌ వచ్చింది. దీంతో ఆ మెసేజ్‌లో ఉన్న లింక్‌ను ఓపెన్‌ చేసిన అఖిల్ మొదట రూ.4 వేలు ఇన్వెస్ట్ చేయగా అతడి అకౌంట్‌లో రూ.6,600 డిపాజిట్‌ అయ్యాయి.

దీంతో నిజమేనని నమ్మిన అఖిల్‌ వారం రోజుల్లో రూ.5.90 లక్షలను పెట్టుబడి పెట్టాడు. మరో రూ. 5 లక్షలు పెడితే మొత్తం తిరిగి వస్తాయని సైబర్‌ నేరగాళ్లు అఖిల్‌కు చెప్పారు. దీంతో బంగారాన్ని కుదువపెట్టేందుకు అఖిల్‌ మంగళవారం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు వెళ్లి మేనేజర్‌ను కలిశాడు. మేనేజర్‌ బంగారం విషయాన్ని ఆరా తీయడంతో అఖిల్‌ విషయమంతా చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన బ్యాంక్‌ మేనేజర్‌ వెంటనే కరీంనగర్‌ సైబర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు అఖిల్‌కు కౌన్సిలింగ్‌ ఇచ్చి రూ. 5 లక్షలు డిపాజిట్‌ చేయకుండా అడ్డుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.