నేడు రోడ్డెక్కనున్న ఎలక్ట్రికల్ బస్సులు

  • ప్రారంభించనున్న మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, ఉత్తమ్ 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ - 2 డిపో నుంచి 35 ఎలక్ట్రికల్ సూపర్ లగ్జరీ బస్సులు ఆదివారం రోడ్డెక్కనున్నాయి. కరీంనగర్ -2 డిపోకు 70 ఎలక్ట్రిక్ బస్సులు ఇటీవల చేరుకున్న విషయం తెలిసిందే. ఇందులో సగం బస్సులను ఆదివారం ఉదయం 9.30 గంటలకు కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర సివిల్ సప్లై, ఇరిగేషన్ శాఖ, జిల్లా ఇన్ చార్జీ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించనున్నారు. 

ఆరు డిపోల నుంచి ఎలక్ట్రిక్ బస్సులు.. 

కరీంనగర్-2 డిపో, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్-2 డిపోల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు మేజర్స్ జేబీఎం సంస్థతో  ఆర్టీసీ  ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కరీంనగర్-2 డిపోలో తొలిసారిగా బస్సులు ప్రారంభించబోతున్నారు. కరీంనగర్-2 డిపోలో బస్సుల చార్జింగ్ కోసం ఇప్పటికే11 కేవీ విద్యుత్ లైన్లు, 14చార్జింగ్ పాయింట్లు, మూడు ఎలక్ట్రిక్ ట్రాన్స్ ఫార్మర్లు బిగించారు. కరీంనగర్ నుంచి జేబీఎస్, మంథని, గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డికి నాన్ స్టాప్ పద్ధతిలో ఈ బస్సు లు నడపనున్నారు.