పరిచయం : నిజజీవిత పాత్రలే నా సినిమాలు

డైరెక్టర్.. యాక్టర్.. ప్రొడ్యూసర్.. ఈ మూడింటిని ఒకరే చేయడం అనేది సాహసం​. అయినప్పటికీ  సినిమా మీద ఉన్న ప్యాషన్ కొందరిని ఇవన్నీ చేయడానికి ప్రోత్సాహం అందిస్తుంది. అలాంటి వాళ్లలో ఒకరు రాజ్​ బి. షెట్టి.  కన్నడ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వాళ్లుండరు. ఆయన సినిమాలు తెలుగువారికీ పరిచయమే. రాజ్ నటన విషయానికొస్తే.. హీరో, కమెడియన్, క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా చేశాడు. ఇప్పుడు మలయాళ స్టార్ హీరో మమ్ముట్టికి ఆపోజిట్​గా విలన్​ రోల్​ ఛాన్స్ కొట్టేశాడు. లేటెస్ట్​గా వచ్చిన ‘టర్బో’ సినిమాలో మమ్ముట్టితో పాటు పోటాపోటీగా నటించి మెప్పించాడని ప్రశంసలు అందుకుంటున్నాడు. అతని గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ సంగతులు ఇవి..

‘‘మాది మంగళూరు. నాకు పెండ్లి, పిల్లలు, ఫ్యామిలీ వంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. నా ఆలోచనంతా మంచి సినిమా తీయాలంతే. సినిమాకు సంబంధించి ఏ విషయమైనా నాకు చాలా ఇంట్రెస్టింగ్. కాస్టింగ్, షెడ్యూలింగ్, ఆడిషన్ అన్నీ నేనే చేస్తా. డైలాగ్స్ కూడా రాస్తా. ఫిల్మ్ స్కూల్ నుంచి ఇండస్ట్రీకి రాలేదు. ఒక్కముక్కలో చెప్పాలంటే... ఫిల్మ్ మేకింగ్ గురించి తెలియని ఫిల్మ్ మేకర్​ని నేను. 

30 లక్షలు భారీ బడ్జెట్​ నాకు

నేను నటించిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన వాటిలో ‘టోబీ’ ఒకటి. దర్శకుడు నా టీమ్​ మెంబర్. సినిమా భారీ ప్రాజెక్ట్ కావడంతో నాకు సాయం చేయాలనుకున్నాడు. అందుకే ఈ సినిమా అతను తీస్తే బాగుంటుంది అనుకున్నా. కాకపోతే కెప్టెన్ ఆఫ్​ ది షిప్ నేనే అని చెప్పుకుంటా. ఎందుకంటే అది నా కథ, నా విజన్. అయితే, ఈ సినిమా తీసేటప్పుడు భారీ ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత భయం ఉండాలో తెలిసొచ్చింది. ఏదీ మన కంట్రోల్​లో ఉండదు. నేను తీసిన మొదటి సినిమా ‘ఒండు మొట్టేయ కథే’కు రూ.30 లక్షల బడ్జెట్​ అయింది. మాకు, అది చాలా పెద్ద మొత్తం. నా జీవితంలోనే రూ.30 లక్షలు చూడలేదు. ఆ మొత్తంతో ఏదైనా సాధించగలమో? లేదో? కూడా తెలియదు. ఈ సినిమాలో ఇంత పెద్ద సెట్స్ ఇంతకుముందు చూడలేదు. అవి చూసి నిజంగా ఈ సెట్స్​ మావేనా? అందులో ఎలా షూటింగ్​ చేస్తాం? అనుకున్నా. 

వాస్తవాన్ని సినిమాగా

మూస పద్ధతులను బ్రేక్ చేయాలి అనుకోలేదు. నేను గొప్ప మనిషిననీ చెప్పట్లేదు. నాలో లోపాలు ఉన్నాయి. నేను రాసేవి, పోషించే పాత్రలు కూడా నాలాగే ఉండాలని కోరుకుంటా. వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. ఎందుకంటే ఏ మనిషీ పర్ఫెక్ట్​ కాదు కదా! మనమందరం ఎదుర్కొనే సమస్యలనే  స్క్రీన్​ మీద చూపించాలి అనుకుంటా. నన్ను నేను హీరోగా ఫీలవ్వను. సినిమా అనేది ఒక కళ. దాన్ని అన్వేషించాలి. నేను ఆ పనే చేస్తున్నా. ప్రపంచంలోని ప్రతి ఎమోషన్.. స్క్రీన్​లో పెద్దగా చూపించే అవకాశం ఉంది. ఉదాహరణకు వీరత్వం ఒక టెంప్లేట్ అనుకుంటే, కాన్వాస్​ పెద్దదవుతుంది. 

ప్రజలు అసలు జీవితం అంటే ఏంటో మర్చిపోతున్నారు. కొన్ని సినిమాలు, పాత్రలు జీవిత వాస్తవికతను అర్థం చేసుకునేలా ఉంటాయి. ఆ పాత్రలు అసౌకర్యాన్ని కలిగించొచ్చు కూడా. ఎందుకంటే అవి నిజ జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. ‘గరుడ గమన- వృషభ వాహన’ అనే సినిమాలో మనిషి ఎందుకు అంత హింసాత్మకంగా ఉంటాడు? అని మాత్రమే అనుకున్నారు ప్రేక్షకులు. నా పాయింట్ కూడా అదే. మనం ఎందుకు హింసాత్మకంగా ఉన్నాం? దాన్నుండి మనం ఏం పొందుతాం? అనే ఆలోచన వచ్చింది. ఈ సినిమా మార్కెట్ పరంగా కూడా నాకు ఉపయోగపడింది. 

ఈ కథ కచ్చితంగా చెప్పాలి అనుకున్న వాటినే సినిమాగా తీస్తా. అలాగే ‘స్వాతి ముత్తిన మళె హనియే’ సినిమాలో లీడ్​ రోల్ అమ్మాయిది. ఫైట్స్, యాక్షన్​ సీన్స్ లేవు. అదొక ఎక్స్​పరిమెంట్ సినిమా. ప్రాక్టికల్​గా, వాస్తవికతకు దగ్గరగా ఉండే సినిమా ఇది.

నా దృష్టిలో మాస్ అంటే..

మాస్​ సినిమాలంటే హీరో చెప్పే డైలాగ్స్​కి విజిల్స్, క్లాప్స్ కొట్టడం కాదు. నా దృష్టిలో మాస్ అంటే అదో డిఫరెంట్ సబ్జెక్ట్. ‘ఎ’, ‘ఓం’ వంటి ఉపేంద్ర సినిమాలు చూసినప్పుడు నాకు అది డిఫరెంట్ ఎక్స్​పీరియెన్స్​ని ఇచ్చింది. ఆ సినిమాలు చూసి నేను డాన్స్ చేశా. ‘ఎ’ సినిమాలో ఫైట్లు ఉండవు. అది మాస్​ మసాలా అనే సంప్రదాయ పద్ధతిని బ్రేక్ చేసింది. ఉపేంద్ర కూడా అలాగే నటించాడు. ఫిల్మ్​ మేకర్​గా నా కంటెంట్​ని డిఫరెంట్​గా చూపించడమే నా గోల్. ప్రేక్షకులు కూడా నాలాంటి వారేనని నేను నమ్ముతున్నా. కాబట్టి నేను పర్సనల్​గా ఏ కంటెంట్​ అయితే చూడాలి అనుకుంటానో అలాంటి కంటెంట్​ని వాళ్లకు అందిస్తా. 

పాన్ ఇండియా ట్రెండ్

లైఫ్ సైకిల్​లో ముగింపు అనేది ఉంటుంది. ఏదీ ఎక్కువ కాలం అలాగే ఉండదు. ఈ పాన్ ఇండియా  అనే ట్రెండ్​కి కూడా ఎండింగ్ అనేది ఒకటి ఉంటుంది. మనం పోలీస్ స్టోరీలు, లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీస్, మైథాలజీ.. ఇలా రకరకాల కాన్సెప్ట్​ ఓరియెంటెడ్ సినిమాలు చేశాం. అన్ని భాషలూ ఈ ట్రెండ్​ని ఫాలో అయ్యాయి. ఇప్పుడు వాటిని మర్చిపోయాం. ఇక్కడ మేం పదేండ్లలో పెద్ద హిట్​లను అందించలేకపోయాం.

అందుకు కారణం మార్కెట్ తెలియకపోవడమే. కాబట్టి పాన్ ఇండియా ట్రెండ్ అనేది కూడా ఏదో ఒక రోజు ఆగిపోతుంది. అలాగని నాకు భాషాపరమైన భేదాలు లేవు. ఇతర భాషల్లో, పరిశ్రమల్లో పనిచేసేందుకు నేనెప్పుడూ రెడీ. ఎందుకంటే కొత్త విషయాలను నేర్చుకునే విద్యార్థిలాగే ఉండాలి అనుకుంటా కాబట్టి. సెట్​ వేయడం నుంచి ఇతర భాషల వంటి ఎన్నో విషయాలను నేర్చుకునేందుకు నేను రెడీ!’’ 

టర్బో సంగతులు..

ఈ సినిమాలో మమ్ముట్టి, నేను ముఖాముఖి వచ్చే సీన్స్ ఉన్నాయి. అందులో వెట్రివేల్ షణ్ముగ సుందరం అనే తమిళుడి పాత్ర నాది. ఫస్ట్ డే ఒక పెద్ద సీన్ తీయాల్సి ఉంది. ఆ సీన్​లో నాకు తమిళంలో డైలాగ్స్ ఇచ్చారు. నాకు తమిళం రాదు.. కాబట్టి ఆ లైన్స్ నేర్చుకుని చెప్పడానికి చాలా కష్టపడ్డా. అప్పుడు దర్శకుడు నా పాత్రకు బదులు మలయాళం మాట్లాడితే బాగుంటుందని డిసైడ్ అయి నాకు ఒక పేజీ పొడవునా కొత్త డైలాగులు ఇచ్చారు.

ఆ సీన్​లో మమ్ముట్టి క్యారెక్టర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా నన్ను చూస్తూ ఉంటుంది. నేను మాత్రం కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటా. అయితే, నేను మలయాళం మాట్లాడటం సౌకర్యంగా ఉన్నప్పటికీ, ఐదు నిమిషాల గ్యాప్​లో చాలా లైన్స్ నేర్చుకోవడం అంటే కష్టమే. నా ఇబ్బందిని అర్థం చేసుకుని, స్క్రిప్ట్ తీసుకుని సీన్​కు సంబంధించిన డైలాగ్స్ చెప్పారు నాకు. అలా పని చాలా ఈజీ అయిపోయింది.

మమ్ముట్టి నాతో కలిసిపోయిన విధానం వల్ల నేను చాలా ఈజీగా కంఫర్ట్ జోన్​లోకి వెళ్లిపోయా. మొదటి రోజు నుంచే నాకు ఆ కంఫర్ట్ దొరికింది. డైరెక్టర్ కూడా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు. ఏదైనా నచ్చకపోతే నేను సలహాలు ఇవ్వగలను. నేను పోషించిన పాత్ర విలన్ అయినప్పటికీ అతని వాయిస్, పిచ్ గంభీరంగా ఉండదు. ఇలా చాలా ప్రయోగాలు చేశాం. నటుడిగా నేను హ్యాపీగా ఫీలయిన సినిమా ఇది. 

ఆయనే నాకు స్ఫూర్తి!

‘టాక్సీ డ్రైవర్ (1976)’ సినిమాలో రాబర్ట్​ డి నీరో నాకు ఇన్​స్పిరేషన్. ఆ సినిమా చూస్తున్నంతసేపు ఆయన ఎప్పుడు నటిస్తాడా? అని ఎదురు చూస్తూనే ఉన్నా.  సినిమా పూర్తయ్యాక నాకు అర్థమైంది ఏంటంటే ఆయన పుట్టుకతోనే ఒక ఆర్టిస్ట్ అని​.

మేం ముగ్గురం కలిశామంటే..

రక్షిత్​ షెట్టి, రిషబ్​ షెట్టి, నేను.. ముగ్గురం కజిన్స్​, మంచి ఫ్రెండ్స్. ఒకరికోసం ఒకరం పనిచేస్తాం. ఎమోషనల్​ సపోర్ట్ ఇస్తాం. ముగ్గురం దర్శకులమే కాబట్టి సినిమా పట్ల మా ఫోకస్ ఎలా ఉందనే విషయాల గురించి డిస్కస్ చేస్తాం. మంచి సినిమాలు తీయాలి. మంచి కథలు చెప్పాలనేదే మా ధ్యేయం. 

- ప్రజ్ఞ