నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం నెల్లికల్లు లిఫ్ట్ ప్రాంతం వద్ద బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీ సుల కథనం ప్రకారం..బైపోల్లో భగత్‌ను గెలిపిస్తే ఏడాదిన్నరలో నెల్లికల్లు లిఫ్ట్‌ను కుర్చీ వేసుకుని పూర్తి చేయిస్తానని కేసీఆర్ చెప్పి నెరవేర్చలేదంటూ లిఫ్ట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంకణాల నివేదితా రెడ్డి, ఆమె భర్త బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి ఆందోళన చేశారు. ఖాళీ కుర్చీ వేసి, మోకాళ్ల పై కూర్చుని నిరసన తెలిపారు.
తర్వాత నాగార్జున సాగర్– -హైదరాబాద్మెయిన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఇదే సమయంలో నెల్లికల్లు, జాల్ తండా, ఎర్రచెరువు తండాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, లీడర్లు హాలియాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశ్వీరాద సభకు వెళ్తూ దారి ఇవ్వాలని కోరారు. దీనికి బీజేపీ లీడర్లు వెళ్లనిచ్చే ప్రసక్తే లేదని అడ్డుకోవడంతో రెండు పార్టీల లీడర్ల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. బీఆర్ఎస్ కార్యకర్తల ఆటోను అడ్డుకోబోయిన కంకణాల శ్రీధర్‌రెడ్డిని కోపోద్రిక్తులైన బీఆర్ఎస్కార్యకర్తలు, నాయకులు చితకబాదారు. పిడిగుద్దులు కురిపించడంతో పాటు కింద పడేసి కాళ్లతో తన్నడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
గాయపడిన శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అక్కడి నుంచి తరలించారు. తర్వాత ఆయన నల్గొండలోని రివర్ నిమ్స్దవాఖానలో చేరారు. ఆయన లివర్ డ్యామేజీ అయ్యిందని డాక్టర్లు చెబుతున్నారని ఆ పార్టీ లీడర్లు తెలిపారు. దాడిని నిరసిస్తూ కంకణాల నివేదితారెడ్డి, ఇతర లీడర్లు సాగర్–హైదరాబాద్ రోడ్డుపై బైఠాయించారు. మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, సీఐ భీషన్న అక్కడికి వచ్చి వారిని పీఎస్‌కు తరలించారు.
ఫోన్లో కిషన్‌రెడ్డి పరామర్శ
దాడి విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ..శ్రీధర్‌రెడ్డి భార్య, సాగర్ బీజేపీ అభ్యర్థి నివేదితా రెడ్డికి ఫోన్‌చేశారు. ఘటన జరిగిన తీరును, శ్రీధర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ ఇలాంటి దాడులకు తెగబడుతోందని కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్రెడ్ది, డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి, నిమ్మల రాజశేఖర్‌రెడ్డి శ్రీధర్‌రెడ్డిని పరామర్శించారు. నివేదితా రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే భగత్ గంజాయి బ్యాచ్ తో కలిసి తన భర్త శ్రీధర్ రెడ్డిని హత్య చేయించడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.