- వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న బీజేపీ ఎంపీ
- తాను చేసిన కామెంట్లు పూర్తిగా తన వ్యక్తిగతమని వెల్లడి
- చింతిస్తున్నానని ఎక్స్ లో వీడియో పోస్టు
సిమ్లా: రద్దయిన వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాల్సిన అవసరం ఉందని ఇంతకుముందు వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. వ్యవసాయ చట్టాలపై తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ లో ఆమె ఒక వీడియో పోస్టు చేశారు. ‘‘ప్రస్తుతం నేను నటిని మాత్రమే కాదు, బీజేపీ సభ్యురాలిని, ఎంపీని కూడా. వ్యవసాయ చట్టాలపై నేను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా. మొదటిసారిగా ఆ వ్యవసాయ చట్టాలను అమల్లోకి తెచ్చినపుడు కొన్ని రాష్ట్రాలు మాత్రమే వ్యతిరేకించాయి.
చాలా మంది ఆ చట్టాలకు మద్దతు ఇచ్చారు. క్రమంగా ఆ చట్టాలపై రైతుల నుంచి వ్యతిరేకత పెరగడంతో మన ప్రధాని నరేంద్ర మోదీ వాటిని ఉపసంహరించారు. ఆ చట్టాలను వెనక్కి తీసుకురావాలని నేను చేసిన వ్యాఖ్యలతో పలువురు నిరాశకు గురైనట్లు తెలుస్తున్నది. అందుకు నేను ఎంతో చింతిస్తున్నా. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా” అని కంగన తెలిపారు. అంతకుముందు మండి జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలపై కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే వ్యతిరేకత వచ్చిందని, వాటిని మళ్లీ తేవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.