అబద్ధాల పునాదులు కుంగినయ్​ : కంచర్ల రఘు

‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో  సుమారు 200 పిల్లర్లు ఉన్నయ్.. అందులో కుంగింది నాలుగంటే నాలుగు పిల్లర్లు.. ఈ మాత్రానికే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు ముప్పు వచ్చినట్టు ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నది.”  ఇదీ గత పాలకుల వాదన.  మేడిగడ్డలో కుంగినవి నాలుగు పిల్లర్లే కావచ్చు. కానీ, ఇది ఎందుకు తీవ్రమైన సమస్యనో వివరంగా చూద్దాం.   

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఏటా ఎత్తాల్సిన మొత్తం 215 టీఎంసీల నీళ్లలో, 195 టీఎంసీలు కేవలం మేడిగడ్డ నుంచే ఎత్తాలి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు కావాల్సిన 90% నీరు మేడిగడ్డ నుంచే రావాలి. అందుకే మేడిగడ్డను కాళేశ్వరం ప్రాజెక్టుకు ‘గుండెకాయ’ అని పిలుస్తారు. అలాంటి మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని పియర్లు (వాడుకలో జనం “పిల్లర్లు” అని పిలుస్తారు) 21 అక్టోబర్, 2023 నాడు కుంగి, క్రాకులిచ్చినయ్. ఇలాంటి పరిస్థితుల్లో నీళ్లు నిలువ చేస్తే బ్యారేజీకి మరింత ప్రమాదమని కేంద్ర నిపుణుల బృందం హెచ్చరించింది. దీంతో ఆ బ్యారేజీలో నీళ్లను నిలువ చేయడం లేదు. దీనికి రిపేర్లు చేసి మళ్లీ  వినియోగంలోకి తీసుకురావాలి. అప్పటిదాకా ఒక్క చుక్కా ఎత్తే అవకాశం లేదు. అంటే కాళేశ్వరం ‘గుండెకాయ’ ఆగినట్టే.. సమస్య చిన్నదెలా అవుతుంది? 

మేడిగడ్డ బ్యారేజీని మొత్తం 8 బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాకులో సుమారు 10–11 పియర్ల చొప్పున, మొత్తం 85 పియర్లు ఉన్నాయి. ఏ ఒక్క పియర్​లో సమస్యలు తలెత్తినా, కనీసం ఆ బ్లాకులోని మొత్తం పియర్లను తొలగించాల్సిందే.  అంటే ఇప్పుడు కుంగిన 7వ బ్లాకులో ఉన్న 12 పియర్లను తొలగించి, మళ్లీ కట్టాలి. ఈ కాంక్రీట్ పియర్లను తొలగించడం అంత ఈజీ కాదు. 

బాంబులు పెట్టి పేల్చేసి తొలగిస్తే మొత్తం బ్యారేజీ  కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ‘డైమండ్ కట్టింగ్’ ద్వారా నెమ్మదిగా ఈ పియర్లను జాగ్రత్తగా తొలగించాలి. కాబట్టి ఈ పియర్లను కట్ చేసి పునర్నిర్మించడానికి  కొన్ని నెలల సమయం పడుతుంది.  


మేడిగడ్డ పియర్లు కుంగడం మరింత తీవ్రమైన సమస్య అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజీ కట్టినచోట ఇసుక లోతు ఎక్కువగా ఉంది. నదీగర్భంలో గట్టి రాయి తగిలిన దగ్గరి నుంచి కాంక్రీటు పునాదులు నిర్మించాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ బ్యారేజీని ఇసుకపైనే నిర్మించారు. అంటే మొదటగా నదికి అడ్డంగా ఇసుకపైనే ఈ ఒడ్డు నుంచి ఆవలి వడ్డు వరకు 1625 మీటర్ల పొడవు, 110 మీటర్ల వెడల్పు, సుమారు 2.50 మీటర్ల మందం ఉన్న ఒక కాంక్రీటు బేస్​మెంట్ ( రాఫ్ట్ అని పిలుస్తారు) నిర్మించారు. 

ఈ మొత్తం బేస్​మెంటును ఒకే నిర్మాణంలా (Monolithic) ఎక్కడా ఎలాంటి గ్యాపు లేకుండా నిర్మిస్తారు. ఈ బేస్​మెంటు పైననే మొత్తం పియర్లను నిర్మిస్తారు. ప్రతి రెండు పియర్ల మధ్యలో గేట్లు పెట్టి పై నుంచి వచ్చే నీటిని నియంత్రించడం జరుగుతుంది. ఈ పియర్ల పై నుంచి నదిని దాటడానికి ఒక రోడ్డు బ్రిడ్జ్ కూడా నిర్మించారు. 

మరి ఇసుక మీద బేస్​మెంటు ఉంటే, పైన గేట్లు వేసినప్పుడు కింద నుంచి నీరు వెళ్లి ఇసుక కొట్టుకు పోయి బ్యారేజీ కుంగుతుంది కదా..? అని అనుమానం రావచ్చు. ఇలా ఇసుక కొట్టుకుపోకుండా బేసుమెంట్​కు రెండు వైపులా కిందికి, నిట్టనిలువుగా సుమారు 10  మీటర్ల లోతు వరకు గోడలను కడతారు. ఈ గోడలను ‘కట్-ఆఫ్- వాల్స్’ అంటారు. ఈ ‘కట్-ఆఫ్-వాల్స్’ను ‘సీకెంట్ పైల్స్’తో నిర్మిస్తారు. సీకెంట్ పైల్స్ అంటే గుండ్రటి పిల్లర్లు. ఈ సీకెంట్ పైల్స్​ను ఒకదానిని మరొకటి ఆనుకునేవిధంగా నిర్మించడం ద్వారా బేస్​మెంటుకు రెండువైపులా ‘కట్-ఆఫ్-వాల్స్’ నిర్మాణం చేస్తారు. ఇసుకకు పైన బేస్​మెంటు, రెండువైపులా ‘కట్- ఆఫ్- వాల్స్’ ఉంటాయి కాబట్టి మధ్యలో ఉన్న ఇసుక నదీ ప్రవాహానికి ఎటూ కొట్టుకుపోకుండా ఉంటుంది. 

ఇక మేడిగడ్డలో జరిగిందేమిటి?:  

పియర్ల కింద నిర్మించిన బేస్​మెంటు ఒక చోట మీటరున్నర మేరకు కుంగింది. బేస్​మెంటు కుంగడంతో బేస్​మెంటు పైన ఉన్న నాలుగు పియర్లు కూడా కుంగి క్రాకులు వచ్చాయి. పియర్లు కుంగడంతో పైన ఉన్న రోడ్ బ్రిడ్జ్ కూడా కుంగింది. (మనకు మేడిగడ్డ ఫొటోలలో కుంగినట్టు కనబడుతున్నది ఈ బ్రిడ్జే). ఇక్కడే అసలు విషయం ఉంది. కుంగిన బేస్​మెంటు మొత్తం ఎలాంటి గ్యాప్ లేకుండా ఇసుకపై నిర్మించిన కట్టడం. 

ఇది కుంగిందంటే కేవలం ఆ రెండు పిల్లర్లకే కాదు, ఇతర బ్లాకుల్లోని మిగతా పియర్లకూ సమస్య వ్యాపించే అవకాశాలను తోసిపుచ్చలేం. అయితే ఈ క్రాకులు మిగతా పియర్లలో ఇప్పుడే బయటకు కనబడక పోవచ్చు. కానీ మిగతా పియర్లకు కూడా అంతర్గతంగా డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రిపేర్లు ఒక బ్లాకులోని పియర్లకే కాకుండా, కింద ఉన్న బేస్​మెంటుకు, మరిన్ని పియర్లకు చేయాల్సి రావచ్చు. అప్పుడు బ్యారేజీ రిపేర్ల సమయం మరింత పెరుగుతుంది. 

  మరో సమస్య..అసలు బేస్​మెంటు ఎందుకు కుంగింది. అంటే ఒకే ఒక కారణం కిందనున్న ఇసుక కొట్టుకుపోవడమే. ఇసుక కొట్టుకు పోయిందంటే బేస్​మెంటుకు రెండు వైపులా కట్టిన సీకెంట్ పైల్స్​లో సమస్య ఉన్నట్టే. సీకెంట్ పైల్స్​తో కట్టిన కట్-ఆఫ్- వాల్ కొంత భాగం విరిగి, దాని నుంచి నీరు ప్రవేశించి బ్యారేజీ కిందనున్న ఇసుకను తొలగించింది. మరి సీకెంట్ పైల్స్ ఎందుకు విరిగినట్టు? దీనికి కారణం కేవలం నిర్వహణ వైఫల్యమేనా?  లేక డిజైన్ వైఫల్యం కూడానా? బ్యారేజీ కుంగిన వెంటనే వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (NDSA) కమిటీ ఇది సీకెంట్ పైల్స్ డిజైన్ వైఫల్యం అని ప్రాథమికంగా అంచనా వేసింది. 

మేడిగడ్డ బ్యారేజీతో పాటు ఇతర బ్యారేజీలపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన నిపుణుల కమిటీ అధ్యయనంలో పూర్తి వివరాలు బయట పడతాయి. వారి సిఫార్సులను బట్టి రిపేర్లకు పట్టే సమయం ఆధారపడుతుంది. నిజంగానే  డిజైన్ వైఫల్యం అయితే రిపేర్లకు చాలా సమయం పడుతుంది.  మరొక కీలకమైన విషయం. మేడిగడ్డ, అన్నారం పంపుహౌస్​లు జూలై, 2022 న మునిగిపోయాయి. ఈ ప్రమాదం జరిగిన తరువాత రాష్ట్ర నీటిపారుదల శాఖ కేంద్ర జల సంఘానికి  ఈ వివరాలు పంపుతూ సలహా కోరింది. అప్పుడు CWC మొత్తం బ్యారేజీల, పంపుహౌస్​ల నిర్మాణాలపై, వాటి భద్రతపై అనేక కీలక ప్రశ్నలను లేవనెత్తింది. 

బ్యారేజీల స్థలం ఎంపికలో, నిర్మాణాలలో అనేక తప్పులను వేలెత్తి చూపించింది. ఇదే అభిప్రాయాన్ని  ప్రస్తుత ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ కూడా వెలిబుచ్చితే, మొత్తం బ్యారేజీ భవిష్యత్తే  ప్రశ్నార్ధకమౌతుంది. ఒకవేళ కేవలం రిపేర్లకే పరిమితమైనా, ఖర్చు తడిసి మోపెడవుతుంది. కాబట్టి ప్రస్తుత సమస్య కేవలం మేడిగడ్డకే పరిమితం అనుకున్నా, సమస్య చాలా తీవ్రమైనదని అర్థమౌతున్నది. 

గత పాలకుల వాదన ఈ విధంగా ఉంది. ‘ఒక్క మేడిగడ్డకు సమస్య వస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకే సమస్య వచ్చినట్టు కాదు.. కాళేశ్వరం ప్రాజెక్టంటే కేవలం మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు.. అదో పెద్ద వ్యవస్థ.. అందులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంపు హౌస్​లు, 19 సబ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాలువలు ..’ వీళ్ళ ఉద్దేశ్యం సమస్య కేవలం మేడిగడ్డ పరిమితం.. మిగతా అంతా సవ్యంగా ఉంది అని చెప్పడం..కాబట్టి మేడిగడ్డ సమస్యను పట్టించుకోనవ సరం లేదు. నిజంగా వీళ్లు చెబుతున్నట్టు కాళేశ్వ రం ప్రాజెక్టులో సమస్య కేవలం మేడిగడ్డకే పరి మితమైందా? మేడిగడ్డ బ్యారేజీ కుంగక ముందే కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక తీవ్రమైన సమస్యలు వచ్చాయి. అవేంటో చూద్దాం...

  దెబ్బతిన్న మూడు బ్యారేజీల ఆప్రాన్​లు, సిమెంటు, కాంక్రీటు బ్లాకులు

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణం 2019లో పూర్తయ్యింది. అదే ఏడాది నవంబరులో వచ్చిన గోదావరి వరదలలో ఈ మూడు బ్యారేజీల ఆప్రాన్​లు, సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు మొత్తం కొట్టుకుపోయాయి. బ్యారేజీల నుంచి వరద వేగంగా కిందికి ప్రవహిస్తున్నప్పుడు, బ్యారేజీకి దిగువభాగంలో నున్న భూమి కొట్టుకుపోకుండా ఇవి రక్షణ నిస్తాయి. ఈ ప్రమాదం 2019లో జరిగితే, ఇప్పటి వరకూ ఎలాంటి రిపేర్లకు ఇవి నోచుకోలేదు. ప్రతి ఏటా వరదలలో వీటి పరిస్థితి మరింత దిగజారింది. ఈ ఆప్రాన్​లు, సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు బ్యారేజీ రక్షణలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. బ్యారేజీకి వీటి రక్షణ కొరవడినప్పుడు పియర్ల కింద వేసిన సీకెంట్ పైల్స్​కు ప్రమాదం ఏర్పడుతుంది. నిజానికి ఈ రక్షణ కవచం దెబ్బతినడమే ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి ఒక ప్రధానకారణమని తెలుస్తున్నది.

  దెబ్బతిన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు

మూడు బ్యారేజీల ఆప్రాన్​లు, సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోవడంతో మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతోపాటు, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల కింద నీటి బుంగలు ఏర్పడ్డాయి.ఈ బుంగలు బ్యారేజీ కింద నుంచి ఇసుక కొట్టుకుపోవడంతో ఏర్పడతాయి. గత పాలకులు చెబుతున్నట్టు ఇవి లీకేజీలు కావు. మరొక భారీ వరద వస్తే ఈ బ్యారేజీలు కూడా కుంగవనే గ్యారంటీ లేదు. గత ప్రభుత్వం వీటికి తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేసింది. అయితే మేడిగడ్డ పియర్లే ఎందుకు ముందుగా కుంగాయి? దీనికి ప్రధాన కారణం మేడిగడ్డకు ప్రధాన గోదావరి నీళ్లతో పాటు, ముఖ్యమైన ప్రాణహిత నీటి వరద కూడా తోడవడం అనుకోవచ్చు. సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలకు ప్రాణహిత వరద రాదు. అయితే అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల డిజైన్లు కూడా మేడిగడ్డకు అనుసరించిన డిజైన్లే కాబట్టి ఈ బ్యారేజీలు కూడా మేడిగడ్డ ఎదుర్కొన్న సమస్యనే ఇప్పుడు ఎదుర్కొంటున్నాయి. 

  మునిగిన మేడిగడ్డ, అన్నారం పంపు హౌసులు

జూలై, 2022 వరదలకు మేడిగడ్డ, అన్నారం పంపు హౌస్​లు మునిగాయి. మేడిగడ్డ పంపు హౌస్​లో రక్షణ గోడ కూలి అనేక మోటార్లు తుక్కు తుక్కుగా మారాయి. దీంతో వందల కోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పటికీ కొన్ని మోటార్లకు రిపేర్లు పూర్తి కాలేదు. ఈ మునకకు అప్పటి పెద్దలు చెప్పిన కారణం, ‘ ఇలాంటి వరద 500 ఏళ్లలో ఎప్పుడూ రాలేదు’ అని. ఇది శుద్ధ అబద్ధం. ఈ పంపుహౌస్​లను ఉద్దేశ్యపూర్వకంగానే తక్కువ ఎత్తులో కట్టారని చెప్పడానికి అనేక ఆధారాలు ఇప్పటికే లభించాయి. మొదట ఎక్కువ ఎత్తులో ప్రతిపాదించిన డ్రాయింగులు, తదుపరి ఎత్తు తగ్గించి విడుదల చేసిన డ్రాయింగులు బయటపడ్డాయి.  

ఇలా ఎత్తు తగ్గించి పంపుహౌస్​లు కట్టడానికి కారణం, త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి పైనుంచి పెద్దలు తెచ్చిన  ఒత్తిడా? లేక  కాంట్రాక్టరుకు మేలు చేయడానికా? లేక డిజైన్ లోపమా?  అన్న విషయం తెలియాలి. CWC కూడా తెలంగాణ ఇరిగేషన్ శాఖకు 24 మార్చి, 2023 నాడు రాసిన లేఖలో ఇలా తక్కువ ఎత్తులో పంపుహౌస్​లు కట్టడాన్ని తప్పు పట్టింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడిగా పనిచేసిన ఒక పెద్ద మనిషి కూడా తాను చేసిన సూచనలను పక్కకు పెట్టి పంపుహౌస్​లు తక్కువ ఎత్తులో కట్టారని బహిరంగంగానే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే భారీ వరదలు వచ్చిన ప్రతిసారి ఈ పంపుహౌస్​లు మునిగే ప్రమాదం ఉంది. మునిగిన ప్రతిసారి వందల కోట్ల నష్టం తప్పదు.

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన తరువాత గత పాలకుల నుంచి, వారిని సమర్థించే  పెద్దమనుషుల నుంచి ప్రతి రోజూ వింతైన  వాదనలను, ఆరోపణలనూ మనం వింటున్నాం. ఉద్దేశ్యపూర్వకంగానే కొత్త ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేస్తున్నదని వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాల నుంచి, ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తీవ్రమైన అవకతవకల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి  చేస్తున్న ప్రయత్నాలు ఇవి. గత పాలకుల వాదనలపై ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ కింది ప్రధానమైన వాదనలపై, ఆరోపణలపై ఒక స్పష్టత అవసరం. ఇవి అర్థమైతే గత పాలకులు చేస్తున్న అనేక వాదనలు ఎంత అర్థరహితమో అవగతమౌతుంది.

- కంచర్ల రఘు
విద్యుత్​ రంగ నిపుణుడు,
(కాళేశ్వరం ఎత్తిపోతల పథకం
‘రీ‑ ఇంజనీరింగ్​‑భారీ 
ఇంజనీరింగ్​ తప్పిదం’ 
పుస్తక రచయిత)