SL vs NZ 2024: 13 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా శ్రీలంక క్రికెటర్

శ్రీలంక బ్యాటర్ కామిందు మెండీస్ టెస్ట్ క్రికెట్ లో సంచలనంగా మారుతున్నాడు. వరుసబెట్టి సెంచరీలు.. హాఫ్ సెంచరీలు కొట్టేస్తున్నాడు. పట్టుమని 10 టెస్టులు ఆడకుండానే ప్రపంచ రికార్డులు కొల్లగొడుతున్నాడు. తొలి టెస్ట్ నుంచి బ్యాటింగ్ లో చెలరేగుతున్న ఈ యువ క్రికెటర్.. తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీతో కదం తొక్కాడు. 147 బంతుల్లో సెంచరీ చేసి తన కెరీర్ లో ఐదో సెంచరీని నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు.. ఒక సిక్సర్ ఉన్నాయి. 

ALSO READ | IND vs BAN 2024: బంగ్లా ఓపెనర్ జిడ్డు బ్యాటింగ్.. 24 బంతులాడి డకౌటయ్యాడు

ఇప్పటివరకు 8 టెస్టుల్లో మెండీస్ మొత్తం 13 ఇన్నింగ్స్ లు ఆడాడు. వీటిలో ఏకంగా 5 సెంచరీలు.. నాలుగు హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. దీంతో కామిందు మెండీస్ ఒక ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఆడిన తొలి 8 టెస్టుల్లో 50కి పైగా స్కోర్ చేసిన తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్ కు చెందిన సౌద్ షకీల్ వరుసగా 7 సార్లు 50 కి పైగా స్కోర్లు చేసిన రికార్డును బ్రేక్ చేశాడు. ప్రస్తుతం మెండీస్ 13 ఇన్నింగ్స్ ల్లోనే 1000 పరుగులకు చేరువలో ఉన్నాడు. 

గాలే వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే మెండీస్ సెంచరీతో పాటు చండీమల్(116) తొలి రోజు సెంచరీతో మెరవడంతో శ్రీలంక భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 446 పరుగులు చేసింది. కుశాల్ మెండీస్ (20), కామిందు మెండీస్ (113) క్రీజ్ లో ఉన్నారు. ఏంజెలో మాథ్యూస్ 88 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.