కాంగ్రెస్​ ఖాతాలో కామారెడ్డి మున్సిపాలిటీ .. ఎన్నికకు బీఆర్​ఎస్​, బీజేపీ దూరం

  • చైర్​పర్సన్​గా గడ్డం ఇందుప్రియ

కామారెడ్డి, వెలుగు:  కామారెడ్డి మున్సిపాలిటీ  కాంగ్రెస్​ పార్టీ ఖాతాలో పడింది. చైర్​పర్సన్​గా  ఆ పార్టీకి చెందిన గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు.  చైర్​పర్సన్​ ఎన్నిక కోసం సోమవారం మున్సిపల్​ ఆఫీస్​ కాన్ఫరెన్స్​ హాల్​లో  ఆర్డీవో రఘునాథ్​రావు  మీటింగ్​ నిర్వహించారు.  హైదరాబాద్​లో క్యాంపులో ఉన్న  కాంగ్రెస్​ కౌన్సిలర్లను బస్సులో నేరుగా మున్సిపల్​ ఆఫీసుకు తీసుకొచ్చారు. 

చైర్​పర్సన్​ పదవి కోసం ఇద్దరు కౌన్సిలర్లు పోటీ పడగా , ఎన్నిక టైంకు కొద్ది ముందు షీల్డ్​కవర్​లో వచ్చిన గడ్డం ఇందుప్రియ పేరును ప్రకటించారు.   మొత్తం 49 మంది సభ్యులకు గాను 28 మంది మీటింగ్​కు హాజరయ్యారు. మీటింగ్​కు హాజరైన వారంతా ఇందుప్రియకు మద్దతుగా చేతులెత్తడంతో  గడ్డం ఇందుప్రియ చైర్​పర్సన్​గా ఎన్నికైనట్లు ఆర్డీవో ప్రకటించారు. అనంతరం ఆమె చేత ప్రమాణం చేయించారు.  కార్యక్రమంలో కమిషనర్​ సుజాత పాల్గొన్నారు.

మీటింగ్​కు దూరంగా బీఆర్​ఎస్​, బీజేపీ కౌన్సిలర్లు

చైర్ పర్సన్​ ఎన్నిక మీటింగ్​కు  బీఆర్​ఎస్​, బీజేపీకి చెందిన 21 మందికౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. మిగతా పార్టీ కౌన్సిలర్లు కలిసి వస్తే తాము కూడా చైర్​పర్సన్​ పోటీలో ఉంటామని బీజేపీ ప్రకటించింది. బీఆర్​ఎస్​ కూడా పోటీలో ఉండేందుకు ప్రయత్నించింది.  చైర్​పర్సన్​ పదవి కోసం కాంగ్రెస్​ పార్టీలో ఇద్దరు కౌన్సిలర్లు పోటీ పడుతున్నందున  ఏమైనా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటే  రంగంలోకి దిగాలని రెండు పార్టీలు అనుకున్నా సాధ్యం కాలేదు. కాంగ్రెస్​ సభ్యులంతా  షీల్డ్​ కవర్​లో వచ్చిన వ్యక్తికే కౌన్సిలర్లు మద్దతు తెలిపారు.  పదవి ఆశించి దక్కని కౌన్సిలర్​ ఉరుదొండ వనిత నిరాశతో వెళ్లిపోయారు. 

పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి:  గడ్డం ఇందుప్రియ, చైర్​పర్సన్​

కామారెడ్డి టౌన్​ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని గడ్డం ఇందుప్రియ పేర్కొన్నారు. ఎన్నిక తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ... తనపై నమ్మకం ఉంచి చైర్​పర్సన్​ పదవి అప్పగించిన సీఎం రేవంత్​రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీకి కృతజ్ఞతలు తెలిపారు.  అందరి సహకారంతో  పని చేస్తానన్నారు.