కామారెడ్డి  పాలిటిక్స్​ @  గోవా

  • కాంగ్రెస్​, బీఆర్ఎస్​ క్యాంపులు అక్కడే
  • చైర్​పర్సన్​పై అవిశ్వాసం మీటింగ్​ ఈనెల 30న 

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి మున్సిపల్​ రాజకీయం గోవాకు షిఫ్ట్​ అయ్యింది. కాంగ్రెస్​ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లు గోవాలోని ఒక చోట క్యాంపు పెట్టగా, బీఆర్​ఎస్​ పార్టీలో ఒక వర్గానికి చెందిన 8 మంది కౌన్సిలర్లు అక్కడే మరో చోట క్యాంపు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 49 మంది కౌన్సిలర్లుండగా, ప్రస్తుతం 35 మంది గోవాలోనే మకాం వేశారు. కామారెడ్డి మున్సిపల్​ చైర్​పర్సన్​మీద అవిశ్వాసం ప్రతిపాదించడంతో రెండు పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెర తీశాయి.

బీఆర్​ఎస్​కు చెందిన ​చైర్​పర్సన్​ నిట్టు జాహ్నవిపై కాంగ్రెస్​కు చెందిన 27 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటిస్తూ ఈ నెల 11న కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​కు లేఖ ఇచ్చారు. అవిశ్వాసంపై ఈనెల 30 న మీటింగ్​ నిర్వహించనున్నట్టు కలెక్టర్​ నోటీసులు ఇచ్చారు. అవిశ్వాసాన్ని పెట్టిన వెంటనే కాంగ్రెస్​ కౌన్సిలర్లు ప్రత్యేక బస్సుల్లో క్యాంపునకు బయలుదేరారు. ఐదారు రోజులు హైదరాబాద్​చుట్టుపక్కనే మకాం వేసిన వారు గోవాకు తరలివెళ్లారు. 

 బీఆర్​ఎస్​లో రెండు గ్రూపులు 

 బీఆర్ఎస్​లో చైర్​పర్సన్​ను కలుపుకొని 16 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో చైర్ పర్సన్​ పట్ల అసంతృప్తితో ఉన్న 8 మంది గోవాలో నిర్వహిస్తున్న క్యాంపునకు వెళ్లారు. మిగిలిన 8 మంది మాత్రం స్థానికంగానే ఉన్నారు. 35మంది సభ్యులు హాజరయితేనే అవిశ్వాసం మీటింగ్ కు కోరం ఉన్నట్టు పరిగణిస్తారు. కాంగ్రెస్​తో ఇప్పుడున్న 27 మందితో పాటు బీఆర్ఎస్​నుంచి మరో 8 మంది మద్దతు అవసరం. బీజేపీకి ఆరుగురు కౌన్సిలర్లుండగా వారు అవిశ్వాసంపై తటస్థంగా ఉన్నారు.

వారి మద్దతు దొరికే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్​ లీడర్లు క్యాంపులో ఉన్న బీఆర్​ఎస్​కౌన్సిలర్లను ఆకర్శించే పని ఉన్నారు. వారు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వకుండా బీఆర్​ఎస్​ లీడర్లు జాగ్రత్త పడుతున్నారు. బీఆర్ఎస్​ సభ్యులు మీటింగ్​కు హాజరు కాకపోతే కోరం లేక మీటింగ్​ జరిగే అవకాశం ఉండదు.

మీటింగ్​ జరగకుండా చేసి చైర్ పర్సన్​ పదవిని నిలబెట్టుకోవాలని బీఆర్​ఎస్​ ప్రయత్నిస్తోంది. మరో 5 రోజుల్లో అవిశ్వాసంపై మీటింగ్​ జరగనుండగా.. ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తిగా మారింది.