రైతులను వెంటాడుతున్న  అకాల వర్షం..తడిసి ముద్దవుతున్న ధాన్యం

  •  పర్మల్లలో కొట్టుకపోయిన వడ్లు

లింగంపేట,వెలుగు: వానలు కురుస్తాయని వాతావరణశాఖ సూచనలు లేవు. పగలు ఎండ,అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతం అవుతోంది. రాత్రి మంచుకురుస్తోంది. ఇలాంటి వాతావరణ పరిస్థితులలో వర్షం కురవదనే నమ్మకంతో రైతులు ఉన్నారు. ఆ నమ్మకంతోనే పండించిన వడ్లను కొనుగోలు కేంద్రాలలో, రోడ్లపై ఆరబెడుతున్నారు.  అయితే వాతావరణ ఒక్కసారిగా మారి వర్షాలు కురుస్తుండటంతో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవుతోంది.  దీంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.  లింగంపేట మండలంలో  25వేల ఎకరాలలో వరి సాగుచేశారు.

 గురువారం మండలం లోని జల్దిపల్లి, భవానీపేట, ముంబాజీపేట, కొండాపూర్, కంచ్​మల్ గ్రామాలలో వర్షం కురిసింది. శుక్రవారం మెంగారం,పర్మల్ల,శెట్పల్లి, ఐలాపూర్​,బాయంపల్లి,బానాపూర్​,బోనాల్​,కొర్పోల్ ​తదితర గ్రామాలలో, గాంధారి మండలం గౌరారం, సీతాయిపల్లి, గండివేట్, మేడిపల్లి  గ్రామాలలో అకాల వర్షం దంచికొట్ట డంతో ఆరబెట్టిన ధాన్యం  తడిసి పోయింది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.  

వర్షంతో  తడిసిన వడ్లు

కామారెడ్డి టౌన్, వెలుగు:  కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం అకస్మాత్తుగా కురిసిన వర్షానికి  ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి.    కామారెడ్డితో పాటు, చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన రైతులను వడ్లను జిల్లా కేంద్రంలోని గంజులో ఆరబోశారు.  వడ్లు తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  టౌన్​తో పాటు మండలంలోని చిన్నమల్లారెడ్డి, లింగాపూర్​, దేవుపల్లి తదితర చోట్ల వర్షం కురిసింది.