- అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది నియామకాలపై విచారణ జరిపించాలని డిమాండ్
- మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం
- డీఎంహెచ్ వో సస్పెన్షన్ తో బయటకు రానున్న అక్రమాలు
కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి జిల్లా వైద్యశాఖలో ఇద్దరు కీలక ఆఫీసర్ల సస్పెన్షన్ సంచనలం రేకేత్తించింది. ఇక్కడ చోటు చేసుకున్న అక్రమాలపై గత ప్రభుత్వ హయాంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవు. తాము ఏమి చేసినా చెల్లుతుందనే విధంగా ఇక్కడి ఆఫీసర్లు వ్యవహరించారు. తాజాగా డీఎంహెచ్‌వోతో పాటు, ఆఫీసు సూపరింటెండెంట్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇద్దరు ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు, ఫండ్స్ వినియోగం తదితర అంశాలపై ఉన్నతాధికారులు మరింత దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
ప్రైవేటు హాస్పిటళ్ల రెన్యూవల్స్ విషయంలో అవినీతి
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాల్సిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పనితీరు గాడి తప్పింది. పీహెచ్‌సీల నిర్వహణకు వచ్చే ఫండ్స్ వినియోగం, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ నియమాకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్‌కు పర్మిషన్లు, రెన్యూవల్ చేయటానికి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
వీటిపై గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా చర్యలు తీసుకోలేదు. జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన వారు కూడా డీఎంహెచ్‌వో ఆఫీసుపై దృష్టి పెట్టలేదు. ఈ పరిస్థితుల్లో డీఎంహెచ్‌వో పాటు, ఆఫీసు లోని కొందరు సిబ్బంది మరింత ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తాజాగా డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్, ఆఫీసు సూపరింటెండెంట్ శీనునాయక్పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. అసభ్యకరమాటలతో తమల్ని వేధిస్తున్నారని పలువురు మహిళ మెడికల్ ఆఫీసర్లు ఉన్నతాధికారులకు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో డీఎంహెచ్‌వో, ఆఫీసు సూపరిండెంట్‌పై కేసులు నమోదయ్యాయి. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ అమర్‌సింగ్ నాయక్‌ను ఎంక్వైరీ ఆఫీసర్‌గా ప్రభుత్వం నియమించింది. ఎంక్వైరీ ఆఫీసర్ రిపోర్టుతో పాటు, కలెక్టర్ రిపోర్టు, పోలీసు కేసులు నమోదైన దృష్ట్యా ప్రభుత్వం ఇద్దరు ఆఫీసర్లపై చర్యలు తీసుకుంది. 6 రోజుల క్రితం ఆఫీసు సూపరింటెండెంట్ శీనునాయక్ను, ఈ నెల 25న డీఎంహెచ్‌వో లక్ష్మణ్ సింగ్‌ను సస్పెన్షన్ చేస్తూ హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఆరోపణల నేపథ్యంలో ఎంక్వైరీ షురూ కాగానే లక్ష్మణ్‌సింగ్ సెలవుపై వెళ్లగా డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ చంద్రశేఖర్‌ను ఇన్చార్జి డీఎంహెచ్‌వోగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.
మిగతా అక్రమాలపై ఎంక్వైరీ చేస్తే
కొద్ది నెలల క్రితం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేసిన నర్సింగ్ స్టాప్ నియామకాలు, ఫండ్స్ వినియోగంపై కూడా ఆరోపణలు ఉన్నాయి. అర్హు లైన వారిని పక్కన పెట్టి అనర్హులను నియమించారనే ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో లింగ నిర్ధారణ టెస్టులు చేస్తున్నారని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదనే విమర్శలు ఉన్నాయి.
ఫీహెచ్సీల్లో పని చేయాల్సిన పలువురు సిబ్బందిని డీఎంహెచ్‌వో ఆఫీసుకు డిప్యూటేషన్ వేశారు. ఆఫీసర్లకు అనుకూలమైన వారిని డిప్యూటేషన్‌పై నియమించారు. ఆయా ఆంశాలపై ఎంక్వైరీ చేస్తే అక్రమాలు బయటపడే అవకాశముంది. ఆఫీసును ప్రక్షాళన చేసి, రెగ్యులర్ డీఎంహెచ్‌వోను నియమిస్తే క్షేత్ర స్థాయిలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందడానికి వీలుంది .