సామర్థ్యం పెంచేలా.. ఫలితాలు సాధించేలా

  • ఇంటర్​ విద్యపై కామారెడ్డి జిల్లా  కలెక్టర్​ ప్రత్యేక కార్యాచరణ
  • తల్లిదండ్రులు, స్టూడెంట్స్​తో మీటింగ్​లు
  • స్టూడెంట్స్​రెగ్యులర్​గా కాలేజీకి వచ్చేలా చర్యలు 
  • స్పెషల్​ క్లాస్​ల నిర్వహణ
  • ఈఏడాది ఫలితాల్లో జిల్లాది చివరి స్థానం​

కామారెడ్డి, వెలుగు:  ఈ ఏడాది ఇంటర్​ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో నిలవడంతో కామారెడ్డి జిల్లా కలెక్టర్​ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. బోర్డు ఎగ్జామ్స్​లో మెరుగైన ఫలితాలు సాధించే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. స్టూడెంట్స్​పఠన, భావ వ్యక్తీకరణ సామర్థ్యం పెంపొందేలా స్పెషల్​ క్లాసులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రెగ్యులర్​గా స్టూడెంట్స్​ కాలేజీలకు వచ్చేలా చూడాలని అధ్యాపకులు, తల్లిదండ్రులకు సూచించారు. ఇంటర్​లో మెరుగైన ఫలితాల సాధనే లక్ష్యంగా అందరూ కృషిచేయాలన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని కలెక్టర్​ తెలిపారు.

ఫలితాల్లో చివరి స్థానం

జిల్లాలో  19 ప్రభుత్వ జూనియర్​ కాలేజీలు ఉన్నాయి.  ఇందులో ఫస్ట్ ఇయర్​లో జనరల్​2,144 మంది, ఒకేషనల్​లో  376 మంది స్టూడెంట్స్​ ఉన్నారు.  సెకండ్​ ఇయర్​లో  జనరల్​ 2,129, ఒకేషనల్​లో 263 మంది ఉన్నారు.   ఇందులో  చాలామంది  రెగ్యులర్​గా క్లాస్​లకు అటెండ్​ కావడంలేదు.  కొన్ని కాలేజీల్లో  సగటున 50 నుంచి 60  శాతం అటెండెన్స్ మాత్రమే ఉంటోంది.  

 వ్యవసాయ పనులు ఉన్నాయని,  రవాణా వసతులు లేవని, ఇతర కారణాలు చెబుతూ కాలేజీకి రావడంలేదని అధ్యాపకులు, అధికారులు గుర్తించారు.   ఈఏడాది ఇంటర్​ ఫలితాల్లో  కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో నిలిచింది.   ప్రభుత్వ, ప్రైవేట్​ కాలేజీలు కలుపుకొని ఫస్ట్ ఇయ్యర్​లో 34.81 శాతం, సెకండియర్​లో 44.29 శాతం పాసయ్యారు.  గవర్నమెంట్​ కాలేజీల ఉత్తీర్ణత శాతం 30 శాతం లోపు ఉంది.   

మెరుగైన ఫలితాల సాధన కోసం

గత ఏడాది ఫలితాలపై కలెక్టర్​ రివ్యూ చేశారు.  ప్రధానంగా ప్రభుత్వ కాలేజీల్లో  రిజల్ట్ చాలా తక్కువగా ఉండటంపై విస్మయం వ్యక్తం చేశారు.  ప్రభుత్వ కాలేజీల్లో ఎక్కువగా చదివేది పేద, మధ్య తరగతి స్టూడెంట్స్​.  వీరిని ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని  కలెక్టర్​ భావించారు.  ఇందుకోసం ఇప్పటి నుంచే స్టూడెంట్స్​ఆయా సబ్జెక్టుల్లో పట్టు సాధించేలా ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఇటీవల జిల్లా  స్థాయిలో ఇంటర్​, ఇతర ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​ ఏర్పాటు చేసి మార్గనిర్దేశం చేశారు. 

కాలేజీల వారీగా మీటింగ్​లు

స్టూడెంట్స్, తల్లిదండ్రులతో ప్రతీనెల మీటింగ్​లు నిర్వహించాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఈనెల 19 నుంచి కాలేజీల వారీగా మీటింగ్స్​ నిర్వహిస్తున్నారు.  దోమకొండ కాలేజీ మీటింగ్​కు కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​ హాజరయ్యారు. తల్లిదండ్రులు, స్టూడెంట్స్​తో మాట్లాడి  సమస్యలు తెలుసుకున్నారు.   రెగ్యులర్​గా కాలేజీకి వచ్చి  క్లాసులు వింటే సబ్జెక్టులపై పట్టు వస్తుందని స్టూడెంట్స్​కు సూచించారు. 

 పిల్లలను రెగ్యులర్​గా కాలేజీలకు పంపితే ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.  దోమకొండ కాలేజీలో వాటార్​ ప్రాబ్లమ్​ ఉందని ఆయన దృష్టికి తీసుకురాగా పరిష్కరిస్తానన్నారు.  జిల్లా ఆఫీసర్ల రివ్యూ మీటింగ్​తో పాటు, ఆయా కాలేజీల్లో నిర్వహిస్తున్న మీటింగ్​ల్లో  కాలేజీల టైమ్​కు అనుగుణంగా  ఆర్టీసీ బస్సులు నడవటం లేదని ఆఫీసర్లకు  స్టూడెంట్స్ తల్లిదండ్రులు తెలిపారు.    

స్పెషల్ క్లాస్​లు

స్టూడెంట్స్​కు ఉదయం, సాయంత్రం స్పెషల్​ క్లాస్​లు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్​గా ఎగ్జామ్స్​నిర్వహించి సబ్జెక్టుల్లో వెనుకబడిన వారి​పై స్సెషల్​ ఫోకస్​ చేస్తున్నారు.   సబ్జెక్టుల వారీగా నోట్స్​ ఇస్తున్నారు. రెగ్యులర్​గా కాలేజీకి వచ్చే విధంగా చూస్తున్నారు.  

నిరంతరం పర్యవేక్షిస్తున్నాం

ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తున్నాం. కలెక్టర్​ ఆదేశాలతో కాలేజీల వారీగా తల్లిదండ్రులు, స్టూడెంట్స్​తో మీటింగ్​లు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే 15 కాలేజీల్లో పూర్తయ్యాయి.  లెక్చరర్లతోనూ మాట్లాడుతున్నాం.  స్టూడెంట్స్​కు అర్థమయ్యే విధంగా సబ్జెక్టులు  చెప్పాలని సూచించాం. రెగ్యులర్​గా కాలేజీకి రాని స్టూడెంట్స్​తో మాట్లాడి వారు కాలేజీకి వచ్చేలా చూస్తున్నాం.

రెగ్యులర్​ క్లాస్​లతో పాటు స్పెషల్​ క్లాస్​లతో సబ్జెక్ట్​పై పట్టు సాధించేలా చూస్తున్నాం.  సమస్యలను కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్తే వాటిని పరిష్కరిస్తున్నారు. -షేక్​సలాం, ఇంటర్మీడియల్ నోడల్​ ఆఫీసర్,​- కామారెడ్డి