స్టూడెంట్లే బ్రాండ్ అంబాసిడర్లు...ప్రమాదాల నివారణకు పోలీసుల కొత్త ప్లాన్​

  •  61 స్కూల్స్​ నుంచి 122 మంది ఎంపిక ​
  •  ట్రాఫిక్​ రూల్స్​ పాటించేలా పేరెంట్స్​కు పాఠాలు 

కామారెడ్డి​, వెలుగు : రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కామారెడ్డి జిల్లా పోలీసు యంత్రాంగం కొత్తగా ప్లాన్​ చేస్తోంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్టూడెంట్స్​ను బ్రాండ్​ అంబాసిడర్లుగా నియమించింది. వారితో పేరెంట్స్​, స్థానికులకు ట్రాఫిక్​ నిబంధనల గురించి చెప్పి ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలో అవగాహన కల్పించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందుకోసం జిల్లాలోని 61 గవర్నమెంట్​ స్కూల్స్​ నుంచి 122 మంది స్టూడెంట్స్​ను ఎంపిక చేశారు.

వీరికి శనివారం కామారెడ్డిలో శిక్షణ ఇవ్వనున్నారు. కామారెడ్డి జిల్లా మీదుగా 2 నేషనల్ హైవేలు వెల్తున్నాయి. వందల కిలోమీటర్ల ఆర్​అండ్​బీ, పంచాయతీరాజ్ రోడ్లు ఉన్నాయి. జిల్లాలో రోజూ ఏదో ఓ చోట యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఏటా వందల మంది యాక్సిడెంట్లలో చనిపోతుండగా.. ఎంతో మంది గాయాలపాలవుతున్నారు. క్షేత్రస్థాయిలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నా ప్రమాదాలు మాత్రం తగ్గటం లేదు. 

ప్రమాదాలు ఎక్కువే

 జిల్లాలో 2023లో మొత్తం 501 యాక్సిడెంట్లు జరిగాయి. వీటిలో 236 మంది చనిపోగా, 480 మంది గాయపడ్డారు. 2024లో సెప్టెంబర్​ నెలాఖరు నాటికి 428 యాక్సిడెంట్లు జరగ్గా 230 మంది చనిపోయారు. 401 మంది గాయపడ్డారు. భిక్కనూరు, కామారెడ్డి, సదాశివనగర్​, పిట్లం, నిజాంసాగర్​, మద్నూర్, దోమకొండ, బీబీపేట, జుక్కల్​ ఏరియాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మూడు నెలలకోసారి సంబంధిత శాఖల అధికారులు మీటింగ్​ నిర్వహించి ప్రమాద కారణాలను విశ్లేషిస్తున్నారు.

అలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నా అశించిన ఫలితాలు రావడంలేదు. రోడ్ల కండిషన్​ సరిగా లేకపోవడం, ప్రమాదకరమైన మలుపులు, యాక్సిడెంట్లకు అవకాశం ఉన్న చోట్ల హెచ్చరికల బోర్డులు లేకపోవడం లాంటి ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యంతో పాటు అతివేగం, తాగి బండ్లు నడపడం, సెల్​ఫోన్​ మాట్లాడుతూ డ్రైవ్​ చేయడం లాంటి తప్పిదాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. 

 రూల్స్ పై అవగాహన 

ట్రాఫిక్​ ఉల్లంఘనల వల్ల ప్రమాదాలు జరగకుండా నిరంతరం తనిఖీలు చేపడుతున్నా ఫలితం ఉండడంలేదు. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా జిల్లా పోలీసులు 122 మంది స్టూడెంట్స్ ను ఎంపిక చేసి వారిని ప్రమాదాల నివారణకు బ్రాండ్​ అంబాసిడర్లుగా నియమించారు. ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, వీటిని అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలపై వీడియోల ద్వారా స్టూడెంట్స్​కు అవగాహన కల్పిస్తారు.

ఈ అంశాలను తన ఇంట్లో, చుట్టుపక్కల ఇళ్లలో ఊర్లలో వారు ప్రజలకు వివరించనున్నారు. బైక్స్​ నడిపించేటప్పుడు హెల్మెట్​ ధరించటం, ఓవర్​ స్పీడ్, ట్రిపుల్​ రైడింగ్​ నివారణ, ట్రాఫిక్​ రూల్స్​గురించి చైతన్యం తెస్తారు. స్టూడెంట్స్​చెప్పడం వల్ల జనాల్లో  కొంతవరకైనా మార్పు వస్తుందని పోలీసు అధికారులు నమ్మకంతో ఉన్నారు. ​

ప్రజలకు సులభంగా అర్థం చేసుకునేలా చెప్పిస్తాం

 రోడ్డు ప్రమాదాల నివారణకు స్టూడెంట్స్​ను బ్రాండ్​ అంబాసిడర్లుగా నియమిస్తున్నాం. వీరికి శనివారం జిల్లా కేంద్రంలో అవగాహన ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. ప్రమాదాలు ఎలా చోటు చేసుకుంటున్నాయి, వీటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది వీడియోల ద్వారా చెప్తాం. స్టూడెంట్స్​ ఇక్కడ నేర్చుకున్న ఆంశాలను వారి తల్లిదండ్రులకు, చుట్టూ పక్కల వారికి చెబితే కొంతైనా మార్పు వస్తుంది.  సింధూశర్మ, ఎస్పీ, కామారెడ్డి