కామారెడ్డిటౌన్, వెలుగు : అంతర్రాష్ట్ర దొంగలను కామారెడ్డి జిల్లా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠా నెల రోజుల్లోనే 8 చోట్ల సిగరెట్లను చోరీ చేశారు. కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో వివరాలను ఎస్పీ సింధూశర్మ మీడియాకు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి జిల్లాకు చెందిన కుమావత్ భూందారాం అలియాస్ బాబూలాల్, కుమావత్ లక్ష్మణ్, కుమావత్ ఘన్‌శ్యామ్ ముఠాగా ఏర్పడి సిగరెట్ కంపెనీలకు చెందిన డిస్ట్రిబ్యూటర్ల షాపులను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు.
ఇటీవల జిల్లా కేంద్రంలోని గంజ్ ఏరియాలోని సిగరెట్ డిస్ట్రిబ్యూటర్ షాపులో చోరీ జరిగింది. దొంగలను పట్టుకునేందుకు డీఎస్పీ ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ, టౌన్ సీఐ ఆద్వర్యంలో టీమ్స్ ఏర్పాటు చేశారు. టెక్నాలజీ వినియోగించి దొంగలను గుర్తించారు. వెహికల్స్ తనిఖీలో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని ఎంక్వైరీ చేయగా, దొంగతనం చేసినట్లు అంగీకరించారు. కుమావత్ భూందారాం, కుమావత్ లక్ష్మణ్రామ్ను అరెస్ట్ చేశామని
మరొకరు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వీరి నుంచి రూ. 8 లక్షల నగదు, బ్యాంక్ అకౌంట్లో రూ.7.50 లక్షల డిపాజిట్, కారు, 3 సెల్ఫోన్లు, గడ్డపార, స్ర్కూ డ్రైవర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీఐలు శ్రీనివాస్, చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఐలు ఉస్మాన్, మహేందర్‌రెడ్డిని ఎస్పీ ప్రశంసించారు.