కామారెడ్డిలో సౌలత్​లు లేక పరేషాన్..ఇరుకు గదుల్లోనే ట్రీట్​మెంట్​

  • సరిపడా బెడ్స్​లేవు
  • తాగునీరు కూడా బయట నుంచి తెచ్చుకోవాల్సిందే
  • కామారెడ్డి జిల్లా హాస్పిటల్​ పరిస్థితి అధ్వానం
  • పేషెంట్లకు తప్పనితిప్పలు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా హాస్పిటల్​ను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. హాస్పిటల్​ స్థాయి పెరిగినా అందుకనుగుణంగా సౌలత్​లు కల్పించకపోవడంతో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ట్రీట్​మెంట్​కోసం రోజూ వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్​కు వస్తుంటారు. అవుట్, ఇన్​పేషెంట్లతో కిక్కిరిసిపోతుంది. పేషెంట్ల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ప్రధానంగా ఇన్​పేషెంట్లకు బెడ్స్​సరిపోవడం లేదు. తాగునీటి ప్రాబ్లమ్​తీవ్రంగా ఉంది. హాస్పిటల్​ కూడా ఇరుకిరుకుగా మారింది. గతంలో 100 బెడ్స్​తో ఏరియా హాస్పిటల్​గా ఉన్న దీన్ని జిల్లాల ఏర్పాటు తర్వాత  జిల్లా హాస్పిటల్​గా అప్​గ్రేడ్​ చేశారు. బెడ్స్​ను 100 నుంచి 200​కు పెంచారు. ఈ బెడ్స్ ​కూడా సరిపోవడం లేదు. గతేడాది జిల్లాకు మెడికల్​ కాలేజీని మంజూరు చేయడంతో హాస్పిటల్​ను టీచింగ్​హాస్పిటల్​గా మార్చారు.

మరో 100 బెడ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతమున్న బిల్డింగ్​పైనే టెంపరరీగా షెడ్లు వేశారు. బెడ్స్, ఇతర మెటీరియల్స్​వచ్చాయి. అడిషనల్ బెడ్స్ ఇంకా వేయలేదు. డెలవరీల కోసం రోజూ 8 నుంచి 12 మంది గర్భిణులు వస్తుంటారు. యాక్సిడెంట్లు, ఇతర ఎమర్జెన్సీ కేసులు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీరితో పాటు వివిధ వ్యాధులతో ట్రీట్​మెంట్ ​పొందేవాళ్లు, సర్జరీలు చేయించుకున్న వాళ్లు ఇన్​పేషెంట్లుగా హాస్పిటల్​లో ఉంటారు. వీరందిరకీ బెడ్స్​అడ్జెస్ట్​ చేయడం ఇబ్బందవుతోంది.

నీళ్లు బయట నుంచే తెచ్చుకోవాలే

హాస్పిటల్​లో ఇన్​ పేషెంట్లుగా చేరేవాళ్లు, వారి సంబంధీకులు తాగేనీటిని బయట నుంచే తెచ్చుకోవాల్సిందే. డ్రింకింగ్​ వాటర్​ కోసం ప్లాంట్​ను ఏర్పాటు చేసినా అది సరిగా పని చేయడం లేదు. సరిపడా నీళ్లు లేక చాలా మంది హాస్పిటల్​ బయట దాతలు ఏర్పాటు చేసిన ట్యాంక్ నుంచి తాగునీటిని బాటిల్స్​లో తెచ్చుకుంటున్నారు.

కొత్త బిల్డింగ్​ పనులు త్వరగా కంప్లీట్​ చేస్తేనే..

మాత, శిశు సంరక్షణ హాస్పిటల్​ కోసం నిర్మించిన బిల్డింగ్​లో ప్రస్తుతం మెడికల్​ కాలేజీని నడుపుతున్నారు. కాలేజీ, హాస్పిటల్​ బిల్డింగ్ ​కోసం గతంలో రూ.400 కోట్లు శాంక్షనయ్యాయి. పనులు చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వం కాలేజీ, హాస్పిటల్​ బిల్డింగ్ ​పనులను త్వరగా కంప్లీట్ ​చేయిస్తే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి.

ఇరుకిరుకుగా..

దశబ్దాల కింద అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా హాస్పిటల్​ బిల్డింగ్ ను నిర్మించారు. ఇటీవల హాస్పిటల్ ​స్థాయి పెరిగింది. కొత్తగా విభాగాలు వచ్చాయి. వీటన్నింటిని ఇందులోనే రూమ్స్​లో అడ్జెస్ట్​ చేశారు. బిల్డింగ్​ ఇరుకుగా ఉండడంతో  పేషెంట్లు, వారి సంబంధీకులు, డాక్టర్లు, స్టాఫ్​ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్ ​బిల్డింగ్​కు చాలా చోట్ల పగుళ్లు వచ్చాయి.

Also read : జనగామ మున్సిపల్‌‌ బడ్జెట్‌‌ 27.43 కోట్లు

శానిటేషన్​ కూడా సరిగా లేదు. వార్డుల్లో ఎలుకలు తిరుగుతున్నాయి. ఇటీవల ఐసీయూలో ఉన్న పేషెంట్ ను​ ఎలుకలు కొరకడం చర్చనీయాంశమైంది. ఇద్దరు డాక్టర్లు, స్టాఫ్​నర్స్​ను సస్పెండ్​ చేశారు. వైద్య విధాన పరిషత్​ తరఫున సూపరింటెండెంట్​గా ఉన్న డాక్టర్​ విజయలక్ష్మిని బాధ్యతల నుంచి తప్పించి, టీచింగ్ హాస్పిటల్​లో జనరల్​ సర్జన్​ హెచ్​ఓడీ రాంసింగ్​కు బాధ్యతలు  అప్పగించారు.