వన్యప్రాణుల దాహం తీర్చేలా

  •      కలెక్టర్ ఆదేశాలతో  జీపీ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా 

లింగంపేట, వెలుగు: వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఏటా ఫిబ్రవరి నుంచి మే నెలాఖరు వరకు ఫారెస్టు ఆఫీసర్లు సాసర్ పిట్ లలో నీటిని నింపేవారు. కొంత కాలంగా నీటిని పోసేందుకు అయ్యే ఖర్చును అటవీ శాఖ విడుదల చేయకపోవడంతో కింది స్థాయి సిబ్బంది  సాసర్ పిట్‌‌‌‌‌‌‌‌లలో నీటిని నింపలేకపోయారు. ఇటీవల కామారెడ్డి జిల్లా కలెక్టర్​ వన్యప్రాణుల సంరక్షణపై ఫారెస్టు ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. నిధుల కొరత  కారణంగా సాసర్​పిట్‌‌‌‌‌‌‌‌లలో నీటిని పోయలేకపోతున్నామని కలెక్టర్​ దృష్టికి తెచ్చారు.  

గ్రామపంచాయతీ  ట్యాంకర్​ల ద్వారా వన్య ప్రాణులకు నీటిని అందించాలని జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశాలు జారీ చేశారు.  అటవీ శాఖ ఆఫీసర్లు, సిబ్బంది వారం రోజులుగా జీపీ ట్యాంకర్ల ద్వారా  సాసర్​ పిట్‌‌‌‌‌‌‌‌లలో నీటిని నింపుతున్నారు.  ఫలితంగా  మండు టెండలలో వన్యప్రాణుల దాహం తీరుతోంది.  కామారెడ్డి జిల్లాలో 82వేల హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి,నాగిరెడ్డిపేట, గాందారి,మాచారెడ్డి,బాన్సువాడ, పిట్లం,జుక్కల్​లో ఫారెస్టు రేంజ్​ కార్యాలయాలు ఉండగా..   మొత్తం 220 సాసర్ పిట్‌‌‌‌‌‌‌‌లు ద్వారా వన్యప్రాణుల దాహర్తిని తీర్చుతున్నారు.  జిల్లాలోని అడవుల్లో  మనుబోతులు, జింకలు, దుప్పులు,కొండ గొర్రెలు, అడవిఆలుగులు,ఏదు(ముళ్లపందులు)లు,కుందేళ్లు,నక్కలు, సాంబార్​లు,కోతులు, కొండెంగలు,ఉడుములు,అడవిపందులు,నెమళ్లు,కంజుపిట్టలు తదితర జాతులకు చెందిన వన్యప్రాణులు వేలసంఖ్యలో ఉన్నాయి.  చిరుతపులులు,ఎలుగుబంట్లు, అడవికుక్కలు పదుల సంఖ్యలో ఉన్నాయి.