- కామారెడ్డి జిల్లాలో 4,250 అప్లికేషన్లు పెండింగ్
- ఆర్డీవో, తహసీల్దార్లకు లాగిన్ తో సమస్యలకు చెక్
కామారెడ్డి, కామారెడ్డిటౌన్,వెలుగు: పెండింగ్ లో ఉన్న ధరణి అప్లికేషన్ల పరిష్కారంపై కామారెడ్డి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వివిధ దశల్లో పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లను ఈ నెలాఖరులోగా క్లియర్ చేయడంపై రెవెన్యూ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. గతంలో ధరణి ఆన్ లైన్ లాగిన్ కలెక్టర్ వద్ద మాత్రమే ఉండేది. అయితే ధరణిలో ఉన్న చాలా సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
చిన్నపాటి తప్పులను ధరణి సైట్ లో సవరించే అధికారం మండల, డివిజన్ స్థాయి రెవెన్యూ ఆఫీసర్లకు ఉండేది కాదు. పేర్లతో తప్పు, రికార్డుల్లో భూ వివరాలు తప్పుగా ఎంట్రీ అవటం, భూమి హెచ్చు తగ్గులుగా చూపటం, ప్రొహిబిటేడ్ ల్యాండ్ గా చూపటం లాంటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. పెద్ద సంఖ్యలో రైతులు ఆఫీసర్లకు ఫిర్యాదులు చేశారు.
ప్రజావాణికి ధరణి పై ఫిర్యాదులు..
జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి పదుల సంఖ్యలో రైతులు వచ్చి వినతులు ఇచ్చే వారు. వారాలు, నెలల తరబడి తిరిగిన ఫలితం లేకపోయేది. రికార్డులు, పట్టాదారు పాస్ బుక్ లో చిన్న పాటి పొరపాటును సరి చేయడానికి కూడా రైతులు యంత్రాంగం చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి సమస్య పరిష్కారంపై ఫోకస్ పెట్టింది. పెద్ద సంఖ్యలో వినతులు ఉన్న దృష్ట్యా ఆర్డీవోలు, తహసీల్దార్లకు కూడా లాగిన్ ఇచ్చారు.
కామారెడ్డి జిల్లాలో పరిస్థితి
ధరణిలో వివిధ మ్యాడుల్స్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కామారెడ్డి జిల్లాలో పెద్ద సంఖ్యలో అఫ్లికేషన్లు వచ్చాయి. 49,391 ఫిర్యాదులు వస్తే ఇందులో 33,451 అప్లికేషన్లను అప్రూవల్ చేశారు. వివిధ కారణాలు, సరైన పత్రాలు లేకపోవటం, కేసుల వంటి కారణాలతో 8,574 అఫ్లికేషన్లను రిజెక్టు అయ్యాయి. పెండింగ్‌లో ఉన్న వాటిలో తహసీల్ధార్ స్థాయిలో 4,250, ఆర్డీవో స్థాయిలో 344 ఉన్నాయి.
ఇందులో ప్రధానంగా రికార్డుల్లో డాటా కరెక్షన్, పేర్లు తప్పు పడటం, భూమి హెచ్చు తగ్గులు రావడం లాంటివి ఉన్నాయి. మ్యూటేషన్, ప్రొహిబిటెడ్, మార్పులు, చేర్పుల వంటివి ఉన్నాయి.పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యల అప్లికేషన్లను ఈ నెలాఖరులోగా పరిష్కరించటంపై రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. తహసీల్దార్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడం, రికార్డుల పరిశీలన వంటివి చేపట్టి వాస్తవమయితే అప్లికేషన్లను క్లియర్చేయనున్నారు.
రోజుకు 50 దరఖాస్తులు పరిష్కరించాలి
ధరణి, ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం ఆర్డీవోలు, తహసీల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా ధరణి అప్లికేషన్లు క్లియర్ చేయాలన్నారు. రోజూ 40 నుంచి 50 అఫ్లికేషన్లను క్లియర్ చేయాలని, ఆర్డీవోలు, తహసీల్దార్‌లతో మానిటరింగ్ చేయాలని అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్‌కు సూచించారు. కుల, ఆదాయ, రెసిడెన్షియల్ సర్టిఫికెట్లను కూడా జారీ చేయాలన్నారు. సీఎం ప్రజావాణి ఫిర్యాదులకు ప్రయార్టీ ఇచ్చి పరిష్కరించాలన్నారు.