జనవరి 3లోగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే కంప్లీట్​ చేయాలి : కలెక్టర్​ఆశిశ్​ సంగ్వాన్

  • కామారెడ్డి కలెక్టర్​ఆశిశ్​ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల సర్వే జనవరి3లోగా కంప్లీట్​ చేయాలని కామారెడ్డి కలెక్టర్​ఆశిశ్ ​సంగ్వాన్​ సూచించారు. శనివారం కలెక్టరేట్​లో  ఇందిరమ్మ ఇండ్ల సర్వే, శానిటేషన్, తాగునీటి సరఫరా,  కంపోస్టు ఎరువు తయారీ, ఉపాధి హామీ స్కీమ్, మహిళాశక్తి తదితర అంశాలపై  ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఇంజనీరింగ్​ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ..  సర్వేను స్పీడప్​ చేయాలన్నారు.  జిల్లాలో ఇండ్ల కోసం 2,38,682 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 1,39,194 అప్లికేషన్లపై సర్వే పూర్తయిందని, మిగతావి గడువులోగా పరిశీలించాలన్నారు.

మురుగు రోడ్లపై నిల్వకుండా చూడాలని,  డ్రైనేజీలు క్లీన్​గా ఉంచాలని పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.  పైపులైన్లు లీకేజీలకు రిపేర్లు చేయించాలని ఆదేశించారు.   జాబ్​కార్డు కలిగిన ప్రతి ఒకరికి ఉపాధి పనులు కల్పించాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్​రెడ్డి,  డీఆర్డీవో సురేందర్,  ఆయా శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.