తీరనున్న నీటి కష్టాలు

  • జలాల్​పూరు నుంచి కొత్త పైపులైన్​
  • 70 కిలోమీటర్లు.. రూ. 195 కోట్లు 

 కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి ప్రాంతానికి త్వరలో తాగునీటి కష్టాలు తీరనున్నాయి. పాత పైపులైన్​కారణంగా నీటి సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతుండటంవల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాత పైపులైన్​ స్థానంలో రూ. 195 కోట్లతో కొత్త పైపులైన్​ ఏర్పాటు కానుంది. దీంతో కామారెడ్డి టౌన్​తోపాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లోని గ్రామాలకు తాగునీటి సప్లై మెరుగుపడనుంది.   కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లోని 196 హబిటేషన్లతో పాటు, కామారెడ్డి టౌన్ తాగునీటి కోసం 2005లో అప్పటి ప్రభుత్వం మంచినీటి పథకాన్ని మంజూరు చేసింది.

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు నుంచి సదాశివనగర్​ మండలం మల్లన్న గుట్ట వరకు నీటిని తరలించి.. అక్కడ నీటిని శుద్ధి చేసి గ్రామాలకు సప్లై చేయాలని నిర్ణయించారు. కామారెడ్డిలో అదివరకే ఫిల్టర్​ బెడ్స్​ ఉండగా.. మిగిలిన గ్రామాలకు సప్లై అయ్యే నీటిని ఫిల్టర్​ చేసేందుకు మల్లన్న గుట్టపై భారీ ఫిల్టర్​బెడ్లను ఏర్పాటు చేసింది. రూ. 200 కోట్లు ఖర్చు చేసి 2009 వరకు ఫస్ట్​ ఫేజ్​ పనులు కంప్లీట్​చేశారు. మొదటి విడతలో కామారెడ్డి పట్టణానికి మంచినీరుఅందించగా.. ఆ తర్వాత క్రమంగా గ్రామాలకు విస్తరించారు. బీఆర్​ఎస్​ వచ్చిన తర్వాత ఈ స్కీమ్​ను మిషన్​ భగీరథలో కలిపేశారు. 

పాత పైపులైన్​లతో కష్టాలు 

ఈ స్కీమ్​లో భాగంగా శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​లో జలాల్​ పూర్​ వద్ద ఇన్​టెక్​ వెల్​ నిర్మించారు. జలాల్​పూర్​ నుంచి మల్లన్న గుట్ట వరకు మెయిన్​ పైపులైన్​వేశారు. ఇక్కడి నుంచి గ్రామాలకు డిస్ట్రిబ్యూటరీ పైప్​ లైన్లు వేశారు. జలాల్​పూర్​ నుంచి మల్లన్న గుట్ట వరకు ఉన్న మెయిన్​ పైపులైన్​ తరచూ పగిలి పోతుంది. లైన్​ పాతబడడంతో నీటి ప్రెజర్​ను తట్టుకోవడంలేదు. లీకేజీలు, పైపులు పగిలిపోవడంవల్ల గ్రామాలకు మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. కొన్నిసార్లు వారంలో 2, 3 రోజులు కూడా నీళ్లు సప్లై కావడంలేదు. ఒక చోట రిపేర్​ చేసేలోపు మరో చోట పైపులు పగిలిపోవడం సమస్యగా మారింది. దీంతో ఎండకాలంలో కామారెడ్డి పట్టణంతో పాటు చాలా గ్రామాల్లో తాగునీటికి కటకట ఏర్పడింది. మెయిన్​ పైపులైను రిపేరు చేయడంకన్నా కొత్త పైపులైన్​ వేయడమే మేలని   గత ప్రభుత్వం ఉండగానే నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. 

 రెండు నెలల్లో పనులు పూర్తి

పాత పైపులైన్​ స్థానంలో హైవే వెంట కొత్త మెయిన్​ పైపులైన్​ నిర్మాణ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. జలాల్​పూర్​ నుంచి మల్లన్నగుట్ట వరకు 70 కిలోమీటర్ల మేర కొత్త పైపులు వేస్తున్నారు. ఇప్పటికే ఇందల్​వాయి, దగ్గి, సదాశివనగర్​ ఏరియాల్లో పనులు కొనసాగుతున్నాయి. మరో 2 నెలల్లో వర్క్స్​ కంప్లీట్​ అవుతాయని ఆర్​డబ్ల్యుఎస్​ ఆఫీసర్లు పేర్కొన్నారు. ఈ మెయిన్​ ​ పైపులైన్​ నిర్మాణం జరిగితే నీటి సప్లయ్​ మరింత మెరుగుకానుంది. కామారెడ్డి మున్సిపాలిటీతో పాటు, కామారెడ్డి, భిక్కనూరు, మాచారెడ్డి, దోమకొండ, రామారెడ్డి, రాజంపేట, సదాశివనగర్​, గాంధారి, తాడ్వాయి మండలాల్లోని గ్రామాలకు నీటి సప్లయ్​ సమస్య తీరనుంది. అంతరాయం లేకుండా నీటి సరఫరా జరగనుంది.