కమలా హారిస్ ముందంజ

 

  • వాషింగ్టన్ పోస్ట్ సర్వేలో ఆమెకు 49 శాతం ఓట్లు 
  • 45% ఓట్లతో డొనాల్డ్​ ట్రంప్  

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో కమలా హారిస్ కు జనం మద్దతు పెరుగుతోంది. తాజాగా వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్, ఐపీఎస్ఓఎస్ నిర్వహించిన పోల్ లో 49% ఓట్లతో కమల మొదటి స్థానం పొందారు. ట్రంప్ 45% ఓట్లతో వెనకబడ్డారు. అయితే, వియ్ ద పీపుల్ పార్టీకి చెందిన అభ్యర్థి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్​ను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సర్వేలో కమలకు 47% ఓట్లతో ఫస్ట్ ప్లేస్ పొందారు. ట్రంప్ 44%, కెన్నడీ జూనియర్ 5% ఓట్లతో రెండు, మూడోస్థానాల్లో నిలిచారు. జులైలో నిర్వహించిన సర్వేలో ట్రంప్ 43% ఓట్లతో ముందంజలో నిలవగా.. అప్పటి డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ 42%, కెన్నడీ జూనియర్ 9% ఓట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.

 తాజా సర్వేలో కేవలం 4 పాయింట్లు మాత్రమే ట్రంప్ వెనకబడ్డప్పటికీ.. కమల హవా క్రమంగా పెరుగుతోందని ఈ పోల్​లో తేలిపోయింది. కాగా, డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిని అధికారికంగా ఎన్నుకోవడం కోసం సోమవారం రాత్రి షికాగోలో ఆ పార్టీ జాతీయ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులోనే కమల అధికారికంగా పార్టీ అభ్యర్థిత్వానికి అంగీకారం తెలపనున్నారు. తన రన్నింగ్ మేట్ (వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి)గా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్​ను ఆమె అధికారికంగా ప్రకటించనున్నారు. ఒకవైపు డెమోక్రటిక్ పార్టీ జాతీయ సమావేశాలు జరుగుతుండగా.. మరోవైపు, ఎలక్షన్ సర్వేలో ట్రంప్ పై కమల పైచేయి సాధించడంతో ఆ పార్టీ క్యాడర్ లో ఫుల్ జోష్ నెలకొంది.