అమెరికా అధ్యక్ష రేసులో.. నల్ల కలువ దూకుడు

ప్రపంచ దేశాలకు పెద్దన్నలా వ్యవహరించే అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి వ్యూహాత్మకంగా.. హోరాహోరీగా మారాయి.  రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ ప్రెసిడెంట్ 78 ఏండ్ల డోనాల్డ్ ట్రంప్,   డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా,  వైస్  ప్రెసిడెంట్ 59 ఏండ్ల కమలాదేవి హారిస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతుండటంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రతి నాలుగేండ్లకు ఒకసారి యూఎస్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఏడాది నవంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి.

గెలిచిన అభ్యర్థి జనవరి 20న ప్రెసిడెంట్​గా ప్రమాణ స్వీకారం చేస్తారు.  ఈసారి అమెరికా అధ్యక్ష పీఠం అధిష్టించేదెవరు?  ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు?  రాజకీయంగా తమకు వచ్చే లాభమేంటి? తదితర అంశాలపై  ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తితో..ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. మరోవైపు భారత్ వారసత్వ మూలాలు కలిగిన కమలా హారిస్ అధ్యక్ష బరిలో నిలిచారు.  ఇంకోవైపు రిపబ్లిక్  వైస్ ప్రెసిడెంట్​గా 39 ఏండ్ల  జేమ్స్ డేవిడ్ వాన్స్( తెలుగు కుటుంబ సంతతి మహిళ చిలుకూరి ఉష భర్త ) పోటీ చేస్తుండగా.. వీరిద్దరి గెలుపుపై ఇండియాలోనూ ఆతృత నెలకొంది.  

అమెరికా కాంగ్రెస్​లో సెనేట్ (ఎగువ), హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(దిగువ) సభలు ఉంటాయి. వీటిని మన దేశ పార్లమెంట్​లోని 
రాజ్యసభ, లోక్​సభతో పోల్చి చూడొచ్చు. సెనేట్ కు చట్టాలు చేసే అధికారం ఉంటుంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా ఎన్నికైన అధ్యక్షుడు అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు చేపడతారు. ప్రెసిడెంట్ పరోక్ష పద్ధతిన ఎన్నికవుతారు. ఓటు హక్కు కలిగిన ఆ దేశ పౌరులు ఎలక్టోరల్ కాలేజీ సభ్యులకు ఓట్లు వేస్తారు.

అమెరికాలోని 50 రాష్ట్రాల్లో మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ సీట్లలో 270 స్థానాల్లో మెజారిటీ పొందిన పార్టీ అభ్యర్థి ప్రెసిడెంట్ అవుతారు. ఆయనతో పాటే ఉపాధ్యక్షుడు కూడా ఎన్నికవుతారు. మనదేశంలో ఉన్నట్టుగానే అక్కడ కూడా చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ.. వీటిలో రిపబ్లికన్ పార్టీ ( ఏనుగు గుర్తు), డెమోక్రటిక్ పార్టీ(గాడిద గుర్తు) ప్రధాన పార్టీలుగా గుర్తింపు పొందాయి. ఈ రెండు పార్టీల అభ్యర్థుల్లో ఒకరు ప్రెసిడెంట్ అవుతుంటారు. 

కమలా హారిస్​కు మద్దతుగా బైడెన్​ ప్రచారం

 కమలాదేవి హారిస్ తల్లి శ్యామల గోపాలన్​ది భారత్ లోని తమిళనాడు. క్యాన్సర్ పరిశోధకురాలు, పౌర హక్కుల కార్యకర్త.  తండ్రి డోనాల్డ్ హారిస్​ది కరేబియన్ దీవుల దేశం జమైకా. స్టాన్‌‌ఫోర్డ్ వర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్. శ్యామల గోపాలన్​, డొనాల్డ్​ హారిస్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కమల, మాయ.  అనంతరం శ్యామల, డొనాల్డ్​ విడిపోయారు. కమలా హారీస్ తన కెరీర్​ను లాయర్​గా ప్రారంభించారు. యూదు జాతీయుడైన లాయర్ డగ్లస్ ఎం హాఫ్‌‌ను ఆమె పెండ్లి చేసుకున్నారు. తన వృత్తిలో భాగంగా సెక్స్ ట్రాఫికింగ్, డ్రగ్స్ ముఠాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు.

బాధితులకు అండగా నిలిచి ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేశారు.  న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా ఉద్యమం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. రెండుసార్లు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ అయ్యారు. అమెరికా చరిత్రలో -అమెరికన్-– ఆఫ్రికన్ సంతతి మహిళల్లో వైస్ ప్రెసిడెంట్​గా ఎన్నికైన తొలి మహిళ కమలా హారిస్.  ఇప్పుడు ఎవరూ ఊహించనివిధంగా  అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా  రేసులోకి వచ్చి.. మరోసారి యావత్తు  ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.

కాగా,  అమెరికా ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్  రెండోసారి డెమోక్రటిక్ పార్టీ  తరఫున తొలుత అధ్యక్ష రేసులో నిలిచినా పలు విమర్శల కారణంగా తప్పుకుని.. కమలా హారిస్​కు మద్దతు పలికారు. డెమోక్రటిక్​ పార్టీ మొత్తం ఆమెకు అండగా ఉందని తెలిపేలా వాషింగ్టన్​లోని మేరీల్యాండ్​ కమ్యూనిటీ కాలేజ్​లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో  కమలా హారిస్​తో వేదిక పంచుకున్నారు. ఆమె ప్రెసిడెంట్​గా అద్భుతంగా పనిచేయగలరని బైడెన్​ కితాబిచ్చారు.

కాగా,  ఆమె అధ్యక్ష అభ్యర్థిగా ఖరారు కావడంతో ఆ దేశ రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆమె ఆలస్యంగా వచ్చినా జనాకర్షణలో ముందంజలో ఉన్నారు.  ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ కూడా చేపట్టారు.  ప్రెసిడెంట్ రేసులో కమలా హారీస్ ముందంజలో దూసుకెళ్తున్నట్టు ఇప్పటికే పలు పోల్ సర్వేలు స్పష్టం చేశాయి. వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్, -సియనా కాలేజీ వంటి సర్వేల్లో ట్రంప్ కంటే కమల మెరుగైన ఓట్ల శాతం పొందారు. 

కాంట్రావర్సీ నేత ట్రంప్​

మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు. హోటల్, క్యాసినో, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపార రంగాల్లో ఎంతో పేరు గడించారు. అంతేస్థాయిలో వివాదాస్పద నేతగానూ ట్రంప్​ పేరు పొందారు.  ట్రంప్‌‌ పూర్వీకులు జర్మనీ నుంచి వలస వెళ్లారు.  జన్మత: అమెరికన్ అయిన ట్రంప్ 2017– 2020లో తొలిసారి అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. తన పాలన కాలంలో ఇమ్మిగ్రేషన్,  టెర్రరిజం వంటి విధానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అంతర్జాతీయంగా సంచలనం సృష్టించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌‌ జోంగ్‌‌ ఉన్‌‌తోనూ 3 సార్లు భేటీ అయిన తొలి అమెరికా ప్రెసిడెంట్ కూడా ట్రంప్​నే.

కిమ్ ఉన్ తో భేటీకి ఏ దేశాధినేత కూడా సాహసించలేదు.  2021లో  ట్రంప్ మనదేశంలోనూ పర్యటించారు.  వడోదరాలోని  మొతేరా స్టేడియం ఓపెనింగ్ చేశారు.  ఇక్కడి నుంచే యూఎస్ అధ్యక్ష ఎన్నిక క్యాంపెయిన్ ప్రారంభించారు.  కొవిడ్​ను కట్టడి చేయలేకపోవడం,  నల్ల జాతీయుడు జార్జ్ లాయిడ్ పాశవిక హత్య వంటి ఘటనల కారణంగా తీవ్ర ఆరోపణలపాలై ఓటమి చెందారు. ప్రస్తుతం మళ్లీ రెండోసారి అధ్యక్ష బరిలో నిలిచారు.  నాలుగేండ్ల గ్యాప్  తర్వాత ఇలా పోటీపడే మాజీ అధ్యక్షుల్లో ట్రంప్ తొలివ్యక్తి కావడం విశేషం.

ఒకే ఒక్కడు ఒబామా

248 ఏండ్ల అమెరికా ప్రజాస్వామ్యంలో అధ్యక్ష ఎన్నికల చరిత్రను చూస్తే..1789లో తొలి ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ డీసీ నుంచి ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్ దాకా 46 మంది తెల్లజాతీయులు అధ్యక్షులు అయ్యారు.  వీరిలో వరుసగా రెండుసార్లు అధ్యక్షునిగా పనిచేసినవారు కూడా ఉన్నారు. అయితే, వీరిలో ఒకే ఒక్కడు.. బరాక్ ఒబామా.  అమెరికా ఖండం బయట జన్మించి అమెరికా అధ్యక్షుడైన మొట్టమొదటి వ్యక్తి బరాక్​ ఒబామా.

వరుసగా  ఆయన రెండుసార్లు అధ్యక్షుడై చరిత్ర సృష్టించారు. మహిళల్లో చూస్తే.. ఇద్దరు మాత్రమే ఉపాధ్యక్ష పదవికి పోటీపడగా.. తొలి ఆఫ్రికన్ అమెరికన్– తొలి ఏసియన్ అమెరికన్ కమలా హారిస్ మాత్రమే అయ్యారు. అమెరికా చరిత్రలో ప్రెసిడెంట్​గా ఒక్కసారి కూడా మహిళ ఎన్నిక కాలేదు.  ఇప్పుడు అమెరికన్ – ఆఫ్రికన్ ఉమెన్ ఇండియా వార సత్వ మూలాలు కలిగిన కమలా హారిస్  ముంగిట ఆ అవకాశం ఉంది. ఆమె గెలిస్తే అమెరికా ఫస్ట్ లేడీప్రెసిడెంట్​గా, శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన నల్లజాతి కలువగానూ కమలా హారిస్ చరిత్రకెక్కుతారు. 

కమల,  ట్రంప్ మధ్య క్యాంపెయిన్ వార్

దుండగుడి కాల్పుల్లో ప్రాణాపాయం నుంచి బయటపడిన ట్రంప్ అమెరికన్ల సానుభూతిని విశేషంగా చూరగొన్నారు. అధ్యక్ష ఎన్నికల గెలుపులోనూ ట్రంప్​ ముందంజలో దూసుకుపోయారు.  అయితే.. బైడెన్ వైదొలగిన తర్వాత కమలా హారిస్​ రేసులోకి వచ్చాక పొలిటికల్​ సీన్ మారిపోయింది.  ట్రంప్ ఒకింత వెనకబడిపోయారు.  ప్రెసిడెంట్ అభ్యర్థులు ఇరువురు ఒకరిపై ఒకరు పోటాపోటీగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

కమలా హారిస్​పై ట్రంప్ తీవ్ర పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారు.  కమ్యూనిస్టు, తీవ్రవాదిగానూ పోల్చుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే.. వెనిజులా వెళ్లిపోయి అక్కడే స్థిరపడతానంటూ తాజాగా ప్రకటించారు ట్రంప్.   అమెరికా కంటే సేఫెస్ట్ ప్లేస్ అదేనంటూ కూడా పేర్కొనడం గమనార్హం.  మరోవైపు  ట్రంప్ గెలిస్తే  అమెరికన్లకు ఎలాంటి హక్కులు ఉండవంటూ కమలా హారిస్ సైతం ప్రతి విమర్శలు చేస్తున్నారు. 

- వేల్పుల సురేష్,
సీనియర్ జర్నలిస్ట్