‘కమల, ట్రంప్’ కామెడీ షో!

  • న్యూయార్క్​లో ఎన్​బీసీ చానెల్ ‘శాటర్ డే నైట్ లైవ్’ షో 
  • సర్​ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన కమల

న్యూయార్క్: అధ్యక్ష ఎన్నికల తేదీ నవంబర్ 5 దగ్గరపడుతున్న వేళ.. ప్రెసిడెంట్ అభ్యర్థులు కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థులు టిమ్ వాల్జ్, జేడీ వాన్స్, ప్రెసిడెంట్ జో బైడెన్ శనివారం రాత్రి కామెడీతో నవ్వులు పూయించారు! న్యూయార్క్​లో ఎన్​బీసీ టీవీ చానెల్ ‘ప్రీ ఎలక్షన్ కోల్డ్ ఓపెన్’ పేరుతో నిర్వహించిన 50వ సీజన్ ‘శాటర్ డే నైట్ లైవ్’  షోలో వారు జోకులు పేల్చుతూ అందరినీ కడుపుబ్బా నవ్వించారు! వాస్తవానికి ఈ వెరైటీ షోలో కమల తప్ప మిగతా వారెవరూ పాల్గొనలేదు.

కానీ కమల, ట్రంప్, బైడెన్, వాల్జ్, వాన్స్​లను పోలిన పాత్రధారులు తమ నటనతో ఆకట్టుకున్నారు. శనివారం రాత్రి మిషిగన్ లోని డెట్రాయిట్​లో ఎన్నికల ప్రచారానికి కమల వెళ్లాల్సి ఉండగా.. అకస్మాత్తుగా ఈ షోకు హాజరై సర్ ప్రైజ్ చేశారు. రాత్రి 11.30 గంటలకు ప్రారంభమైన ఎస్ఎన్ఎల్ షోలో ముందుగా ట్రంప్ పాత్రధారి జేమ్స్ ఆస్టిన్ జాన్సన్ మాట్లాడారు. ట్రంప్​లాగా ఆరెంజ్ కలర్ జాకెట్ ధరించి, ఆయనలాగే హావభావాలు ప్రదర్శించారు. ఇటీవల ట్రంప్ మైక్ పని చేయకపోవడంపై చిరాకుపడుతూ, దానిని పోడియం కేసి కొట్టగా.. అదే సీన్​ను ఈ షోలో జాన్సన్ రక్తి కట్టించారు.

కీప్ కామ్–అలా.. క్యారీ ఆన్–అలా.. 

తర్వాత కమల పాత్రధారి యాక్టర్ మాయా రుడాల్ఫ్ తెరపైకి వచ్చారు. ఫిలడెల్ఫియాలో ప్రసంగానికి సిద్ధమవుతున్నట్టుగా నటించారు. అనంతరం స్టూడియోలో కమల పాత్రధారి, అసలైన కమలా హారిస్ ఎదురెదురుగా అద్దానికి అటూ ఇటూ కూర్చుని మాట్లాడుకుంటూ నవ్వులు పూయించారు. ‘కీప్ కామ్–అలా.. క్యారీ ఆన్..అలా’ అంటూ ఆమెను ప్రెసిడెంట్ గా ఎన్నుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

ఈ షోలో బైడెన్ పాత్రను డానా కార్వీ, కమల భర్త డగ్ ఎమోఫ్ పాత్రను ఆండీ శాంబర్గ్, కమల రన్నింగ్ మేట్ టిమ్ వాల్జ్ పాత్రను జిమ్ గఫిగన్, ట్రంప్ రన్నింగ్ మేట్ జేడీ వాన్స్ పాత్రను బోవెన్ యాంగ్ పోషించి రక్తి కట్టించారు. కాగా, 1976 నుంచి ఎన్నికల టైంలో ఆనవాయితీగా వస్తున్న ఈ షోలో గతంలో అనేక మంది అధ్యక్ష అభ్యర్థులు నేరుగా పాల్గొన్నారు.