అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్

  • డెమోక్రటిక్​ పార్టీ నుంచి అభ్యర్థిత్వం కోసం నామినేషన్​
  • కమల ఎంట్రీతో తాజా సర్వేల్లో ట్రంప్​కు తగ్గిన ఆధిక్యం
  • వైస్ ప్రెసిడెంట్​గా కమల ఫెయిలైందన్న ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం నామినేషన్ పత్రాలపై కమలా హారిస్ శనివారం సంతకం చేశారు. దీంతో ఆమె అధికారికంగా అధ్యక్ష ఎన్నికలబరిలోకి దిగినట్లయింది. ఎన్నికల్లో గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ పార్టీలో కమలకు భారీగా మద్దతు  వస్తుండటం, పోటీలో ఉన్నట్టు ఇతర నేతలెవరూ ప్రకటించకపోవడంతో ఆమె అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది. అయితే, వచ్చే నెలలో జరిగే సమావేశంలో తమ అధ్యక్ష అభ్యర్థిని డెమోక్రటిక్ పార్టీ సభ్యులు అధికారికంగా ఎన్నుకోనున్నారు. 

కమల ఎంట్రీతో మారిన సీన్.. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకూ డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రెసిడెంట్ జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండగా.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ భారీగా ఆధిక్యంలో కొనసాగారు. కానీ బైడెన్ తప్పుకొని, కమలకు మద్దతు ప్రకటించడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. తాజాగా పలు మీడియా సంస్థలు విడుదల చేసిన సర్వేల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ పై కమలా హారిస్ ఆధిక్యంలో ఉన్నారని వెల్లడైంది. 

ఆమెకు సొంత పార్టీ నుంచి మాత్రమే కాకుండా శ్వేత జాతియేతర ఓటర్లలోనూ భారీగా మద్దతు పెరుగుతున్నట్టు తేలింది.  తాజాగా నిర్వహించిన ఎన్నికల సర్వేలో కమల 49 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో, ట్రంప్ 47 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకటించింది. న్యూయార్క్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో కమలకు 47 శాతం, ట్రంప్ కు 48 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, ఇంతకుముందు సర్వేలో బైడెన్ 6 పాయింట్లు వెనుకంజలో ఉండగా.. కమల ఒక్క పాయింట్ మాత్రమే వెనకబడి ఉన్నారు.  

వైస్ ప్రెసిడెంట్​గా కమల ఫెయిల్: ట్రంప్

కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ గా ఫెయిల్ అయ్యారని మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. లక్షలాది మంది అమెరికాలోకి చొరబడుతున్నా ఆమె ఆపలేకపోయారని మండిపడ్డారు. శనివారం ఫ్లోరిడాలో నిర్వహించిన ‘ది బిలీవర్స్ సమిట్’లో ట్రంప్ మాట్లాడారు. ఎన్నికల్లో కమల గెలిస్తే, ఆమె అత్యంత తీవ్రమైన వామపక్ష అధ్యక్షురాలిగా అమెరికా చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. 

‘‘వామపక్ష భావజాలం ఉన్న సెనేటర్లలో కమలా హారిస్ మొదటి స్థానంలో ఉంటారు. ఆమె అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా వామపక్ష భావజాలాన్ని వ్యాప్తి చేస్తారు. అలాంటి వ్యక్తులనే జడ్జిలుగా నియమిస్తారు. అందుకే ఆమెను ఓడించాలి” అని అన్నారు. కాగా, నెట్ ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాస్టింగ్స్ కమలా హారిస్ కు 7 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చిన నేపథ్యంలో ట్రంప్ మద్దతుదారులు ‘నెట్ ఫ్లిక్స్’ను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. మరోవైపు పిల్లలు లేని వాళ్లు దేశాన్ని పాలించలేరంటూ తాను చేసిన కామెంట్లను రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వాన్స్ సమర్థించుకున్నారు.