నేను గెలిస్తే అమెరికాను.. ప్రపంచానికి మోడల్గా​ చేస్త: కమలా హారిస్

మిల్వాకీ: అమెరికా ప్రెసిడెంట్గా తనను గెలిపిస్తే దేశాన్ని ప్రపంచానికి ఒక మోడల్​గా నిలబెడతానని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అన్నారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్  గెలిస్తే.. దేశ ప్రజలను పరస్పరం శత్రువులుగా మార్చేస్తారని విమర్శించారు.

దేశ ప్రజలందరికీ ప్రెసిడెంట్​గా ఉండే వ్యక్తికి సమస్యలను కామన్ సెన్స్​తో పరిష్కరించే నేర్పు ఉండాలన్నారు. శుక్రవారం రాత్రి స్వింగ్ స్టేట్స్​లో కీలకమైన విస్కాన్సిన్ స్టేట్ లోని మిల్వాకీ కౌంటీలో జరిగిన ర్యాలీలో, మీడియా సమావేశంలో కమలా హారిస్ మాట్లాడారు.

‘‘ట్రంప్ హామీ ఇస్తున్న దానికంటే అమెరికన్లకు ఇంకా చాలా పొందే హక్కు ఉంది. ప్రజల పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతలను అర్థం చేసుకుని పాలించడం, మిగతా ప్రపంచానికి ఒక మోడల్​గా అమెరికాను నిలపగలిగే వ్యక్తి దేశానికి ప్రెసిడెంట్ కావాలి” అని ఆమె ఓటర్లకు సూచించారు. ‘‘నాతో ఏకీభవించని వారి అభిప్రాయాలను కూడా నేను వింటా. నిపుణుల సలహాలూ తీసుకుంటా. నేను అమెరికన్లు అందరికీ ప్రెసిడెంట్ లా ఉంటా” అని ఆమె స్పష్టం చేశారు. ‘‘ట్రంప్ మాత్రం అమెరికన్లను ఒకరికొకరు శత్రువులుగా మారుస్తారు.

ఆయన తన సమయాన్నంతా 
అమెరికన్లు ఒకరిని ఒకరు వేలెత్తి చూపేలా చేయడంలోనే గడిపేస్తారు. రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునేందుకు కుట్రలు చేయడంపైనే ధ్యాస పెడతారు. ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూస్తారు. అందుకే ఆయన శత్రువుల లిస్టు భారీగా పెరిగిపోయింది. ఆయన మునుపటిలా అమెరికన్లు ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోలేని స్థితికి దిగజారారు” అని కమల విమర్శించారు.

నాకు, ట్రంప్​కు ఉన్న తేడా చూడండి..
ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలనకు అమెరికా ప్రాధాన్యం ఇస్తున్నందుకే.. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ, అవకాశాల కోసం చూస్తున్న వారందరికీ అమెరికా ఆదర్శంగా నిలుస్తోందని కమలా హారిస్ అన్నారు. ఈ ఎన్నికల రేసులో.. ఎవరు ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం నిలబడ్డారో.. ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో అన్నది గమనించాలన్నారు. ‘‘తనను వ్యతిరేకించే వారిపై ప్రతీకారం తీసుకుంటాననేలా ట్రంప్ మాట్లాడతారు. కానీ నేను మాత్రం ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తా. అందుకే నేను ప్రెసిడెంట్​గా ఎన్నికైతే రిపబ్లికన్ పార్టీ సభ్యుల్లో ఒకరిని తన కేబినెట్​లోకి తీసుకోవాలని అనుకుంటున్నా. ట్రంప్​కు, నాకు ఉన్న అతిపెద్ద తేడా ఇదే. నిజమైన లీడర్ ఎవరో ఈ తేడాను బట్టి మీరే అర్థం చేసుకోవాలి” అని ఓటర్లకు సూచించారు. 

ముందే ఓటేసినోళ్లు 6.27 కోట్లు
అమెరికా ఎన్నికల్లో అర్హత గల ఓటర్ల సంఖ్య 24 కోట్లు ఉండగా.. అధ్యక్ష ఎన్నికల్లో గత గురువారం నాటికే దాదాపు 6.27 కోట్ల మంది ముందస్తుగా ఓటు హక్కును వినియోగించు కున్నారు. ఇప్పటివరకు అన్ని రాష్ట్రాల్లో కలిపి ఆరు కోట్లకుపైగా మంది ఓటు వేసినట్టు గణాంకాలను బట్టి తెలుస్తోంది. అయితే, 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో కరోనా విపత్తు కారణంగా రికార్డ్ స్థాయిలో ఓటర్లు ముందస్తు ఓటింగ్​లో పాల్గొన్నారు. ఆ ఏడాది మొత్తం 10.15 కోట్ల మంది ముందస్తుగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2016లో 4.72 కోట్ల మంది, 2012లో 4.62 కోట్ల మంది ఎర్లీ ఓటింగ్​లో పాల్గొన్నారు.  

తులసేంద్రపురంలో సందడి 
కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో తమిళనాడులోని ఆమె పూర్వీకుల గ్రామం తులసేంద్రపురంలో సందడి నెలకొంది. ఎన్నికల్లో కమల గెలవాలని ఆ గ్రామస్తులు పూజలు చేస్తున్నారు.  గ్రామంలోని దేవాలయం వద్ద, ఇతర ప్రాంతాల్లో కమల ఫొటోలతో ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. కమలా హారిస్ తాత(ఆమె తల్లి శ్యామలా గోపాలన్ తండ్రి పీవీ గోపాలన్) పుట్టి పెరిగింది ఇదే ఊరు. కమల ఐదేండ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె తల్లితండ్రులు అమెరికా వెళ్లి సెటిలయ్యారు.

ప్రస్తుతం గ్రామంలో కమల బంధువులు ఎవరూ నివసించడంలేదు. వారికి చెందిన ఓ ప్లాట్ మాత్రమే అక్కడ ఉంది. అయినా, కమల పూర్వీకుల గ్రామంగా తమ ఊరికి ఎంతో పేరు వచ్చిందని, అందుకే తమ ఊరి ముద్దుబిడ్డగా ఆమెను అభిమానిస్తున్నామని ఆ గ్రామస్తులు చెప్తున్నారు. కమల గౌరవార్థం ఓ వాటర్ ట్యాంకుకు, బస్టాప్ కు, వీధికి కూడా ఆమె పేరు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో కమల వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు కూడా ఆమె గెలవాలని తులసేంద్రపురం గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు.