భిక్కనూరులో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రగడ


   వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్, బీజేపీ లీడర్లు

భిక్కనూరు,  వెలుగు: భిక్కనూరులో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ గొడవకు దారితీసింది. లబ్ధిదారులకు తామే చెక్కులు అందజేస్తామంటూ కాంగ్రెస్, బీజేపీ లీడర్లు వాగ్వాదానికి దిగారు. మండలకేంద్రంలో సోమవారం ఎమ్మార్వో శివప్రసాద్​ఆధ్వర్యంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రోగ్రామ్​కు కాంగ్రెస్, బీజేపీ లీడర్లు వచ్చారు. లబ్ధిదారులకు చెక్కులు అందించే విషయమై రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉందని, తామే చెక్కులు ఇస్తామంటూ కాంగ్రెస్​ లీడర్లు పేర్కొన్నారు. 

స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కృషి వల్లే చెక్కులు మంజూరయ్యాయని తామే పంచుతామంటూ బీజేపీ లీడర్లు  లేచారు. దీంతో ఇరువర్గాల వారు వాగ్వాదానికి దిగారు. ఎంపీపీ గాల్​రెడ్డి, ఎమ్మార్వో శివప్రసాద్​రెండు వర్గాల వారిని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం చెక్కులు పంపిణీ చేశారు. అభివృద్ధి చేసే విషయమై పార్టీలు పోటీ పడితే బాగుంటుందని అక్కడికి వచ్చిన లబ్ధిదారులు లీడర్లకు చురకలు అంటించారు.