కలికోట సూరమ్మ ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభం

కోరుట్ల, వెలుగు : జగిత్యాల జిల్లా కథలాపూర్‌‌ మండలంలోని కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్ట్‌ కోసం ఎన్నో పోరాటాలు చేశామని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ చెప్పారు. కలికోట సూరమ్మ ప్రాజెక్ట్‌ పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. 2018 ఎన్నికల్లో తనను ఓడించడానికి అప్పటి మంత్రి హరీశ్‌రావు రూ. 204 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి భూమిపూజ చేసి, ఆ తర్వాత పట్టించుకోలేదన్నారు. పీసీసీ హోదాలో  రేవంత్‌రెడ్డి మాట ఇచ్చి ఇప్పుడు నెరవేర్చారని చెప్పారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం 10 నెలల్లోనే ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను ప్రారంభించామన్నారు. ఇప్పటికే కుడి, ఎడమ కాల్వల నిర్మాణానికి 526 ఎకరాల భూసేకరణ కోసం కలెక్టర్ ఖాతాలో రూ.10 కోట్లు జమచేశామన్నారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న ప్రతిరైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్‌లో నష్టపోయే ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముంపు గ్రామాల ప్రజలకు 4,696 ఇండ్లు మంజూరు చేశామన్నారు.