కాళేశ్వరం కమిషన్​ ముందుకు ఐఏఎస్​లు!

  • మాజీ సీఎస్, సెక్రటరీలను ఓపెన్​ కోర్టుకు పిలవాలని యోచన
  • సమన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న జ్యుడీషియల్​ కమిషన్​​
  • ప్రాజెక్టు అనుమతులు, హై పవర్ కమిటీ మీటింగ్, కార్పొరేషన్​ వ్యవహారాలపై ఎంక్వైరీ
  • ఇవాళ్టి నుంచి కమిషన్​ ఓపెన్​ కోర్టు..మరో ఏడుగురు ఇంజినీర్ల విచారణ
  • కాగ్​, ఎన్​డీఎస్​ఏ, విజిలెన్స్​ రిపోర్టులపై ఆరా తీసిన కమిషన్​
  • కాంట్రాక్ట్​ సంస్థల ప్రతినిధులు, అకౌంటెంట్లనూ విచారించే చాన్స్​
  • సబ్​ కాంట్రాక్ట్​ వ్యవస్థలపై దృష్టి.. అవసరమైతే లీడర్లూ విచారణకు..

హైదరాబాద్​, వెలుగు : మేడిగడ్డ కుంగుబాటుపై కాళేశ్వరం జ్యుడీషియల్​​ కమిషన్​ క్రాస్​  ఎగ్జామినేషన్  ను స్పీడప్​ చేసింది. ఈ దఫా ఎట్టిపరిస్థితుల్లోనూ టెక్నికల్​ అంశాలకు సంబంధించిన విచారణను పూర్తి చేయాలని  భావిస్తున్నది. బుధవారం నుంచి విచారణను పునఃప్రారంభించి ఈ నెల 29 వరకు టెక్నికల్​ అంశాల విచారణను పూర్తి చేయాలని యోచిస్తున్నది. ఆ తర్వాత చివరి దశలో ఆర్థిక అంశాలపై ఓపెన్​ కోర్టు విచారణ చేపట్టాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. టెక్నికల్​ అంశాల్లో ఇప్పటికే పలువురు ఇంజినీర్లను ఓపెన్​ కోర్టు ద్వారా క్రాస్​ ఎగ్జామినేషన్​ చేసిన కమిషన్​..

ఇప్పుడు మిగిలిన ఇంజినీరింగ్​ ఆఫీసర్లతోపాటు ఇప్పటికే ఓపెన్​కోర్టులో విచారణ ఎదుర్కొన్న అధికారులనూ మరోసారి ఎంక్వైరీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.వారి విచారణ పూర్తవ్వగానే బ్యూరోక్రాట్లకూ (ఐఏఎస్​ అధికారులకు) సమన్లు జారీ చేయాలని, అందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషన్​ ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. ఆ తర్వాత ఆర్థికాంశాలపై దృష్టి సారించి, కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన పలువురు రాజకీయ నాయకులనూ పిలవాలన్న యోచనలో కమిషన్​ ఉన్నట్టు తెలుస్తున్నది. బుధవారం నుంచి రెండు సెషన్లుగా ఓపెన్​ కోర్టు విచారణను నిర్వహించాలని కమిషన్​ నిర్ణయించింది. 

ఏడుగురు ఐఏఎస్​లకు సమన్లు!

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ఏడుగురు ఐఏఎస్​ అధికారులకు జ్యుడీషియల్​ కమిషన్​ సమన్లు ఇవ్వనున్నట్టు తెలిసింది. మాజీ సీఎస్​తో పాటు ఇరిగేషన్​ శాఖకు సెక్రటరీలుగా పనిచేసిన అధికారులు, ఆర్థిక శాఖ మాజీ, ప్రస్తుత సెక్రటరీలకూ సమన్లు జారీ చేయనున్నట్టు సమాచారం. మాజీ సీఎస్​తో పాటు పలువురు ఇరిగేషన్​ సెక్రటరీల పేర్లను ఇప్పటికే క్రాస్​ ఎగ్జామినేషన్​లో ఇంజినీరింగ్​ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే బ్యారేజీకి సంబంధించిన అనుమతులు, డీపీఆర్​లు​, హైపవర్​ కమిటీ మీటింగ్​ వివరాలు, మేడిగడ్డ బ్యారేజీపై మహారాష్ట్ర సర్కారుతో జరిగిన మీటింగ్​ అంశాలు, నిర్మాణ సంస్థల ఎంపిక, కంప్లీషన్​ సర్టిఫికెట్​ జారీ తదితర అంశాల గురించి ఐఏఎస్​ అధికారులను ఆరా తీయనున్నట్టు తెలిసింది.

కాళేశ్వరం కార్పొరేషన్​ ఏర్పాటు నుంచి దాని ఆపరేషన్​ వరకు జరిగిన అంశాలనూ ఇరిగేషన్​ సెక్రటరీల నుంచి రాబట్టనున్నట్టు తెలుస్తున్నది.  అలాగే, టెక్నికల్​ అంశాలకు సంబంధించి మరో ఏడుగురు ఇంజినీరింగ్​ అధికారులనూ ఈ దఫా ఓపెన్​ కోర్టు ద్వారా విచారించనున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. రామగుండం రిటైర్డ్​ ఈఎన్సీతోపాటు ఇప్పటికే విచారణకు హాజరైన మరో ఈఎన్సీని పునర్​ విచారించనున్నట్టు సమాచారం. కమిషన్​ ముందు అఫిడవిట్​ దాఖలు చేసిన వి. ప్రకాశ్​ను కూడా ఈ విచారణలోనే క్రాస్​ ఎగ్జామినేషన్​ చేయనున్నట్టు తెలిసింది. 

ఏజెన్సీ ప్రతినిధులనూ..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కాంట్రాక్ట్​ సంస్థల ప్రతినిధులనూ ఈ సారి ఓపెన్​ కోర్టులో క్రాస్​ ఎగ్జామినేషన్ ​చేయాలని కమిషన్​ ఆలోచిస్తున్నది.  బ్యారేజీలను నిర్మించిన కాంట్రాక్ట్​ సంస్థల నుంచి ఆయా బ్యారేజీల మెజర్​మెంట్​ బుక్స్​కు సంబంధించిన వివరాలపై ఆరా తీయనున్నట్టు తెలిసింది. అలాగే, బ్యారేజీలు పూర్తయినట్టు ఇచ్చిన కంప్లీషన్​సర్టిఫికెట్​ వివరాలపైనా విచారణ జరపనున్నట్టు సమాచారం. ఆయా సంస్థల అకౌంటెంట్స్​తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ప్రభుత్వ అకౌంటెంట్లను విచారణకూ పిలిచే అవకాశముందని తెలిసింది.

ఈ దఫా విచారణ అనంతరం తుది దశలో బ్యారేజీల పనులను దక్కించుకున్న సబ్​ కాంట్రాక్ట్​ సంస్థలనూ విచారించే చాన్స్​ ఉందని సమాచారం. ఆయా సంస్థల బ్యాలెన్స్​ షీట్​, లావాదేవీలతో పాటు కాంట్రాక్టులు వచ్చిన తీరుపై  కమిషన్​ ఆరా తీయనుందని తెలుస్తున్నది. విచారణకు తగ్గట్టుగా చివరగా రాజకీయ నాయకులనూ ఓపెన్​ కోర్టుకు పిలవాలన్న యోచనలో కమిషన్​ ఉన్నట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన నాయకులతోపాటు ఆ ప్రాజెక్టును వ్యతిరేకించిన పలువురు ప్రతిపక్ష నేతల నుంచి స్టేట్​మెంట్లు రికార్డు చేయాలని కమిషన్​ భావిస్తున్నట్టు తెలిసింది. 

విచారణ చేస్తూనే రిపోర్ట్​పైనా ఫోకస్ 

కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ ఓ వైపు విచారణ కొనసాగిస్తూనే తుది నివేదికపైనా కసరత్తులు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న అధికారులు చెప్పిన విషయాల ఆధారంగా తుది నివేదికలో పెట్టాల్సిన అంశాలపై కమిషన్​ పనిచేస్తున్నట్టు సమాచారం.  ఆయా అంశాలతో ఓ ప్రాథమిక ముసాయిదాను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ దశలో అధికారుల విచారణ పూర్తై.. అన్ని రిపోర్టులూ అందితే త్వరలోనే కమిషన్​ రిపోర్టు కూడా సిద్ధమయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాల ద్వారా తెలిసింది.

3 రిపోర్టులపై దృష్టి

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 3 రిపోర్టులపై జ్యుడీషియల్​ కమిషన్​ సీరియస్​గా ఉన్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు, కార్పొరేషన్​పై కంప్ట్రోలర్​​ అండ్​ ఆడిటర్​ జనరల్​ (కాగ్​) రిపోర్ట్​తోపాటు మేడిగడ్డపై నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ), విజిలెన్స్​ డిపార్ట్​మెంట్​ల నివేదికల గురించి కూడా కమిషన్​ ఆరా తీసినట్టు తెలిసింది. పూర్తిస్థాయి నివేదిక వచ్చేందుకు ఆలస్యమవుతుందని కమిషన్​కు ఎన్​డీఎస్​ఏ వర్గాలు చెప్పినట్టు తెలిసింది. అయితే, దానికి సప్లిమెంట్​గా కమిషన్​కు అవసరమైన వివరాలు

డాక్యుమెంట్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్​డీఎస్​ఏ అధికార వర్గాలు వివరించినట్టు తెలిసింది. ఓ వారం పది రోజుల్లో అందుకు సంబంధించిన వివరాలను కమిషన్​కు అందించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇటు విజిలెన్స్​ రిపోర్ట్​పైనా కమిషన్​ ఆరా తీసినట్లు తెలిసింది. విజిలెన్స్​ రిపోర్టు కూడా ఓ వారం పది రోజుల్లో పూర్తవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే కాగ్​ అధికారులతో పాటు ఎన్​డీఎస్​ఏ, విజిలెన్స్​ అధికారులనూ ఓపెన్​ కోర్టుకు పిలిచే యోచనలో కమిషన్ ​ఉంది.