కేయూ భూముల సర్వే మధ్యల్నే ఆగింది.!

 

  • నెల కిందటే సర్వే స్టార్ట్​ చేసిన ఆఫీసర్లు
  • రెండు రోజులకే ఆపేయడంపై అనుమానాలు
  • ఇన్​చార్జి వీసీ చొరవ చూపితేనే వర్సిటీ భూముల రక్షణకు అడుగులు

హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీ భూముల రక్షణ చర్యలకు ఆదిలోనే బ్రేకులు పడ్డాయి. వర్సిటీకి చెందిన రూ.కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతం కాగా.. వాటిని కాపాడుకునేందుకు నెల రోజుల కింద చేపట్టిన ఫిజికల్​ సర్వే మొదట్లోనే ఆగిపోయింది. కొన్నేండ్ల నుంచి కేయూ ఆక్రమణల విషయంలో వివాదం నడుస్తుండగా.. ఇప్పుడు ఫిజికల్​ సర్వే నిలిపివేయడం వెనక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కబ్జాదారుల్లో వర్సిటీ, పోలీస్, మున్సిపల్​ డిపార్ట్​మెంట్​కు చెందిన ఆఫీసర్లు, పొలిటికల్​ లీడర్లుండడంతో అక్రమార్కులకు వంత పాడుతున్నారనే విమర్శలున్నాయి.

ఆఫీసర్లు, పొలిటికల్​ లీడర్ల హస్తం..

కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటు సమయంలో హనుమకొండ మండలంలోని కుమార్​పల్లి, లష్కర్​ సింగారం, పలివేల్పుల గ్రామాల పరిధిలో 673.12 ఎకరాల భూమిని సేకరించారు. కానీ, వరంగల్ నగరం నడిబొడ్డున ఉన్న ప్రాంతం కావడం, క్యాంపస్​ చుట్టూ సరైన రక్షణ లేకపోవడంతో కుమార్​ పల్లి శివారులోని 229, పలివేల్పుల శివారులోని 412, 413, 414, లష్కర్​ సింగారంలోని 34  సర్వే నంబర్లలో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయి. దీనిపై విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మూడేండ్ల కింద వర్సిటీ వీసీ ప్రొఫెసర్​ తాటికొండ రమేశ్​ హయాంలో డీజీపీఎస్​ సర్వే చేశారు. కుమార్​పల్లి శివారులోని సర్వే నంబర్​ 229లో భూమిని ఆక్రమించినట్లు తేలిన 17 మందికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. కాగా, ఆ సర్వే నంబర్​లోని ఆక్రమణదారుల్లో కేయూ అసిస్టెంట్  రిజిస్ట్రార్​  పెండ్లి అశోక్​బాబు పేరు ప్రధానంగా వినిపించింది. ఏఆర్​ అశోక్​ బాబు అప్పటి వీసీ రమేశ్​ కు సన్నిహితుడనే పేరుండగా.. ఆయనను కాపాడేందుకు అప్పటి వీసీ ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. ఇదిలాఉంటే వర్సిటీ భూముల రక్షణ కోసం ఏర్పాటు చేసిన కేయూ ల్యాండ్స్  కమిటీ కూడా ఓ రిపోర్ట్  తయారు చేసింది. అందులో కేయూ భూములు, ఆక్రమణదారులు, ఎక్కడెక్కడ ఎంతెంత కబ్జా అయిందో అన్ని వివరాలు పొందుపరిచారు. కాగా, ఆ రిపోర్టులో ఓ మాజీ ఎమ్మెల్యే, కార్పొరేటర్​తో పాటు కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్​ ఏఆర్​ అశోక్​బాబు, సర్వే అండ్​ ల్యాండ్​ రికార్డ్స్​ ఆఫీసర్లు ఇద్దరు, ఒక ఏసీపీ, సీఐ, ఒక ఎంవీఐ, ఎస్ఐ, తహసీల్దార్​ పేర్లు పొందుపరిచారు. ఈ రిపోర్టుకు కేయూ ఈసీ ఆమోదం తెలిపిన తరువాత సమగ్ర విచారణ జరిపి, కబ్జాదారులపై యాక్షన్​ తీసుకోవాల్సి ఉంది. కానీ,  ఇంటి దొంగలను వెనకేసుకొచ్చేందుకే ల్యాండ్​ కమిటీ రిపోర్టును పక్కన పెట్టారనే ఆరోపణలున్నాయి. 

వీసీ చొరవ చూపితేనే..

సర్వే పూర్తి చేసి కాంపౌండ్​ నిర్మిస్తామని చెప్పిన ఆఫీసర్లు.. ఆ తరువాత ఆ విషయాన్ని గాలికొదిలేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ భూముల ఆక్రమణలో ఉన్న ఆఫీసర్లు, పొలిటికల్ లీడర్లను వెనకేసుకొచ్చేందుకే ఆ విషయాన్ని లైట్​ తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఇన్​చార్జి  వీసీ చొరవతో కేయూ భూముల సర్వే, కాంపౌండ్​ నిర్మాణానికి కమిటీ ఏర్పాటు కాగా.. క్షేత్రస్థాయి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్ననారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో ఇన్​చార్జి వీసీ ప్రత్యేక దృష్టి పెట్టి కేయూ భూముల సర్వే పూర్తి చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రెండ్రోజుల్లోనే సర్వే స్టాప్..​

వర్సిటీ భూముల వ్యవహారాన్ని విద్యార్థి సంఘాలతో పాటు అసోసియేషన్​ ఆఫ్​ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్) ప్రతినిధులు కూడా పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత సర్కారు ఈ వ్యవహారాన్ని గాలికొదిలేయగా.. కాంగ్రెస్​ సర్కారు ఏర్పడిన తరువాత వర్సిటీ భూముల పరిరక్షణ,  కాంపౌండ్​ నిర్మాణానికి రూ.10 కోట్లు సాంక్షన్​ చేసింది. ఈ నేపథ్యంలో జులై 1న కాంపౌండ్​ నిర్మాణానికి ఆఫీసర్లు ఎలాంటి అభ్యంతరాలు లేని వరంగల్, -కరీంనగర్​ హైవే వైపు భూమి చదును పనులు ప్రారంభించగా.. ఆక్రమణకు గురైన భూముల విషయంలో  ఎలాంటి సర్వే నిర్వహించకుండానే కాంపౌండ్​ వాల్​ నిర్మించడంపై ‘వెలుగు’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన ఇన్​చార్జి వీసీ వాకాటి కరుణ కేయూ భూములపై ఫిజికల్​ సర్వే నిర్వహించాలని, ఈ మేరకు వర్సిటీకి చెందిన ఏడుగురు ఆఫీసర్లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. వారంతా కలిసి జులై 14న గుండ్ల సింగారం వైపు సర్వే ప్రారంభించారు. సర్వే పూర్తి చేసిన అనంతరం హద్దులు కూడా నిర్ణయిస్తామని చెప్పారు. కానీ, ఆ తరువాత రెండు రోజులు వర్షాలు కురవగా.. దానిని సాకుగా చూసి సర్వేకు బ్రేకులు వేశారు. నెల దాటినా ఇంతవరకు మళ్లీ సర్వే ప్రారంభించలేదు.

15 రోజుల్లో సర్వే పూర్తి చేస్తం..

కేయూ భూముల సర్వే ఆగిపోయిన మాట వాస్తవమే. ఉద్యోగుల బదిలీతో పాటు సర్వేయర్లు గౌరవెల్లి ప్రాజెక్టు పనుల్లో ఉండడం వల్ల సర్వే కాస్త ఆలస్యమైంది. వర్సిటీ భూముల రక్షణపై ఇన్​చార్జి వీసీ ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండు, మూడు రోజుల్లో సర్వే మళ్లీ ప్రారంభిస్తాం. 15 రోజుల్లో సర్వే కంప్లీట్​ చేసి హద్దులు నిర్ణయించి, కాంపౌండ్​ నిర్మాణానికి చర్యలు చేపడతాం.

–ప్రొఫెసర్​ ఎన్.వాసుదేవరెడ్డి, కేయూ డెవలప్​మెంట్​ ఆఫీసర్